www.telugudanam.co.in         చీరాల

తెలుగు పాఠాలు

చిన్నపిల్లల కోసం

మాగురించి

పత్రికలలో తెలుగుదనం

               మా అనుబంధ వెబ్‌సైట్..

సంస్కృతి, సంప్రదాయాలు

వనితల కోసం

సైట్‌మ్యాప్

తెలుగుదనం బ్లాగు

సాహిత్యం

అందరికోసం

సలహాలు

మా గీతా.కో.ఇన్

శ్రీ కాళహస్తీశ్వర శతకము

శ్రీ విద్యుత్క వితాజవంజన మహాజీమూత పాపాంబుధా

రావేగంబున మన్మనోబ్జ సముదీర్ణత్వంబు గోల్పోయితిన్

దేవా! మీ కరుణా శరత్సమయమింతేచాలు, చిద్భావనా

సేవందామరతంపరై మనియెదన్ శ్రీ కాళహస్తీశ్వరా!

వాణీవల్లభ దుర్లభంబగు భవద్ద్వారంబునన్నిల్చిని

ర్వాణశ్రీ చెరపట్టచూచిన విచారద్రోహమో, నిత్య క

ళ్యాణ క్రీడలబాసి, దుర్దశలపాలై, రాజలోకాధమ

శ్రేణి ద్వారము దూరజేసి దిపుడో శ్రీకాళహస్తీశ్వరా!

అంతా మిథ్య తలంచిచూచిన నరుండట్లౌటెరింగిన్ సదా

కాంతల్‌పుత్రులు నర్థముల్ తనువు నిక్కంబంచు మోహార్ణవ

భ్రాంతింజెంది చరించుగాని, పరమార్థంబైన నీయందు దా

చింతాకంతయు చింతనిల్పడుకదా శ్రీ కాళహస్తీశ్వరా!

నీ నాయం దొడబాటుమాట వినుమా, నీ చేత జీతంబు నే

గానింబట్టక, సతతంబు మరివేడ్కంగొల్తు నంతస్సప

త్నానీకంబున కొప్పగింపకుము నన్నా పాటియేచాలు, తే

జీనొల్లంగరినొల్ల నొల్లసిరులన్ శ్రీ కాళహస్తీశ్వరా!

భవకేళీమదిరామదంబున మహాపాపాత్ముడై వీడు న

న్ను వివేకింపడటంచు, నన్ను నరకార్ణోరాశిపాలైన బ

ట్టవు, బాలుండొకచోట నాటతమితోడ న్నూతగూలంగ దం

డ్రి విచారింపకయుండునా కటకటా! శ్రీ కాళహస్తీశ్వరా!

స్వామిద్రోహముచేసి, వేరొకని కొల్వన్‌బోతినో, కాక నే

నీ మాటల్విననొల్లకుండితినో? నిన్నే దిక్కుగా జూడనో?

యేమీ యిట్టి వృధాపరాధినగు నన్నీ దు:ఖవారాశి వీ

చీమధ్యంబున ముంచియుంపదగునా శ్రీ కాళహస్తీశ్వరా!

దివిజక్ష్మారుహ ధేనురత్నఘనభూతిన్ ప్రస్ఫురద్రత్నసా

నువునీవిల్లు, నిధీశ్వరుండుసఖు, డర్ణోరాశి కన్యావిభుం

డువిశేషార్చ కుడింక నీకెన ఘనుండున్ గల్గునే నీవు చూ

చి విచారింపవు లేమినెవ్వడుడుపున్? శ్రీ కాళహస్తీశ్వరా!

నీతో యుద్ధము చేయనోప, గవితానిర్మాణశక్తి నిన్నున్

బ్రీతుం చేయగలేను, నీ కొరకు తండ్రిన్ చంపగాజాల నా

చేతన్ రోకటి నిన్ను మొత్తవెరతుం చీకాకు నా భక్తియే

రీతిన్నాకిక నిన్ను చూడగనగున్ శ్రీ కాళహస్తీశ్వరా!

