telugudanam.co.in

      telugudanam.co.in

   

పొరపాటు

ఒకరోజు ఒక దట్టమైన అరణ్యంలోని చెట్లు ఈ విధంగా చర్చించుకుంటున్నాయి.

"జంతువులు మన నీడలో విశ్రాంతి తీసుకోవడానికి వచ్చి ఇక్కడి ప్రదేశాన్నంతా అశుభ్రంగా మార్చి పోతున్నాయి" అంది ఒక చెట్టు.

"అవును. వాటి మలమూత్రాల దుర్వాసన భయంకరంగా ఉంటోంది. ఛీ" అని మరొక చెట్టు అంది.

"మనం మాట్లాడలేం కాబట్టి వాటికి అలుసైపోయాం. ఇకనుంచి జంతువులు మన దగ్గరకు రాకుండా తరిమి కొట్టాలి" అంది మరో చెట్టు.

వయసులో అన్నిటికంటే పెద్దదైన మర్రిచెట్టు వాటి సంభాషణ విని "ఇది తెలివైన ఆలోచన కాదు. జంతువుల వల్ల మనకు కొంత చిరాకు కలుగుతోంది. నిజమే ఒప్పుకుంటాను. కానీ మనమంతా ఒకరిపై ఒకరం ఆధారపడి బ్రతుకుతున్నాం. చెట్లు, జంతువులు, పక్షులు..." అంటూ ఇంకేదో చెప్పబోయింది.

"చూడు పెద్దక్కా! నువ్వు పెద్దదానివి. నీ పట్ల మాకు ఎంతో గౌరవం ఉంది. కాని ఈ విషయంలో నీ మాట వినదలచుకో లేదు. మేం జంతువులను మా దగ్గరకు రానివ్వం" అని కచ్చితంగా చెప్పేశాయి మిగతా చెట్లు.

అప్పుడే ఒక సింహం చెట్ల నీడలో కుర్చోడానికి వచ్చింది. చెట్లన్నీ కలిసి కొమ్మలు అటు ఇటు ఊపుతూ భయంకరమైన శబ్దాలు చేశాయి. దానితో భయపడ్డ సింహం అక్కడినుండి పారిపోయింది. ఇక ఆరోజు నుండి చెట్లు జంతువులను తరిమి కొట్టడమే తమ లక్ష్యంగా పెట్టుకున్నాయి. చిన్న జంతువును కుడా తమ నీడలోకి రానిచ్చేవి కావు. రానురాను జంతువుల రాకపోకలు పుర్తిగా తగ్గిపోయాయి. కొన్ని రోజుల తరువాత ఒక మనిషి గొడ్డలి భుజాన వేసుకుని అటువైపు వచ్చాడు.

"మనిషి ఇక్కడికెందుకు వచ్చాడు?" కంగారుగా అంది ఒక చెట్టు.

"ఎందుకేమిటి? మనల్ని చంపడానికి" నిర్వేదంగా జావాబిచ్చింది మర్రిచెట్టు. "ఇంతకు ముందయితే జంతువులు సంచరిస్తాయన్న భయంచేత మనుషులు ఇటువైపు వచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు వాళ్లకా భయం లేదు" అంది.

"చేజేతులా వినాశనాన్ని కొని తెచ్చుకున్నాం కదా" అని అన్ని చెట్లు విచారించాయి.

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: