telugudanam.co.in

      telugudanam.co.in

   

పిల్లల పాటలు (కొన్ని)

సూరీడు

వానలూ తగ్గాలి!

చలిగాలి పోవాలి!

చల్లనైన చలిని

దూరంగ తరమాలి!



గజగజలు పోవాలి

రవరవలు రావాలి

పులిలాంటి చలికూడ

బెదురుతూ పోవాలి!



రగ్గులా రక్షణలో

ఎందాక ఉంటాము

వేడికుంపటి కడను

ఎంత వరకుంటాము?

చలికత్తి గాయాలు

మాయమై పోవాలి

చురచురల సూరీడు

వెచ్చగా దూరాలి!!


[ వెనుకకు ]


గణితం ఘనత

అద్భుతమైనది ఈ గణితం

ఇది చేసే సేవలు మహోన్నతం

అందు, ఇందు ఎందైనా గలదని



సకల శాస్త్రాల దిశనిర్దేశం

కాంటరు కృషితో పుట్టెను సమితి

ఏనాటికి మరువం ఆయన ఖ్యాతి

గణిత సాధనే లక్ష్యంగా గల ఎబెల్



మన అందరికీ రోల్ మోడల్

భారతీయుల సృష్టే సున్న

గణిత సేవలో మనమే మిన్న

వారందరిచ్చిన గణిత సంపద

మన అందరిలో స్పూర్తి నింపగ



ఆర్యభట్టుని ఆదర్శంగ

భాస్కరాచార్య బాటలో నడవగ

రామానుజుని నిత్య స్ఫూర్తితో

శకుంతల వలె శరవేగంగా

అందరం నేర్వాలీ అద్భుత గణితం!


[ వెనుకకు ]


చిట్టి తల్లులు

మా మోముపై ప్రకాశం

మా ముంగిట ప్రసన్నం

మా మదిలో ప్రభాతం

మా మహిలో ప్రమోదం



అమ్మ కళ్లలో దివ్వెలం

నాన్న ఒళ్లో గువ్వలం

బడి గుళ్లో కూనలం

జాతి మెళ్లో మల్లెలం



పెద్దల్లారా! పెద్దోల్లారా!!

ముద్దుగా సంరక్షించే

కనురెప్పల్లారా

బుద్ధిగా 'చిరువాణి' ఆలకింప

మా వద్దకు రారండోయ్ బాబుల్లారా!


[ వెనుకకు ]


వేసవి సంబరాలు

సైకిల్ స్కూటీ సంబరము

ఆటో మోటార్ సంబరము



జీపులు బస్సుల సంబరము

చికుబుకు రైలు సంబరము



కోటల తోటల సంబరము

కొండలు కోనల సంబరము



గలగల యేరుల సంబరము

సంద్రపు అలలా సంబరము



ఆటల పాటల సంబరము

వినోద విహార సంబరము



ఆట విడుపుల సంబరము

వేసవి సెలవుల సంబరము


[ వెనుకకు ]


వానదేవుడా!

వానల్లు కురవాలి వానదేవుడా

వరిచేలు పండాలి వానదేవుడా!

నల్లనల్ల మేఘాలు వానదేవుడా

మెల్లంగ కురవాలి వానదేవుడా!



పచ్చనీ పైరులే వానదేవుడా

ఏపుగా ఎదగాలి వానదేవుడా!

చెరువులన్నీ నిండాలి వానదేవుడా

ఏరులై పారాలి వానదేవుడా!



చేలన్నీ పండాలి వానదేవుడా

గాదెలన్నీ నిండాలి వానదేవుడా!

కప్పలకు పెళ్ళిళ్ళు వానదేవుడా

గొప్పగా చెయ్యాలి వానదేవుడా!


[ వెనుకకు ]


చిలకలు

చింతా చెట్టు చిలకలతోటి

ఏమని పలికిందీ!

చిలకల్లారా! చిలకల్లారా!

ఛీ! ఛీ! పొమ్మంది



కొబ్బరిచెట్టు చిలకలతోటి

ఏమని పలికిందీ!

చిలకల్లారా! చిలకల్లారా!

ఛీ! ఛీ! పొమ్మంది



జామచెట్టు చిలకలతోటి

ఏమని పలికిందీ!

చిలకల్లారా, చిలకల్లారా!

రండీ, రండందీ!



మామిడిచెట్టు చిలకలతోటి

ఏమని పలికిందీ!

చిలకల్లారా, చిలకల్లారా!

రండీ, రండందీ!


[ వెనుకకు ] [ ముందుకు ]

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: