|
www.telugudanam.co.in చీరాల |
పత్రికలలో తెలుగుదనం | మా అనుబంధ వెబ్సైట్.. |
|||
| తెలుగుదనం బ్లాగు | |||||
| మా గీతా.కో.ఇన్ |
శ్రీ నరసింహ శతకము
సీ: శ్రీ మనోహర! సురార్చిత! సింధుగంభీర!
భక్త వత్సల! కోటి - భానుతేజ!
కంజనేత్ర! హిరణ్యకశిపు నాశక! శూర!
సాధురక్షణ! శంఖచక్రహస్త!
ప్రహ్లాదవరద! పాపధ్వంస! సర్వేశ!
క్షీరసాగరశాయి! కృష్ణవర్ణ!
పక్షివాహన! నీలబృమరకుంతలజాల!
పల్లవారుణ పాదపద్మ యుగళ!
తే|| చారు శ్రీ చందనాగరు చర్చితాంగ!
కుందకుట్మలదంత! వైకుంఠ ధామ!
భూషణవికాస! శ్రీధర్మపుర నివాస!
దుష్ట సంహార! నరసింహ! దురితదూర!
సీ|| పద్మలోచన సీసపద్యముల్ నీ మీఁదఁ
జెప్పఁబూనితినయ్య! చిత్తగింపు
గణ యతి ప్రాస లక్షణముఁజూడగ లేదు;
పంచకావ్య శ్లోక పఠన లేదు,
అమరకాండత్రయం బరసి చూఁడగ లేదు,
శాస్త్రీయ గ్రంథముల్ చదువలేదు,
నీ కటాక్షంబున నే రచించెదఁగాని
ప్రజ్ఞ నాయదికాదు ప్రస్తుతింపఁ
తే|| దప్పు గలిగిన సద్భక్తి తక్కువౌనె?
చెఱకునకు వంకపోతేమి జెడునె తీపి! భూ.
సీ|| నరసింహ! నీ దివ్యనామ మంత్రము చేత
దురితజాలము లెల్లఁదోలవచ్చు,
నరసింహ! నీ దివ్యనామమంత్రముచేత
బలువైన రోగముల్ బాపవచ్చు,
నరసింహ! నీ దివ్యనామమంత్రము చేత
రిపు సంఘముల సంహరింపవచ్చు,
నరసింహ! నీ దివ్య నామమంత్రము చేత
దండహస్తుని బంట్లఁ దఱుమవచ్చు.
తే|| భళిర! నే నీ మహామంత్ర బలము చేత
దివ్యవైకుంఠ పదవి సాధింపవచ్చు! భూ.
సీ|| ఆదినారాయణా యనుచు నాలుకతోడఁ
బలుక నేర్చినవారి పాదములకు
సాష్టాంగముగ నమస్కార మర్పణఁజేసి
ప్రస్తుతించెదనయ్య బహువిధముల
ధరణిలో నరులెంత దండివారైనను
నిన్నుఁగాననివారి నే స్మరింప,
మేము శ్రేష్ఠుల మంచు ముడుకుచుండెడివారి
చెంతఁజేరఁగఁ బోను శేషశయన!
తే|| పరమ సాత్త్వికులైన నీ భక్తవరుల
దాసులకు దాసుఁడను జుమీ ధాత్రిలోన, భూ.
సీ|| ఐశ్వర్యములకు నిన్ననుసరింపఁగలేదు.
ద్రవ్య మిమ్మని వెంటఁ దగులలేదు,
కనకమిమ్మని చాలఁ గష్ట పెట్టఁగ లేదు!
పల్లకిమ్మని నోటఁ బలుక లేదు,
సొమ్ము లిమ్మని నిన్ను నమ్మి కొల్వఁగ లేదు,
భూమి లిమ్మని పేరు పొగడ లేదు,
బలము లిమ్మని నిన్ను బ్రతిమాలఁగా లేదు,
పసుల నిమ్మని పట్టు బట్టలేదు,
తే|| నేను గోరిన దొక్కటే నీలవర్ణ!
చయ్యనను మోక్షమిచ్చినఁ జాలు నాకు, భూ.
సీ|| మందుడనని నన్ను నిందఁజేసిన నేమి?
నా దీనతను జూచి నవ్వనేమి?
దూరభావములేక తూలనాడిననేమి?
ప్రీతి సేయక వంక బెట్టనేమి?
కక్కసంబులు పల్కి వెక్కిరించిన నేమి?
తీవ్రకోపముచేతఁ దిట్టనేమి?
హెచ్చుమాటలచేత నెమ్మెలాడిన నేమి?
చేరి దాపట గేలి సేయనేమి?
తే|| కల్పవృక్షంబువలె నీవు కల్గ నింకఁ
బ్రజల లక్ష్యంబు నాకేల! పద్మనాభ! భూ.
సీ|| చిత్తశుద్ధిగ నీకు సేవఁజేసెదఁ గాని,
పుడమిలో జనుల మెప్పులకు గాదు,
జన్మ పావనతకై స్మరణ జేసెదఁగాని,
సరివారిలోఁ బ్రతిష్ఠలకుఁగాదు,
ముక్తికోసము నేను మ్రొక్కివేడెద గాని,
దండిభాగ్యము నిమిత్తంబుగాదు,
నిన్నుఁబొగడను విద్య నేర్చితినేకాని,
కుక్షి నిండెడు కూటి కొఱకుఁగాదు,
తే|| పారమార్ధికమునకు నేఁబాటుపడితిఁ
గీర్తికి నపేక్ష పడలేదు కృష్ణవర్ణ!భూ
సీ|| శ్రవణ రంధ్రముల నీ సత్కధల్ పొగడంగ
లేశ మానందబు లేనివాఁడు
పుణ్యవంతులు నిన్నుఁౠజ సేయ గ జూచి
భావమందుత్సాహ పడనివాఁడు
భక్తవర్యులు నీ ప్రభావముల్ పొగడంగఁ
దత్పరత్వములేక తలఁగువాఁడు
తన చిత్తమందు నీ ధ్యాన మెన్నఁడు లేక
కాలమంతయు వృధా గడపువాఁడు
తే|| వసుధలోనెల్ల వ్యర్ధుండు వాఁడె యగును;
మఱియుఁజెడుఁగాక యెప్పుడు మమతనొంది; భూ
సీ|| గౌతమీస్నానానఁ గడతేరుదమటన్న
మొనసి చన్నీళ్ళలో మునుఁగలేను;
దీర్ధయాత్రలచేఁ గృతార్ధు డౌదమటన్న
బడలి నీమంబులె నడపలేను;
దానధర్మముల సద్గతినిఁ జెందుదమన్న
ఘనముగా నాయొద్ద ధనములేదు;
తపమాచరించి సార్ధకము నొందుదమన్న
నిమిషమైన మనస్సు నిలుపలేను;
తే|| కష్టములకోర్వ నాచేతఁగాదు: నిన్ను
స్మరణఁజేసెద నా యధాశక్తి కొలఁది; భూ.
సీ|| అర్ధివాండ్రకు నీక హానిఁజేయుటకంటెఁ
దెంపుతో వసనాభిఁ దినుటమేలు;
ఆఁడుబిడ్డలసొమ్ము లపహరించుటకంటె
బండఁగట్టుక నూతఁబడుట మేలు;
పరులకాంతలఁ బట్టి బల్మిఁ గూడుటకంటె;
బడబాగ్ని కీలలఁ బడుటమేలు;
బ్రతుక జాలక దొంగపనులు సేయుటకంటెఁ
గొంగుతో ముష్టెత్తుకొనుట మేలు;
తే|| జలజదళనేత్ర! నీ భక్త జనులతోడి
జగడమాడెడు పనికంటెఁ జావుమేలు; భూ. 10
సీ|| గార్ధభంబున కేల కస్తూరి తిలకంబు?
మర్కటంబున కేల మలయజంబు?