ఆలున్ బిడ్డలు తల్లిదండ్రులు ధనంబంచు న్మహాబంధనం

బేలా నామెడ గట్టినాడవిక నిన్నేవేళ జింతింతు, ని

ర్మూలంబైన మనంబులో నెగడుదుర్మోహాబ్ధిలో గ్రుంకి యీ

శీలామాలపు జింత నెట్లుడిపెదో శ్రీ కాళహస్తీశ్వరా!

నిప్పైపాతకదూలశైలమడచున్ నీనామము న్మానవుల్

దాపున్ దవ్వుల విన్ననంతన్ భుజాదర్పోద్ధత క్లేశముల్

తప్పుం దీరును ముక్తులౌదురని శాస్త్రంబుల్మహాపండితుల్

చెప్పంగా దమకింక శంకలుండవలెనా? శ్రీ కాళహస్తీశ్వరా!    10

వీడెంబబ్బినయప్పుడున్ దమనుతుల్ విన్నప్పుడుం బొట్టలో

గూడున్నప్పుడు గాయకుల్ శ్రీవిలాసములు పైకొన్నప్పుడుం

పాడంగా వినునప్పుడుం విశ్రాణన చెలగుదంభప్రాయ

క్రీడాసక్తుల నేమి చెప్పవలెనో శ్రీ కాళహస్తీశ్వరా!

నిను సేవింపగ నాపదల్పొడమనీ, నిత్యోత్సవంబబ్బనీ

జనమాత్రుండననీ మహాత్ముడననీ సంసారమోహంబు పై

కొననీ జ్ఞానముగల్గనీ గ్రహగతుల్ కుందింపనీ,మేలు వ

చ్చిన రానీ యవి నాకు భూషణములే శ్రీ కాళహస్తీశ్వరా!

ఏ వేదంబు పఠించెలూత, భుజగంబే శాస్త్రముల్సూచె దా

నేవిద్యాభ్యసం బొనర్చెగరి, చెంచేమంత్రమూహించె, బో

ధావిర్భావనిదానముల్ చదువులయ్యా? కావు, మీ పాదసం

సేవాసక్తియె కాక జంతుతతికిన్ శ్రీ కాళహస్తీశ్వరా!

కాయల్గాచె వధూనఖాగ్రములచే గాయంబు, వక్షోజముల్

రాయన్రాపడె ఱొమ్ము, మన్మధ విహరక్లేశ విభ్రాంతిచే

 ప్రాయంబాయెను, బట్టగట్టెతల, చెప్పన్ రోతసంసరామేఁ

 జేయంజాల, విరక్తు చేయగదవే శ్రీకాళహస్తీశ్వరా!

నిన్నే రూపముగా భజింతుమదిలో, నీరూపు మోకాలో? స్త్రీ

 చన్నో? కుంచమొ? మేక పెంటికయొ? యీ సందేహముల్మాన్పి, నా

 కన్ను లన్ఖవదీయమూర్తి సగుణాకారంబుగాఁ జూపవే

 చిన్నీ రేజ విహారమత్త మధుపా! శ్రీకాళహస్తీశ్వరా!

నిను నా వాకిలి గావుమంటినొ? మరున్నీ లాలకభ్రాంతి గుం

 టెనపొమ్మంటినొ? యెంగిలిచ్చితిను తింటేగాని కాదంటినో?

 నిను నెమ్మిం దగ విశ్వసించు సుజనానీకంబు రక్షింప చే

 సిన నావిన్నపమేలగై కొనవయా? శ్రీకాళహస్తీశ్వరా!

ఱాలన్ రువ్వగ చేతులాడవు, కుమారా! రమ్మురమ్మంచునే

చాలన్ చంపగ, నేత్రముల్దివియగా శక్తుండనేగాను,నా

శీలంబేమని చెప్పనున్నదిక నీ చిత్తంబు, నా భాగ్యమో

శ్రీ లక్ష్మీపతి సేవితాంఘ్రియుగళా! శ్రీ కాళహస్తీశ్వరా!