శార్దూలమున కేల శర్కరాపూపంబు?
సూకరంబులకేల చూతఫలము?
మార్జాలమున కేల మల్లెపువ్వులబంతి?
గుడ్లగూబల కేల కుండలములు?
మహిషంబు కేల నిర్మలమైన వస్త్రముల్?
బకసంతతికి నేల పంజరంబు?
తే|| ద్రోహచింతనఁ జేసెడి దుర్జనులకు
మధురమైనట్టి నీ నామ మంత్రమేల? భూ
సీ|| పసరంబు పంజైనఁ బసులకాపరితప్పు,
ప్రజలు దుర్జనులైనఁ బ్రభుని తప్పు,
భార్య గయ్యాళైనఁ బ్రాణనాధుని తప్పు,
తనయుఁడు దుడుకైన దండ్రి తప్పు,
సైన్యంబు చెదరిన సైన్యనాధుని తప్పు,
కూతుఁరు చెడుగైన మాతతప్పు,
అశ్వఁబు దురుసైన నారోహకుని తప్పు,
దంతి మదించ మావంతు తప్పు,
తే|| ఇట్టి తప్పు లెఱుంగక యిచ్చవచ్చి
నటుల మెలఁగుదు రిప్పు డీ యవని జనులు; భూ.
సీ|| కోఁతికి జలతారు కుళ్ళాయి యేటికి?
విరజాజి పూదండ విధవకేల?
ముక్కిడి తొత్తుకు ముత్తెంపు నత్తేల?
నద్దమేమిటికి జాత్యంధునకును?
మాచకమ్మకు నేల మౌక్తిక హారముల్?
క్రూరచిత్తునకు సద్గోష్ఠు లేల?
ఱంకుఁబోతుకు నేల రమ్యంపు నిష్ఠలు?
వావి యేటికి దుష్ట వర్తనునకు?
తే|| మాట నిలకడ సుంకరి మోటు కేల?
చెవిటివానికి సత్కధా శ్రవణమేల? భూ.
సీ|| మాన్యంబులీయ సమర్ధుఁ డొక్కఁడు లేఁడు;
మాన్యముల్ చెఱుప సమర్ధులంత;
యెండిన యూళ్ళ గోడెరిఁగింపఁ డెవ్వఁడుఁ;
బండిన యూళ్ళకుఁ బ్రభువు లంత;
యితఁడు పేద యటంచు నెఱిఁగింపఁడెవ్వఁడు;
గలవారి సిరులెన్నఁగలరు చాలఁ;
దన యాలి చేష్టలఁ దప్పెన్నఁ డెవ్వఁడుఁ
బెఱకాంత తప్పెన్నఁ బెద్దలంత;
తే|| యిట్టి దుష్టుల కధికార మిచ్చినట్టి
ప్రభువు తప్పులటంచును బలుకవలెను; భూ.
సీ|| తల్లి గర్భమునుండి ధనముఁదేఁడెవ్వఁడు,
వెళ్ళిపోయెడినాఁడు వెంటరాదు,
లక్షాధికారైన లవణ మన్న మెకాని,
మెఱుఁగు బంగారంబు మ్రింగఁబోఁడు,
విత్తమార్జనఁజేసి విఱ్ఱవీఁగుటె కాని,
కూడఁబెట్టిన సొమ్ము గుడువబోఁడు,
పొందుగా మఱుఁగైన భూమిలోపలఁబెట్టి
దానధర్మము లేక దాఁచి దాఁచి,
తే|| తుదకు దొంగల కిత్తురో? దొరల కవునొ?
తేనె జుంటీ గ లియ్యవా తెరువరులకు? భూ.
సీ|| లోకమం దెవఁడైన లోభిమానవుఁడున్న
భిక్షమర్ధికిఁ జేతఁ బెట్టలేఁడు,
తాను బెట్టకయున్నఁ దగవు పుట్టదుకాని
యొరులు పెట్టఁగజూచి యోర్వలేఁడు,
దాతదగ్గఱఁ జేరి తన ముల్లె పోయినట్లు
జిహ్వతోఁ జాడీలు చెప్పు చుండు
ఫలము విఘ్నంబైనఁబలు సంతసము నందు,
మేలుకల్గినఁ జాల మిణుఁకుచుండు,
తే|| శ్రీరమానాధ ! యిటువంటి క్రూరునకును
భిక్షుకుల శత్రువని పేరు బెట్టవచ్చు, భూ.
సీ|| తనువులోఁబ్రాణముల్ తరలిపోయెడివేళ
నీ స్వరూపమును ధ్యానించునతఁడు
నిమిషమాత్రములోన నిన్నుఁ జేరునుగాని,
యమునిచేతికిఁ జిక్కిశ్రమలఁబడఁడు;
పరమసంతోషాన భజనఁ జేసెడి వాని
పుణ్య మేమనవచ్చు భోగిశయన !
మోక్షము నీ దాస ముఖ్యుల కగు గాని
నరక మెక్కడిదయ్య నళిననేత్ర !
తే|| కమలనాభుని మహిమలు కానలేని
తుచ్ఛులకు ముక్తి దొరకుట దుర్లభంబు; భూ
సీ|| నీలమేఘశ్యామ ! నీవె తండ్రివి మాకు,
కమలవాసిని మమ్ముఁగన్న తల్లి,
నీ భక్తవరులంత నిజమైన బాంధవుల్,
నీ కటాక్షము మా కనేకధనము,
నీ కీర్తనలు మాకు లోక ప్రపంచంబు.
నీ సహాయము మాకు నిత్యసుఖము,
నీ మంత్రమే మాకు నిష్కళంకపు విద్య,
నీ పద ధ్యానంబు నిత్య జపము
తే|| తోయజాతాక్ష ! నీ పాద తులసిదళము
రోగముల కౌషధము బ్రహ్మరుద్ర వినుత ! భూ.
సీ|| బ్రతికినన్నాళ్లు నీ భజన తప్పను గాని,
మరణకాలమునందు మఱతునేమో?
యావేళ యమదూత లాగ్రహంబున వచ్చి
ప్రాణముల్ పెకలించి పట్టునపుడు
కఫ వాత పైత్యముల్ కప్పఁగా భ్రమచేతఁ
గంప ముద్భవమంది, కష్టపడుచు
నా జిహ్వతో నిన్ను నారాయణా! యంచుఁ
బిలుతునో! శ్రమచేతఁ బిలువలేనొ?
తే|| నాటికిప్పుడె చేసెద నామభజనఁ
దలఁచెదను జేరి వినవయ్య ! దైర్యముగను, భూ.
సీ|| పాంచభౌతికము దుర్భరమైన కాయం బి
దెప్పడో విడుచుట యెఱుకలేదు,
శతవర్షములదాఁక మితముఁ జెప్పిరి కాని,
నమ్మరాదామాట నెమ్మనమున
బాల్యమందో; మంచి ప్రాయమందో, లేక
ముదిమియందో, లేక ముసలియందొ,
యూరనో, యడవినో, యుదకమధ్యముననో,
యెప్పుడో యేవేళ నే క్షణంబొ?
తే|| మరణమే, నిశ్చయము, బుద్ధిమంతుఁడైన
దేహ మున్నంతలో మిమ్ముఁ దెలియవలయు, భూ. 20
సీ|| తల్లిదండ్రులు భార్య తనయు లాప్తులు బావ
మఱఁదు లన్నలు మేన మామగారు,
ఘనముగా బంధువుల్ కల్గినప్పటికైనఁ
దాను దర్లగ వెంటఁ దగిలి రారు,
యమునిదూతలు ప్రాణ మపహరించుక పోఁగ
మమతతోఁ బోరాడి మాన్పలేరు,
బలగమందఱు దుఃఖపడుట మాత్రమె కాని,
యించుక యాయుష్య మీయలేరు,
తే|| చుట్టములమీఁది భ్రమఁదీసి చూరఁ జెక్కి,
సంతతము మిమ్ము నమ్ముట సార్ధకంబు, భూ.
సీ|| ఇభరాజవరద ! నిన్నెంత పిల్చిన గాని
మాఱు పల్కవదేమి మౌనితనమొ,
మునిజనార్చిత ! నిన్ను మ్రొక్కి వేడినఁగాని
కనుల!జూచి వదేమి గడుసుదనమొ?
చాల దైన్యమునొంది చాటు జొచ్చినఁగాని
భాగ్యమీయ వదేమి ప్రౌఢతనమొ?
స్ధిరముగా నీపాద సేవఁ జేసెదనన్న
దొరకఁజాల వదేమి ధూర్తతనమొ?
తే|| మోక్షదాయక! యిటువంటి మూర్ఖజనునిఁ
గష్టపెట్టిన నీకేమి కడుపునిండు ? భూ..
సీ|| నీమీఁద కీర్తనల్ నిత్యగానముఁజేసి
రమ్యమొందింప నారదుఁడ గాను;
సావధానముగ నీ చరణపంకజసేవ
సలిపి మెప్పింపంగ శబరిఁగాను;
బాల్యమప్పటినుండి భక్తి నీయందునఁ
గలుగను బ్రహ్లాద ఘనుఁడఁగాను;
ఘనముగా నీమీఁద గ్రంధముల్ కల్పించి
వినుతిసేయను వ్యాస మునిని గాను;
తే|| సాధువును, మూర్ఖమతి, మనుష్యాధముఁడను;
హీనుఁడను, జుమ్మి; నీవు నన్నేలు కొనుము: భూ..
సీ|| అతిశయంబుగఁ గల్లలాడ నేర్చితిఁ గాని
పాటిగా సత్యముల్ బలుకనేర;
సత్కార్య విఘ్నముల్ సలుపనేర్చితిఁగాని
యిష్ట మొందఁగ నిర్వహింపనేర;
నొకరిసొమ్ముకు దోసిలొగ్గనేర్చితిఁగాని
చెలువుగా ధర్మంబు సేయనేర;
ధనము లియ్యంగ వద్దనఁగ నేర్చితిఁగాని
శీఘ్రమిచ్చెడునట్లు చెప్పనేర;
తే|| పంకజాతాక్ష ! నే నతి పాతకుఁడను
దప్పులన్నియు క్షమియింపఁ దండ్రివీవె; భూ..
సీ|| ఉర్విలో నాయుష్యమున్న పర్యంత్మంబు
మాయ సంసారంబు మరగి, నరుఁడు
సకల పాపములైన సంగ్రహించునుగాని
నిన్ను జేరెడి యుక్తి నేర్వలేఁడు,
తుదకుఁ గాలునియొద్ద దూత లిద్దఱువచ్చి
గుంజుక చనివారు గ్రుద్దుచుండ,
హింస కోర్వఁగలేక యేడ్చి గంతులు వేసి
దిక్కులేదని నాల్గు దిశలు చూడఁ,
తే|| దన్ను విడిపింప వచ్చెడి ధన్యుఁడెవడు?
ముందె నీ దాసుఁడైయున్న ముక్తిగలుగు; భూ..
సీ|| అధిక విద్యావంతుల ప్రయోజకులైరి,
పూర్ణశుంఠలు సభా పూజ్యులైరి,
సత్యవంతులమాట జనవిరోధంబాయె,
వదరుపోతులమాట వాసికెక్కె,
ధర్మవాసనపరుల్ దారిద్ర్య మొందిరి,
పరమలోభులు ధన ప్రాప్తులైరి,
పుణ్యవంతులు రోగ భూత పీడితులైరి,
దుష్ట మానవులు వర్ధిష్టులైరి,
తే|| పక్షివాహన! మావంటి భిక్షుకులకు
శక్తిలేదాయె, నిఁక నీవె చాటు మాకు, భూ.
సీ|| భుజబలంబునఁ బెద్దపులులఁ జంపగవచ్చు,
పాముకంఠముఁ జేతఁ బట్టవచ్చు,
బ్రహ్మరాక్షస కోట్ల బాఱఁద్రోలఁగ వచ్చు,
మనుజుల రోగముల్ మాన్పవచ్చు,
జిహ్వ కిష్టముగాని చేదు మ్రింగఁగ వచ్చు,
బదను ఖడ్గము చేత నదుమవచ్చుఁ,
గష్టమొందుచు ముండ్ల కంపలోఁ జొరవచ్చుఁ,
దిట్టుపోతుల నోళ్ళు కట్టవచ్చుఁ,
తే|| బుడమిలో దుష్టులకు జ్ఞానబోధఁ దెలిపి
సజ్జనుల జేయలేఁడెంత చతురుఁడైన, భూ.
సీ|| అవనిలోఁగల యాత్రలన్ని చేయఁగవచ్చు,
ముఖ్యుడై నదులందు మునుఁగవచ్చు,
ముక్కుపట్టుక సంధ్య మొనసి వార్వఁగవచ్చుఁ,
దిన్నగాఁ జపమాల ద్రిప్పవచ్చు,
వేదాల కర్ధంబు విఱిచి చెప్పఁగవచ్చు,
శ్రేష్ఠయాగములెల్లఁ జేయవచ్చు,
ధనము లక్షలు కోట్లు దానమీయఁ
నైష్ఠికాచారముల్ నడుపవచ్చు,
తే|| జిత్త మన్యస్ధలంబునఁ జేరకుండ
నీ పదాంభోజములయందు నిలుపరాదు; భూ.
సీ|| కర్ణయుగ్మమున నీ కధలు సోఁకినఁ జాలు
పెద్ద పోగుల జోళ్లు పెట్టినట్లు
చేతు లెత్తుచుఁ ౠజ సేయఁగల్గినఁ జాలు
తోరంపుఁ గడియాలు తొడిగినట్లు,
మొనసి మస్తకముతో మ్రొక్కఁగల్గినఁ జాలు
చెలువమైన తురాయి చెక్కినట్లు,
గళము నొవ్వఁగఁ నామస్మరణ గల్గినఁ జాలు,
వింతగాఁ గంఠీలు వేసినట్లు,
తే|| పూని నినుఁ గొల్చుటే సర్వ భూషణంబు,
లితర భూషణముల నిచ్చగింపనేల? భూ.
భువన రక్షక! నిన్నుఁ బొగడనేరని నోరు ప్రజ కరోచకమైన పాడుబొంద,
సురవరార్చిత! నిన్నుఁజూడఁగోరని కనుల్ జలములోపల నెల్లి సరపుగుండ్లుఁ
శ్రీ రమాధిప! నీకు సేవఁజేయని మేను కూలి కమ్ముడువోని కొలిమి తిత్తి,
వేడ్కతో నీ కథల్ వినని కరణములైనఁ గఠిన శిలాదులఁ గలుగు తొలులు,
పద్మలోచన! నీమీద భక్తిలేని
మానవుడుఁ రెండు పాదాల మహిషమయ్య,
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర! 30
అతివిద్య నేర్చుట యన్న వస్త్రములకే, పనుల నార్జించుట పాడికొఱకె,
సతినిఁబెండ్లాడుట సంసార సుఖముకే, సుతులఁ భోషించుట గతులకొఱకె,
సైన్యమున్ గూర్చుట శత్రు భయంబు కె, సాము నేర్చుటలెల్ల జావుకొఱకె,
దానమిచ్చుటయు ముందటి సచితమునకె, ఘనముగాఁ జదువు కడుపుకొఱకె,
యితర కామంబుఁ గోరక సతతముగను
భక్తినీయందు నిలుపుట ముక్తికొఱకె,
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!