రాజుల్మత్తుల, వారి సేవ నరకప్రాయంబు, వారిచ్చు సం

భోజాక్షీ చరురంతయాన తురగీ భూషాదు లాత్మవ్యధా

బీజంబుల్, తదపేక్ష చాలు, పరితృప్తింబొందితిన్, జ్ఞానల

క్షీజాగ్రత్పరిణామ మిమ్ము, దయతో శ్రీకాళహస్తీశ్వరా!

నీ రూపంబు దలంపగా తుదమొదల్నేగాన నీవైనచో

రారారమ్మనియంచు చెప్పవు, వృధారంభంబులింకేటికిన్

నీరన్ముంపుము పాలముంపు మిక నిన్నే నమ్మినాడంజుమీ

శ్రీ రామార్చిత పాదపద్మయుగళా! శ్రీ కాళహస్తీశ్వరా!

నీకున్, మాంసము వాంఛయేని కరవా? నీచేత లేడుండగా

జోకైనట్టిగా కుఠారముండ ననలజ్యోతుండ నీరుండగా

పాకరంబొప్ప ఘటించి చేతిపునుకన్ భక్షింప కాబోయచే

చేకొంటెంగిలిమాంస మిట్లు తగునా శ్రీకాళహస్తీశ్వరా!    20

రాజై దుష్కృతి చెందెచందురుడు రారాజై కుబేరుండుదృ

గ్రాజీవంబునగాంచె దు:ఖము, కురుక్ష్మాపాలుడామాటనే

యాజింగూలెసమస్త బంధువులతో, నారాజశబ్దంబు ఛీ,

ఛీ! జన్మాంతరమందు నొల్లను జుమీ! శ్రీ కాళహస్తీశ్వరా!

రాజర్ధాతురుడైనచో నెచట ధర్మంబుండు? నేరీతి నా

నాజాతిక్రియ లేర్పడున్? సుఖము మాన్యశ్రేణికెట్లబ్బు రూ

పాజీవాళికి నేదిదిక్కు? ధృతి నీ భక్తుల్ భవత్పాద నీ

రేజంబుల్ భజియింతు రేతెరగునన్? శ్రీకాళహస్తీశ్వరా!

తరగల్ పిప్పల పత్రముల్ మెఱగుటద్దంబుల్ మరుద్దీపముల్

కరికర్ణాంతము లెండమావులతతుల్ ఖద్యోతకీటప్రభల్

సురవీధీలిఖితాక్షరంబులసువుల్ జ్యోత్స్నాపయ: పిండముల్

సిరులందేల మదాంధులౌదురో జనుల్ శ్రీ కళహస్తీశ్వరా! 

నిన్నున్నమ్మినరీతి నమ్మనొరులన్, నీకన్న నాకెన్న లే

రన్నల్దమ్ములు తల్లిదండ్రులు గురుండాపత్సహాయుండు నా

యన్నా! యెన్నడు నన్ను సంస్కృతి విషాదాంబోధి దాటించి య

చ్ఛిన్నానంద సుఖాబ్ధి దేల్చెదోకదే శ్రీ కాళహస్తీశ్వరా!

నీ పంచం బడియుండగా గలిగిననన్భిక్షాన్నమే చాలు ని,

క్షేపంబబ్బిన రాజకీటకములనే సేవింపగానోప, నా

శాపాశంబుల జుట్టి త్రిప్పకుము సంసారార్ధమై, బంటుగా

చేపట్టం దయగల్గెనేని మదిలో శ్రీ కాళహస్తీశ్వరా!

నీ పేరున్, భవదంఘ్రితీర్ధము భవ న్నిష్ట్యుత తాంబూలమున్

నీ పళ్ళెంబు ప్రసాదమున్ గొనికదా నేబిడ్డడైనాడ న

న్నీ పాటిం కరుణింపు మోపనిక నే నెవ్వారికిం బిడ్డగాన్

చేపట్టందగు పట్టి మానదగదో శ్రీ కాళహస్తీశ్వరా!