ధరణిలో వెయ్యేండ్లు తనువు నిల్వగఁబోదు, ధనమెప్పటికి శాశ్వతంబు గాదు,
దార సుతాదులు తనవెంట రాలేరు, భృత్యులు మృతినిఁ దప్పింపలేరు,
బంధుజాలము తన్ను బ్రతికించుకొనలేదు, బలపరాక్రమ మేమి పనికిరాదు,
ఘనమైన సకల భాగ్యబెంతఁ గల్గియు గోచిమాత్రంబైనఁ గొంచుఁబోఁడు,
వెఱ్ఱికుక్కల భ్రమలన్ని విడిచి నిన్ను
భజనఁ జేసెడివారికి బరమ సుఖము;
భూషణవికాస! శ్రీదర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!
నరసింహ! నాకు దుర్జయములే మెండాయె సుగుణ మొక్కటిలేదు జూడఁబోవ,
నన్యకాంతమీఁద నాశమానఁగలేను, ఒరుల క్షేమముఁజూచి యెర్వలేను,
ఇటువంటి దుర్భుద్ధులన్ని నాకున్నవి, నేనుఁ జేసెడివన్ని నీచకృతులు,
నావంటి పాపిష్టి నరుని భూలోకానఁ బుట్ట జేసితివేల? భోగిశయన!
అబ్జళనేత్ర! నా తండ్రివైన ఫలము
నేరములు కాచి రక్షించు నీవె దిక్కు;
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!
ధీరతఁ బరుల నిందింప నేర్చితిఁగాని తిన్నగా నినుఁ బ్రస్తుతింపనైతిఁ
బొరుగు కామినులందు బుద్ధినిల్పితిఁగాని నిన్ను సతతము ధ్యానింపనైతిఁ
బొరుగు ముచ్చటలైన మురిసి వింటినిగాని యెంచి నీకథలాలకించనైతి,
గౌతుకంబునఁ బాతకము గడించితిఁగాని హెచ్చు పుణ్యము సంగ్రహింపనైతి,
నవనిలో నేను జన్మించినందుకేమి
సార్థకము కానరాదాయో స్వల్పమైన,
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!
అంత్యకాలమందు నాయాసమున నిన్నుఁ దలఁతునో తలఁపనో? తలంతు నిపుడె,
నరసింహ! నరసింహ! నరసింహ! లక్ష్మీశ దానవాంతక! కోటి భానుతేజ!
గోవింద! గోవింద! గోవింద! సర్వేశ పన్నగాధిపఁ శాయి! పద్మనాభ
మధువైరి! మధువైరి! మధువైరి! లోకేశ నీలమేఘ శరీర! నిగమ వినుత!
ఈ విధంబున నీనామ మిష్టమగును
భజన సేయుచునుందు నా భావమందు,
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!
ఆయురారోగ్య పుత్రార్థ సంపదలన్ని కలుగఁజేసెడి భారగర్తవీవె,
చదువు లెస్సగ నేర్చి సభలో గరిష్ఠాది కార మొందించెడి ఘనుఁడ నీవె,
నడక మంచిది పెట్టి నరులు మెచ్చెదునట్టి పేరు రప్పించెడి పెద్దవీవె,
బలువైన వైరాగ్య భక్తి జ్ఞానములిచ్చి ముక్తిఁ బొందించెడు మూర్తివీవె;
అవనిలో మానవుల కన్ని యాసలిచ్చి
వ్యర్థులను జేసి తెలిపెడివాఁడవీవె;
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!
కాయమెంత భయానఁ గాపాడినంగాని ధాత్రిలో నది చూడ దక్కఁబోదు,
ఏవేళ నేరోగ మేమరించునొ? సత్త్వ మొందఁగఁ జేయు మే చందమునను,
ఔషధంబులు మంచి వనుభవించినఁ గాని కర్మ క్షీణంబైనఁగాని విడదు,
కోటివైద్యులు గుంపుగూడివచ్చినఁగాని మరణ మయ్యెదు వ్యాధి మాన్పలేరు,
జీవుని ప్రయాణ కాలంబు సిధ్ధమైన
నిలుచునా దేహ మిందొక్క నిమిషమైన?
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!
జందెమింపుగ వేసి సంధ్యవార్చిన నేమి బ్రహ్మమందక కాఁడు బ్రాహ్మణుఁడు;
తిరుమణి శ్రీచూర్ణ గురురేఖ లిడినను విష్ణు నొందక కాఁడు వైష్ణవుండు
బూదిని నుదుటను బూసికొనిన నేమి శంభు నొందకకాఁదు శైవజనుఁడు;
కాషాయ వస్త్రాలు కట్టి కప్పిన నేమి యాశ పోవక కాఁడు యతివరుఁడు;
ఇట్టి లౌకిక వేషాలు గట్టుకొనిన
గురునిఁ జెందక సన్ముక్తి దొరక బోదు;
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!
నరసింహ! నే నిన్ను నమ్మినందుకుఁ నెసరు నాయందుంచు నెమ్మసమున,
నన్ని వస్తువులు నిన్నడిగి వేసటపుట్టె నింకనైఁన గటా క్షమియ్యవయ్య!
సంతసంబున నన్ను స్వర్గమందే యుంచు, భూమియందే యుంచు, భోగిశయన!
నయముగా వైకుంఠ నగరమందే యుంచు, నగరమందే యుంచు నళిననాభ?
ఎచట నన్నుంచినంగాని యెపుడు నిన్ను
మఱచిపోకుండ నామస్మరణ నొసఁగు;
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!
దేహమున్నవఱకు మోహ సాగరమందు మునుఁగుచుందురు శుద్ధ మూఢ జనులు,
సలలితైశ్వర్యముల్ శాశ్వతంబనుకొని షడ్భ్రమలను మానవజాలరెవరు,
సర్వకాలము మాయ సంసారబద్ధులై గురుని కారుణ్యంబు గోరుకొనరు,
జ్ఞానభక్తి విరక్తులైన పెద్దలఁజూచి నిందఁ జేయక తాము నిలువలేరు,
మత్తులైనట్టి దుర్జాతి పెద్దలజూచి
నిన్నుఁ గనలేరు మొదటికే నీరజాక్ష!
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర! 40
ఇలలోన నే జన్మ మెత్తినప్పటినుండి బహు గడించితినయ్య పాతకములు,
తెలిసి జేసితిఁ గొన్ని, తెలియఁజాలక చేసి! బాధ నొందితినయ్య పద్యనాభ!
అనుభవించెడు నప్పుడతి ప్రయాసంబంచుఁ బ్రజలు చెప్పఁగ జాల భయముఁగలిగె,
నెరిగిపోవుటకునై యే యుపాయంబైనఁ జేసి చూతమటన్నఁ జేతఁగాదు,
సూర్యశశినేత్ర! నీ చాటుఁ జొచ్చినాఁడ,
కలుషములుద్రుంచి నన్నేలు కష్టమనక,
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!
తాపసార్చిత! నేను పాపకర్ముడ నంచు నాకు వంకలబెట్టఁబోకుసుమ్మి,
నాఁటికి శిక్షలు నన్ను జేయుటకంటె నేఁడు సేయుము నీవు నే స్తమనక,
అతిభయంకరులైన యమదూతలకు నన్ను నొప్పగింపకుమయ్య యురగశయన!
నీ దాసులనుబట్టి నీవు దండింపంగ వద్దు వద్దన రెంత పెద్దలైన,
తండ్రివై నీవు పరపీడఁ దగులఁజేయ
వాసిగల పేరు కపకీర్తి వచ్చునయ్య,
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!
ధరణిలోపల నేను తల్లి గర్భమునుండి పుట్టినప్పటినుండి పుణ్యమెఱుఁగ
నేకాదశీవ్రతం బెన్నఁడుండంగ లేదు, తీర్థయాత్రలకైన దిరుగలేదు,
పారమార్థికమైన పనులు సేయఁగలేదు, భిక్షమొక్కనికైనఁ బెట్టలేదు,
జ్ఞానవంతులకైనఁ బూని మ్రొక్కఁగలేదు, ఇతర దానములైన నీయలేదు,
నళినదళనేత్ర నిన్ను నే నమ్మినాను,
చేరి రక్షింపవే నన్ను శీఘ్రముగను,
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!
అడవిపక్షుల కెవ్వఁడాహారమిచ్చెను? మృగజాతికెవ్వఁడు మేఁతఁబెట్టె?
వనచరాదులకు భోజన మెవ్వఁడిప్పించెఁ జెట్లకెవ్వఁడు నీళ్ళు చేఁదిపోసె?
స్త్రీ గర్భంబున శిశువు నెవ్వఁడు పెంచె? ఫణుల కెవ్వఁడు పోసె బరఁగఁబాలు
మదుపాళికెవ్వఁడు మకరంద మొనరించె? బసులకెవ్వడొసంగెఁ బచ్చిపూరి?
జీవకోట్ల బోషింప నీవెకాని.
వేఱె యొకదాత లేఁడయ్య వెదకిచూడ!
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!
దనుజారి! నావంటి దాసజాలము నీకు కోటిసంఖ్య గలరు కొదువలేదు,
బంట్ల సందడివల్ల బహుపరాకై నన్ను మఱచి పోకుము భాగ్య మహిమచేత,
దండిగా భృత్యులు తగిలి నీకుండంగ ఒక్కబంటేపాటి పనికి నగును?
నీవు మొచ్చడి పనుల్ నేను జేయఁగలేక యింత వృథా జన్మ మెత్తినాను.
భూజనులలోన నే నప్రయోజకుఁడను
గనుక నీ సత్కాటాక్షంబు గలువఁజే;
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!
కమలలోచన! నన్నుఁ గన్న తండ్రివి కాన నిన్ను నేమరకుంటి నేను విడక,
యుదర పోషణకునై యొకరి నే నాశింప నేర! నా కన్నంబు నీవు నడపు,
పెట్టలేనంటివా పిన్న పెద్దలలోనఁ దగవు కిప్పుడు దీయఁ దలఁచినాను,
ధనము భారంబైనఁ దలకిరీటములమ్ము, కుండలంబులు పైడి గొలుసులమ్ము,
కొసకు నీ శంఖచక్రముల్ కుదవఁ బెట్టి
గ్రాసము నొసగి పోషించు కపటముడిగి;
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!
కువలయ శ్యామ! నీ కొలువు చేసిన నాకు జీతమెందుకు ముట్టఁ జెప్పవైతి?
మంచి మాటలచేతఁ గొంచెమీయఁగలేవు కలహమౌనిఁకఁ జుమ్మి ఖండితముగ,
నీవు సాధువుగాన నింత పర్యంతంబుచనువుచే నిన్నాళ్ళు జరుపవలసె,
నిఁక నే సహింప నీవిపుడు నన్నేమైన శిక్ష చేసినఁ జేయు సిద్ధమయితి.
నేఁడు కరుణింపకుంటివా నిశ్చయముగఁ
దెగఁబడితిఁ జూడు నీతోడ జగడమునకు,
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!
హరి! నీకుఁ బర్యంకమైన శేషుఁడు చాలఁ బవనము భక్షించి బ్రతుకుచుండు,
ననువుగా నీకు వాహనమైన ఖగరాజు గొప్పపామును నోఁటఁ గొఱకుచుండు,
నదిగాక నీభార్యయైన లక్ష్మీదేవి దినము పేరంటంబు దిరుగుచుండు;
నిన్ను భక్తులు పిల్చి నిత్య పూజలుచేసి ప్రేమఁ బక్వాన్నముల్ పెట్టుచుండ్రు,
స్పష్టముగ నీకు గ్రాసము జరుగుచుండఁ
గాను నీ చేతి దొకటైనఁ గాదు వ్యయము,
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!
పుండరీకాక్ష! నా రెండు కన్నుల నిండ నిన్నుఁ జూచెడి భాగ్య మెన్నడయ్య!
వాసిగా నా మనోవాంఛ దీరెడునట్లు సొగసుగా నీరూపు చూపవయ్య
పాపకర్ముని కంటఁబడక పోవుదమంచుఁ బరుషమైన ప్రతిజ్ఞ బట్టినావె!
వసుధలోఁ బతితపావనుఁడ వీవంచు నేఁ ఋణ్యవంతుల నోటఁ బొగడ వింటి;
నేమిటికి విస్తరించె నీ కింతకీర్తి?
ద్రోహినైనను నాకీవు దొరకరాదె?
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!
పచ్చి చర్మపుఁదిత్తి పసలేదు దేహంబు లోపలనంతట రోయ రోఁత,
నరముల శల్యముల్ నవరంధ్రములు రక్త మాంసముల్ కండలు మైలతిత్తి,
బలువైన యెండవానల కోర్వదెంతైనఁ దాళలే దాఁకలి దాహములకు,
సకల రోగములకు సంస్థానమయియుండు నిలువ దస్థిరమైన నీటిబుగ్గ,
బొందిలోనుండి ప్రాణముల్ పోయినంతఁ
గాటికే కాని కొఱగాదు గవ్వకైన,
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర! 50
బలురోగములకు నీ పాదతీర్థమె కాని, వలపు మందులు నాకు వలదు వలదు,
చెలిమి సేయుచు నీకు సేవ జేసెదగాని, నీ దానకోటిలో నిలువనయ్య,
గ్రహభయంబునకుఁ జక్రము దలంచెదఁగాని ఘోరరక్షలు గట్టఁగోరనయ్య,
పాము కాటుకు నిన్ను భజనజేసెదఁగాని దాని మంత్రము నేను తలపనయ్య,
దొరికితివి నాకు దండివైద్యుఁడవు నీవు,
వేయి కష్టాలు వచ్చిన వెఱవనయ్య,
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!
కూటికోసరము నే గొరగాని జనులచేఁ బలుగద్దరింపులు పడఁగ వలసెఁ
దారసుత భ్రమఁదగిలి యుండఁగఁ గదా? దేశ దేశములెల్లఁ, దిరుగవలసెఁ,
బెను దరిద్రతపైనిఁ బెనఁగి యుండగఁ గదా? చేరి నీచుల సేవఁ జేయవలసె,
నభిమానములు మదినంటియుండగఁ గదా? పరులఁజూచిన భీతిఁబడఁగ వలసె,
నిటుల సంసార వారధి నీఁద లేక
వేయి విధముల నిన్ను నే వేఁడుకొంటిఁ
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!
సాధు సజ్జనులతో జగడమాడినఁ గీడు, కవులతో వైరంబుఁ గాంచఁ గీడు,
పరమదీనులఁ జిక్కఁబట్టి కొట్టినఁ గీడు, బిచ్చగాండ్రను దుఁఖపెట్టఁ గీడు,
నిజపేదలను జూచి నిందఁజేసినఁ గీడు, పుణ్యవంతులదిట్టఁ బొసగుఁ గీడు,
సద్భక్తులను దిరస్కారమాడినఁ గీడు, గురుని ద్రవ్యము దోచుఁకొనినఁ గీడు,
దుష్టకార్యము లొనరించు దుర్జనులకు
ఘనతరంబైన నరకంబు గట్టిముల్లె,
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ దురితదూర!
పరుల ద్రవ్యముమీఁద భ్రాంతినొందినవాఁడు, పరకాంతల నపేక్ష పడెడువాఁడు,
అర్థులవిత్తంబు లవహరించెడువాఁడు, దానమీయంగ వద్దనెడువాఁడు,
సభలోపల నిల్చి చాడి చెప్పెడివాఁడు పక్షపు సాక్ష్యంబు పలుకువాఁడు,
విష్ణుదాసులఁ జూచి వెక్కిరించెడువాఁడు, ధర్మసాధులఁ దిట్టఁ దలచుఁవాఁడు,
ప్రజల జంతుల హింసించు పాతకుండు
కాలకింకర గదలచేఁ గష్టమొందు,
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర! 54
55
నీ భక్తులను గనుల్ నిండ జూచియు రెండు చేతుల జోహారు చేయువాఁడు
నేర్పుతో నెవరైన నీ కథల్ చెప్పంగ వినయమందుచుఁ జాల వినెడివాఁడు,
తన గృహంబునకు నీ దాసులు రా జూచి పీటపైఁ గూర్చుండఁ బెట్టువాఁడు,
నీ సేవకుల జాతి నీతులెన్నక చాల దాసోహమని చేరఁదలచువాఁడు,
పరమభక్తుండు ధన్యుండు భానుతేజ!