అమ్మాయయ్యటంచు నెవ్వరిని నేనన్నన్శివా! నిన్ను నే

సుమీ! నీమదితల్లిదండ్రులనటంచున్జూడగాబోకు నా

కిమ్మై తల్లి యుతండ్రియున్ గురుడు నీవేకాన సంసారపుం

జిమ్మంజీకటి గప్పకుండ గనుమా శ్రీ కాళహస్తీశ్వరా!

కొడుకుల్ పుట్టరటంచు నేడ్తు రవివేకుల్ జీవనభ్రాంతులై!

కొడుకుల్ పుట్టరె కౌరవేంద్రున కనేకుల్, వారిచే నేగతుల్

పడసెన్? పుత్రులులేని యా శుకునకున్ వాటిల్లెనే దుర్గతుల్

చెడునే మోక్షపదం బపుత్రుకునకున్ శ్రీ కాళహస్తీశ్వరా!

గ్రహదోషంబులు దుర్నిమిత్తములు నీ కళ్యాణనామంబు ప్ర

త్యహమున్ బేర్కొను నుత్తమోత్తముల బాధంబెట్టగా నోపునే!

దహనుంగప్పజాలునే శులభసంతానంబు? నీ సేవచే

సి హతక్లేశులుగారుగాక మనుజుల్ శ్రీ కాళహస్తీశ్వరా!

అడుగంబోనిక నన్యమార్గరతులం ప్రాణావనోత్సాహినై

యడుగంబోయినబోదుఁనీదు పదపద్మారాధక శ్రేణీయు

న్నెడకున్ నిన్ను భజింపగాగనియు నాకేలాపరాపేక్ష కో

రెడిదిం కేమి భవత్ప్రసాదమె తగున్ శ్రీ కాళహస్తీశ్వరా!    30

మదమాతంగములందలంబులు హరుల్మాణిక్య ముప్పల్లకుల్

ముదితల్ చిత్రదుకూలముల్పరిమళంబుల్మోక్ష మీజాలు నే

మదిలో వీని నపేక్ష చేసి నృపధామద్వారదేశంబుగా

చి దనంబుల్ వృథపుత్తురజ్ఞులకటా శ్రీ కాళహస్తీశ్వరా!

రోసీరోయదు కామినీజనుల తారుణ్యోరు సౌఖ్యంబులన్,

పాసీపాయదు పుత్రమిత ధన సంపద్ర్బాంతి, వాంఛాలతల్

కొసీకోయదు నామనం బకట! నీకున్ ప్రీతిగా సత్ర్కియల్

చేసీచేయదు, దీనిత్రుళ్ళణచవే శ్రీకాళహస్తీశ్వరా!

ఎన్నేళ్ళుండుదు? నేమి గందునిక నేనెవ్వారి రక్షించెదన్

నిన్నే నిష్టభజించెద న్నిరుపమోన్ని ద్రాప్రమోదంబు నా

కెన్నండబ్బెడు నెంత కాలమిక నేనిట్లున్న నన్నియ్యెడం

జిన్నంబుచ్చక నన్ను నేలుకొనవే శ్రీ కాళహస్తీశ్వరా!

చావంగాలము చేరువౌటెరిగియుం చాలింపగాలేక, త

న్నే వైద్యుండు చికిత్సబ్రోవగలడో, ఏమందు రక్షించునో,

ఏ వేల్పుల్ కృపజూతురో యనుచు, నిన్నింతైన చింతింపడా

జీవశ్రాద్ధము చేసికొన్న యతియున్ శ్రీ కాళహస్తీశ్వరా!

దినముం చిత్తములో సువర్ణముఖరీతీరప్రదే శామ్రకా

నన, మధ్యోపలవేది కాగ్రమున నానందంబునం పంకజా

సననిష్ట నిన్ను జూడగన్న నదివోసౌఖ్యంబు లక్ష్మీ విలా

సిని మాయానటనల్ సుఖంబులగునే శ్రీ కాళహస్తీశ్వరా!