వానిఁ గనుఁకొన్న ఋణ్యంబు వసుధలోన,
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!
పక్షివాహన! నేను బ్రతికినన్ని దినాలు కొండెగాండ్రను గూడి కుమతినైతి
నన్న వస్త్రములిచ్చి యాదరింపుము నన్నుఁ గన్నతండ్రివి నీవె కమలనాభ!
మరణమయ్యెడి నాఁడు మమతతో నీయొద్ద బంట్లో దోలుము ముందు బ్రహ్మజనక!
యినజభటావళి యీడిచికొనిపోక కరుణతో నాయొద్దఁగావలుంచు,
కొనకు నీ సన్నిధికిఁ బిల్చుకొనియు నీకు
సేవకుని జేసికొనవయ్య శేషశయన!
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!
నిగమాది శాస్త్రముల్ నేర్చిన ద్విజుఁడన, యజ్ఞకర్తగు సోమయాజియైన,
ధరణిలోపలఁ బ్రభాతస్నాన పరుఁడైన, నిత్య సత్కర్మాది నిరతుఁడైన,
ఉపవాసనియమంబున్ బంధు సజ్జనుఁడైన గాని వస్త్రముఁ గట్టు ఘనుఁడునైన,
దండి షోడశమహాదాన పరుండైన, సకలయాత్రలు సల్పు సరసుఁడన;
గర్వమునఁ గష్టపడి నిన్నుఁ గానకున్న
మోక్షసామ్రాజ్య మొందఁడు మోహనాంగ!
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!
పంజరంబుఁ గాకి బట్టియుంచిన లెస్స పలుకునే వింతైనఁ జిలుకవలెను?
గార్ధభంబును దెచ్చి కళ్ళెమింపుగ వేయ దిరుగునే గుఱ్ఱంబు తీరుగాను?
ఎనుబోతు నొగి మావటీఁడు శిక్షించిన నడచునే మదవారణంబువలెను?
పెద్ద పిట్టకు మేఁతఁబెట్టి పెంచినఁ గ్రొవ్వి సాగునే వేఁటాడు డేఁగవలెను?
కుజనులను దెచ్చి నీ సేవకొఱకుఁ బెట్ట
వాంఛతోఁ జేతురే భక్తపరుల వలెను?
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!
నీకు దాసుఁడనంటి నిన్ను నమ్ముకయుంటిఁ గాన నాపై నేఁడు కరుణజూడు
దోసిలొగ్గితి నీకు ద్రోహమెన్నగఁబోకు, పద్మలోచన! నేను బరుఁడగాను
భక్తి నీపైనుంచి భజన జేసెదఁగాని, పరులవేఁడను జుమ్మి వరములిమ్ము,
దండి దాతపు నీవు తడవు సేయకకావు, ఘోర పాతక రాశిఁ గొట్టివైచి,
శీఘ్రముగఁ గోర్కు లీడేర్చు చింతదీర్చు,
నిత్యమును నన్నుఁ బోషించు, నెనరునుంచు,
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర! 60
విద్యనేర్పితినంచు విఱ్ఱవీగంగ లేదు, భాగ్యవంతు డనంచుఁ బలకలేదు,
ద్రవ్యవంతుఁడనంచు దరచుఁ నిక్కఁగలేదు, నియతి దానములైన నెఱపలేదు,
పుత్రవంతుఁడనుంచు బొగడుచుండఁగలేదు, భృత్యవంతుఁడ నంచు బెగడలేదు,
శౌర్యవంతుఁడ నంచు సంతసింపఁగలేదు, కార్యవంతుఁడనంచుఁ గడపలేదు,
నలుగురికి మెప్పుగానైన నడవలేదు,
నళినదళనేత్ర! నిన్ను నే నమ్మినాను,
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!
అతిలోభులను భిక్ష మడుగ బోవుట రోఁత తనద్రవ్య మొకరింట దాఁచ రోఁత,
గుణహీనుఁడగువానిని కొలువుఁగొల్చుట రోఁత, యొరుల పంచలక్రింద నుండ రోఁత,
భాగ్యవంతుని తోడఁ బంతమాడుట రోఁత, గుఱిలేని బంధులఁ గూడ రోఁత
యదాయములు లేక యప్పుదీయుట రోఁత, జారచోరుటఁ గూడి చనుట రోఁత
యాదిలక్ష్మీశ! నీ బంట నైతినయ్య
యింక నెడఁబాపు జన్మం బదెన్న రోఁత,
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!
వెర్రివానికి నేల వేదాక్షరంబులు? మోటువానికి మంచి పాటలేల?
పసులఁగాపరికేల పరతత్త్వ బోధలు? విటగాని కేటికి విష్ణుకథలు?
వదరు శుంఠకేల వ్రాఁత పుస్తకములు? తిరుగుఁ దిమ్మరికేల దేవపూజ?
ద్రవ్యలోభికి నేల దాతృత్వ గుణములు? దొంగబంటుకు మంచి సంగేతేల?
క్రూరజనులకు నీమీఁదఁ గోరికేల?
ద్రోహి పాపాత్మునకు దయా దుఃఖమేల?
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!
నా తండ్రి, నా దాత! నా యిష్టదైవమా! నన్ను మన్ననసేయు నారసింహ!
దయయుంచు నామీఁద దప్పులన్ని క్షమించి నిగమగోచర! నాకు నీవె దిక్కు,
నే దురాత్ముఁడనంచు నీ మనంబునఁ గోపగింపఁబోకుము స్వామీ! కేవలముగ,
ముక్తిదోయక! నీకు మ్రొక్కినందుకు నన్నుఁ గరుణించు రక్షించు కమలనాభ!
దండి దొరవంచు నీ వెంటఁ దగిలినాను
నేఁడు ప్రత్యక్షమై నన్ను నిర్వహింపు,
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!
వేమాఱు నీ కథల్ వినుచు నుండెడివాఁడు పరుల ముచ్చటమీఁద భ్రాంతిపడఁడు,
అగణితంబుగ నిన్నుఁ బొగడనేర్చినవాఁడు చెడ్డమాటల నోటఁజెప్పఁబోడు
ఆసక్తిచేత నిన్ననుసరించెడివాఁడు ధనమదాంధుల వెంటఁ దగులఁబోడు,
సంతసంబున నిన్ను స్మరణఁజేసెడివాఁడు చెలఁగి నీచుల పేరు దలఁపబోఁడు
నిన్ను నమ్మిన భక్తుండు నిశ్చయముగఁ
గోరి చిల్లర వేల్పులఁ గొల్వబోడు,
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!
నేనెంత వేఁడిన నీకేల దయరాదు? పలుమాఱు పిలిచినఁ బలుకవేమి?
పలికిన నీకున్న పదవేమి పోవును? మోమైనఁబొడచూపవేమి నాకు?
శరణుఁజొచ్చినవాని సవరించువలెఁగాక పరిహరించుట నీకు బిరుదుగాదు,
నీ దాసులకు నీవు నిర్వహింపక యున్నఁ బరులెవ్వరగుదురు పంకజాక్ష?
దాత దైవంబు తల్లియు దండ్రినీవె,
నమ్మియున్నాను నీపాద సలిలమును,
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!
వేదముల్ చదివెడు విప్రవర్యుండైన రణము సాధించెడు రాజులైన,
వర్తక కృషికుఁడౌ వైశ్య ముఖ్యుండైనఁ బరిచరించెడి శూద్రవర్యుడయిన,
మెచ్చు ఖడ్గముఁ బట్టి మెఱయు మ్లేచ్చుండైన, బ్రజల కక్కఱపడు రజకుఁడైన,
చర్మమమ్మెడు హీన చండాల నరుఁడైన, నీ మహీతలమందు న్వెఁడైన,
నిన్నుఁ గొనియాడుచుండెనా నిశ్చయముగ
వాఁడు మోక్షాధికారి యీ వసుధలోన;
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!
సకల విద్యలు నేర్చి సభ జయింపఁగ వచ్చు, శూరుఁడై రణమందుఁ బోరవచ్చు,
రాజరాజైనపుట్టి రాజ్య మేలఁగవచ్చు, హేమ గోదానంబు లియ్యవచ్చు,
గగనమందున్న చుక్కల నెంచఁగావచ్చు జీవరాసుల పేర్లు చెప్పవచ్చు,
నష్టాంగయోగంబు లభ్యసింప వచ్చు, కఠినమౌ రాల మ్రింగంగవచ్చు,
తామరసగర్భ హరపురందరులకైన
నిన్ను వర్ణింపఁ దరమౌనె నీరజాక్ష!
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!
నరసింహా! నీవంటి దొరను సంపాదించి, కుమతిమానవుల నేఁగొల్వజాల,
నెక్కువైశ్వర్యంబు లియ్యలేకున్నను బొట్టకు మాత్రము పోయరాదె?
ఘనముగాదిది నీకుగరుణ బోషింప, గష్ట మెంతటి స్వల్ప కార్యమయ్య?
పెట్టఁజాలక యేల భిక్షమెత్తించెదు, నన్ను బీదనుజేసినావదేమి?
విమల! కమలాక్ష! నేనిట్లు శ్రమపడంగఁ
గన్నులకుఁ బండువై నీకుఁ గానఁబడునె?
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!
వనరుహనాభ! నీ వంకఁ జేరితి నేను, గట్టిగా ననుఁ గావు; కావు మనుచు
వచ్చినందుకు వేగ వరము లీయకకాని లేవబోయిన నిన్ను లేవనియ్యఁ
గూర్చుండఁబెట్టి నీ కొంగు గట్టిగఁబట్టి వుచ్చుకొందును జూడు భోగిశయన
యీవేళ నీకడ్డ మెవరు వచ్చినఁగాని వారికైనను లొంగి వణఁకబోను,
కోపగాఁడవు నీవు నా గుణముఁ దెలిసి
యిప్పుడే నన్ను రక్షించి యేలుకొమ్ము,
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర! 70
ప్రహ్లాదుఁడేపాటి పైఁడి కానుకలిచ్చె? మదగజం బెన్నిచ్చె మౌక్తికములు?
నారదుండెన్నిచ్చె నగలు రత్నంబు? లహల్య నీకే యగ్రహారమిచ్చె?
నుడుత నీకేపాటి యూడిగంబులు చేసె? ఘన విభీషణుఁడేమి కట్నమిచ్చె?
పంచపాండవులేమి లంచమిచ్చిరి నీకు? ద్రౌపది నీ కెంత ద్రవ్యమిచ్చె?
నీకు వీరందఱయినట్లు నేను గాక
యెందుకని నన్ను రక్షింప విందునదన!
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!
వాంఛతో బలి చక్రవర్తి దగ్గఱఁజేరి భిక్షమెత్తితివేల బిడియపడక?
యడవిలో శబరి తియ్యని ఫలాలందియ్యఁ జేతులొగ్గితివేల సిగ్గుపడక!
వేడ్కతో వేవేగ విదురునింటికి నేఁగి విందుగొంటివదేమి వెలితిపడక?
నటుకులల్పము కుచేలుఁడు గడించుక చేర బొక్కసాగితివేల లెక్కగొనక?
భక్తులకు నీవు పెట్టుట భాగ్యమౌను,
వారికాశించితివి తిండివాఁడవగుచు;
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!
స్తంభమందుదయించి దానవేంద్రునిఁ ద్రుంచి కరుణతోఁ బ్రహ్లాదుఁ గాచినావు;
మకరిచేఁ జిక్కి సామజము దుఃఖింపంగఁ గృపయుంచి వేగ రక్షించినావు;
శరణంచు నవ్విభీషణుడు నీ చాటున వచ్చినప్పుడె లంకనిచ్చినావు;
ఆ కుచేలుఁడు చేరె డటుకులర్పించిన బహుసంపదలిచ్చి పంపినావు;
వారివలె నన్ను, భోషింప వశముగాదె
యింతవలపక్షమేల? శ్రీకాంత! నీకు;
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!
వ్యాసుఁడేకులమందు వాసిగా జన్మించె? విదురుఁడేకులమందు వృద్ధిబొందె?
కర్ణుడేకులమందు ఘనముగా వర్ధిల్లె? నా వసిష్టుడెందు నవతరించె?
నింపుగా వాల్మీకి యే కులంబునఁబుట్టె? గుహు డను పుణ్యు డేకులమువాఁడు?
శ్రీశుకుఁడెచ్చటఁజెలఁగి జన్మించెను? శబరి యే కులమందు జన్మమొందె?
నే కులంబున వీరందఱొచ్చినారు?
నీ కృపాపాత్రులకు జాతి నీతులేల?
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!
వసుధాస్థలంబున వర్ణహీనుఁడుగాని, బహుళ దురాచారపరుఁడుగాని,
తడిచి కాసియ్యని ధర్మశూన్యుఁడుగాని, చదువనేరని మూఢజనుఁడుగాని,
సకల మానవులు మెచ్చని కృతఘ్నుఁడుగాని, చూడసొంపును, లేని శుంఠగాని,
యప్రతిష్టలకు లోనైన దీనుడుగాని, మొదటి కేమెఱుగని మోటుగాని
ప్రతిదినము నీదుఁ భజనచేఁ జరఁగునట్టి
వానికేవంకలేదయ్య, వచ్చు ముక్తి;
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!
ఇభకుంభములమీఁది కెగిరెడి సింగంబు ముట్టునే కుఱుచైన మూషికమును?
నవచూతపత్రముల్ నమలెడి కోయిల కొఱకునే జిల్లేడు కొనలు నోట?
నరవింద మకరంద మనుభవించెడి తేఁటి పోవునే పల్లేరు పూలకడుకు?
లలితమైన రసాల ఫలముకోరెడి చిల్క మెసవునే భ్రమరె నుమ్మెత్తకాయ?
నిలను నీ కీర్తనలు పాడ నేర్చినతఁడు
పరుల కీర్తనఁబాడునే యరసి చూడ?
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!
సర్వేశ! నీ పాద సరసిజ ద్వయమందుఁ జిత్తముంచగఁలేను జెదరకుండ,
నీవైన దయయుంచి నిలచియుండెడునట్లు చేసి నన్ని పుడేలు, సేవకుఁడను,
వనజలోచన! నేను వట్టి మూర్ఖుడ జుమ్మి, నీ స్వరూపముఁజూడ నేర్పు వేగ,
తన కుమారుల కుగ్గు తల్లి పోసినయట్లు భక్తిమార్గంబను పాలుపోసి,
ప్రేమతో నన్నుఁ బోషించి పెంచుకొనుము
ఘనతఁకెక్కించు నీ దాస గణములోన,
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!
జీమూతవర్ణ! నీ మోముతో సరిరాక కమలారి యతికళంకమునుఁబడసె,
సొగసైన నీ నేత్ర యుగముతో సరికాక, నళిన బృందము నీళ్ళ నడుమఁజేరెఁ
గరిరాజవరద! నీ గళముతో సరిరాక పెద్ద శంఖము బొబ్బ పెట్టఁ దొడఁగె,
శ్రీపతి! నీ దివ్యరూపుతో సరిరాక పుష్పబాణుఁడు నీకుఁ బుత్రుఁడయ్యె,
నిందిరాదేవి నిన్ను మోహించి విడక
నీకుఁ బట్టంపు సతియయ్యె నిశ్చయముగ,
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!