ఆలంబు న్మెడగట్టి, దానికి నపత్యశ్రేణి కల్పించి, త

ద్బాలవ్రాతము నిచ్చి పుచ్చుకొను సంబంధంబు గావించి యా

మాలార్కంబున బాంధవంబనెడి ప్రేమంగొందరం ద్రిప్పగా,

సీలన్సీలనమర్చినట్లొసంగితో శ్రీ కాళహస్తీశ్వరా!

తన వేనిత్యముగా నొనర్పుమదిలేదా, చచ్చి, జన్మింపకుం

డనుపాయంబుఘటింపు, మాగతులరెంటన్నేర్పులేకున్న లే

దని నాకిప్పుడెచెప్పు చేయగల కార్యంబున్న సంసేవజే

సి నినుంగాంచెదగాక కాలముననో శ్రీ కాళహస్తీశ్వరా!

పదునాల్గేలెమహాయుగంబులొక భూపాలుండు, చెల్లించెన

య్యుదయాస్తాచలనసంధి నాజ్ఞనొకడాయుష్మంతుడై వీరియ

భ్యుదయంబెవ్వరు చెప్పగావినరొ! అల్పుల్మత్తులై యేల చ

చ్చెదరో రాజులమంచు నక్కటకటా శ్రీ కాళహస్తీశ్వరా!   

రాజన్నంతనెబోవు నా కృపయు, ధర్మం, బాభిజాత్యంబు, వి

ద్యాజాతక్షమ, సత్యభాషణము, విద్యన్మిత్రసంరక్షయున్

సౌజన్యంబు, కృతంబెరుంగుటయు, విశ్వాసంబుగాకున్న దు

ర్బీజ శ్రేష్ఠలుగా గతంబుకలదే శ్రీ కాళహస్తీశ్వరా!

మునునీచే నవవర్గ రాజపదవీ మూర్ధాభిషేకంబు గాం

చిన పుణ్యాత్ములు నేను నొక్కసరివో, చింతించి చూడంగ, నె

ట్లనినం కీట, ఫణీంద్ర, పోత, మడవేదండో గ్రహింసావిచా

రిణిగాగాఁనిను గానగాక మదిలో శ్రీకాళహస్తీశ్వరా!    40

పవమానాశన భూషణప్రకరము, ల్భద్రేభచర్మంబు, నా

టవికత్వంబు బ్రియంబులై భుజగశుండాలటవీచారులన్

భవదు:ఖంబులబాపు, టొప్పుగొలదింబాటించి కైవల్య మి

చ్చి వినోదించుట కేమి కారణమయా శ్రీ కాళహస్తీశ్వరా!

అమంస్త్రీలరమించినన్ జెడదు మోహంబింతయు బ్రహ్మ ప

ట్టము సిద్ధించిన నాశదీరదు, నిరూఢక్రోధమున్ సర్వలో

కముల న్మ్రింగినమాన, దిందుగల సౌఖ్యంబొల్ల, నీ సేవ చే

సి మహాపాతక వార్థిరాశి గడతున్ శ్రీకాళహస్తీశ్వరా!

చనువారింగని యేడ్చువారు జముడా! సత్వంబుగావత్తు మే

మనుమానం బికలేదు నమ్ముమని తారా వేళ యా రేపునన్

మునుంగబోవుచు బాసచేయుటసుమీ ముమ్మాటికింజూడగా

చెనటుల్గానరు దీనిభామిదివో శ్రీకాళహస్తీశ్వరా!

భవదు:ఖంబు రాజకీటముల నేఁబ్రార్ధించినన్ బాయునే?

 భవదంఘ్రిస్తుతిచేతగాక, విలసద్బాలక్షుధాక్లేశ దు

 ష్ట విధుల్మానునెచూడ మేకమెడచంటం తల్లి కారుణ్య దృ

 ష్టి విశేషంబునని చ్చుచంటవలెనో శ్రీకాళహస్తీశ్వరా!

పవిపుష్పంబగు, నగ్నిమంచగు, నాకూపారంభూమీస్థలం

బవు, శత్రుండతిమిత్రుడౌ, విషముదివ్యాహారమౌనెన్నగా

నవనీమండలి లోపలన్ శివ శివేత్యా భాషణోల్లాసికిన్

శివ! నీ నామము సర్వవశ్యకరమౌ, శ్రీ కాళహస్తీశ్వరా!

లేవో గానల కందమూల ఫలముల్, లేవో గుహల్తోయముల్

లేవో, యేఱులపల్ల వాస్తరణముల్ లేవో, సదాయాత్మలో

లేవో నీవు విరక్తులన్మనుపజాలింబొంది, భూపాలురన్

సేవల్సేయగబోదురేలకో జనుల్ శ్రీ కాళహస్తీశ్వరా!

మును నే పుట్టిన పుట్టువులెన్ని గలవో, మోహంబుచేనందుచే

సిన కర్మంబుల ప్రోవులెన్ని గలవో, చింతించినంగాని, యీ

జననంబేయని యున్న వాడనిదియే చాలింపనే నిన్ను గొ

ల్చిన పుణ్యంబునకుం గృపారతుడవై శ్రీ కాళహస్తీశ్వరా!

తనువెందాక ధరిత్రినుండు నను నందాకన్మహారోగ దీ

పన దు:ఖాదుల బొందకుండ ననుకంపాదృష్టి వీక్షించి యా

వెనుక న్నీ పదపద్మముల్దలంచుచున్విశ్వ ప్రపంచంబు బా

సిన చిత్తంబున నుండ చేయగదవే శ్రీ కాళహస్తీశ్వరా!

మల భూయిష్ట మనోజధామము సుషుమ్నాద్వారమో! యారు కుం

డలియో పాద కరాక్షి యుగ్మములు షట్చక్రంబులో! మోముదా

జలజంబో నిటలంబు చంద్రకళయో సంగంబు యోగంబొ? గా

సిలి సేవింతురు కాంతలన్ భువిజనుల్ శ్రీకాళహస్తీశ్వరా!

జలకంబుల్ రసముల్ ప్రసూనములు వాచాబంధముల్ వాద్యము

ల్కల శబ్దధ్వనులంచితాంబర మలంకారంబు దీప్తుల్మెరుం

గులు నైవేద్యము మాధురీ మహిమగా గొల్తున్నినున్ భక్తి రం

జిల దివ్యార్చనగూర్చి నేర్చిన క్రియన్ శ్రీ కాళహస్తీశ్వరా!    50

ఏ లీలన్ను తియింప వచ్చ నుపమోత్ప్రేక్షాధ్వనివ్యంగ్యశ

బ్దాలంకార విశేషభాషలకలభ్యంబైన నీ రూపము

చాలుంజాలు గవిత్వమున్నిలుచునే సత్యంబు వర్ణించుచో

ఛీ! లజ్జింపరుగాక మాదృశకవుల్ శ్రీ కాళహస్తీశ్వరా!

పాలుంబువ్వయు బెట్టెదన్ గుడవరా పాపన్న, రాయన్న, లే

లే లెమ్మన్న, నరటిపండ్లు గొనితే, లేకున్నన్ నొల్లనం

టే, లాలింపరే తల్లిదండ్రులపుడట్లే తెచ్చి, వాత్సల్య ల

క్ష్మీ లీలావచనంబులం గుడుపరా శ్రీ కాళహస్తీశ్వరా!

కలలంచున్న కునంబులంచు గ్రహయోగంబంచు సాముద్రికం

బులటంచుందెవులంచు, దిష్టియనుచు న్భూతంబులంచు న్విషా

ద్దులటంచు న్నిమిషార్ధ జీవనములందుం బ్రీతి పుట్టించినా

సిలుగుల్ ప్రాణుల కెన్ని చేసితివయ్యా! శ్రీ కాళహస్తీశ్వరా!   


వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్  | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in