హరిదాసులను నిందలాడకుండినఁజాలు సకల గ్రంధమ్ములు చదివినట్లు,
భిక్షమియ్యంగఁ దప్పింప కుండినఁ జాలుఁ జేముట్టి దానంబు చేసినట్లు,
మించి సజ్జనుల వంచించకుండినఁ జాలు నింపుగా బహుమాన మిచ్చినట్లు,
దేవాగ్రహముల్ దీయకుండినఁ జాలుఁ గనక కంబపు గుళ్ళు గట్టినట్లు,
ఒకరి వర్ణాశనము ముంచకున్నఁ జాలుఁ
బేరు కీర్తిగ సత్రముల్ పెట్టినట్లు;
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!
ఇహలోక సౌఖ్యమ్ము లిచ్చగించెదమన్న దేహ మెప్పటికిఁదా స్థిరత నొంద,
దాయష్యమున్న పర్యంతంబు పటుతయు నొక్కతీరుననుండ దుర్విలోన
బాల్యయౌవన సుదుర్బల వార్థక్యములను మూఁటిలో మునిఁగెడి ముఱికి కొంప,
భ్రాంతితో దీని గాపాడుద మనుకొన్నఁ గాలమృత్యువుచేతఁ గోలుపోవు,
నమ్మరాదయ్య! యిది మాయ నాటకంబు;
జన్మమిఁక నొల్ల నన్నేలు జలజనాభ!
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర! 80
భావంబు నీనామ భజన గోరుచునుండు, జిహ్వ నీ కీర్తనల్, చేయఁగోరు,
హాస్యయుగ్మంబు నిన్నర్చింపగోరును, గర్జముల్ నీమీఁది కథను గోరు,
దునువు నీ సేవయే ఘనముగాఁ గోరును, నయనముల్ నీ దర్శనంబుఁ గోరు,
మూర్ఖమ్ము నీ పదంబుల మ్రొక్కఁగాఁ గోరు, నాత్మ నీదైఁయుండు నరసిచూడ,
స్వప్నములనైన నేవేళ సంతతమును
బుద్ధి నీ పాములయందుఁ బూనియుండు,
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!
పద్మాక్ష! మమతచే! బరమునందెదమంచు విఱ్ఱవీగుదుమయ్య! వెఱ్ఱిపట్టి
మా స్వతంత్రంబైన మదము కండ్లకుఁ గప్పి మొగముపట్టదు కామ మోహమునను,
బ్రహ్మదేవుండైనఁ బైఁడి దేహముఁ గల్గఁ జేసివేయక మమ్ముఁ జెరిచెనతఁడు,
తుచ్చమైనటుంటి తోలెమ్ముకలతోడ ముఱికిచెత్తలు చేర్చి మూటకట్టె,
నీ శరీరము పడిపోము టెఱుఁగకేము
కాముకులమైతి! మిఁకమిమ్ము గానలేము,
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!
గరుడవాహన! దివ్య కౌస్తుభాలంకార రవికోటితేజ! సారంగవదన!
మణిగణాన్విత! హేమ మకుటాభరణ! చారు మకరకుండల! లసన్మందహాస!
కాంచనాంబర! రత్న కాంచీవిభూషిత! సురవరార్చిత! చంద్ర సూర్యనయన!
కమలనాభ! ముకుంద! గంగాధరస్తుత! రాక్షసాంతక! నాగరాజశయన!
పతితపావన! లక్ష్మీశ బ్రహ్మజనక!
భక్తవత్సల! సర్వేశ పరమపురుష!
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!
పలుమాఱు దశరూపములు ధరించితివేల? నేకరూపముఁ బొందవేల నీవు?
నయమున క్షీరాబ్ది నడుమఁ జేరితివేల? రత్నకాంచన మదిరములు లేవె?
పన్నగేంద్రునిమీఁదఁ బవ్వళించితివేల? జలతారు పట్టెమంచములు లేవె?
ఱెక్కలుగల పక్షినెక్కసాగితివేల? గజతురంగాందోళికములు లేవె?
వనజలోచన! యిటువంటి వైభవములు
సొగసుగా నీకుఁ దోఁచెనోఁ సుందరాంగ!
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!
తిరుపతి స్థలమందుఁ దిన్నగా నేనున్న వేంకటేశుఁడు మేఁత వేయలేఁడె?
పురుషోత్తమునకు బోయిన జాలుఁజ గన్నాథు డన్నంబుఁ గడపలేఁడె?
శ్రీరంగమునకు నేఁజేర బోయినఁజాలు స్వామి గ్రాసము పెట్టి సాఁకలేఁడె?
కాంచీపురములోన గదిసి నే కొలువున్నఁ గరివరదుఁడు పొట్ట గడపలేఁడె?
యెందుఁబోవక నేను నీ మందిరమున
నిలిచితిని, నీకు నామీఁద నెనరు లేదు,
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!
తారక్ష్యవాహన! నీవు దండి దాత వటంచుఁ గోరి వేడుక నిన్నుఁ గొల్వవచ్చి
యర్థిమార్గమును నే ననుసరించితి నయ్యలా వెనుబదినాల్గు లక్షలైన
వేషముల్ వేసి నా విద్యా ప్రగల్భతఁ జూపసాగితి నీకు, సుందరాంగ!
యానందమైన నే నడుగ వచ్చిన దిచ్చి వాంఛఁ దార్చుము నీలవర్ణ, వేగ
నీకు నావిద్య హర్షంబు గాకయున్న
తేప తేపకు వేషముల్ డేనుజుమ్మి!
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!
అమరేంద్రవినుత! నే నతిదురాత్ముఁడనుఁ గలలోన నైనను గనులఁబడవు,
నీవు ప్రత్యక్షమై నిలువకుండిన మానె, దొడ్డగా నొక యుక్తి దొరకెనయ్య!
గట్టికొయ్యను దెచ్చి ఘనముగా ఖండించి నీ స్వరూపముచేసి నిలువుకొందు
ధూప దీపములిచ్చి, తులసితోఁ బూజించి నిత్య నెవేద్యముల్ నేమముగను,
నడపుచును నిన్నుఁ గొలిచెద నమ్మి బుద్ధి
నీ ప్రపంచంబు గలిగె నా కింతెచాలు,
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!
భువనేశ గోవింద! రవికోటిసంకాశ పక్షివాహన! భక్త పారిజాత!
యంభోజభవరుద్ర జంభారి సన్నుత! సామగాన విలోల! సారసాక్ష!
వనధిగంభీర! శ్రీవత్సకౌస్తుభవక్ష! శంఖచక్రగదాని శారంగహస్త!
దీనరక్షక! వాసుదేవ! దైత్యవినాశ! నారదార్చిత! దివ్యనాగశయన!
చారునవరత్నకుండల శ్రవణయుగళ!
విబుధవందిత పాదాబ్జ విశ్వరూప!
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!
నాగేంద్రశయన! నీ నామ మాధుర్యంబు మూఁడుకన్నుల సాంబమూర్తి కెఱుక;
పంకజాతాక్ష! నీ బలపరాక్రమమెల్ల భారతీపతియైన బ్రహ్మకెఱుక;
మధుకైటాభారి! నీ మాయాసమర్ధత వసుధలో బలిచక్రవర్తి కెఱుక;
పరమాత్మ నీదగు పక్షపాతిత్యంబు దశశతాక్షుల పురందరున కెఱుక;
వీరికెఱుకగు నీకథల్ వింతలెల్ల
నరుల కెఱుకన్న నెవ్వరైన నవ్విపోరె?
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!
అందరేమైన నిన్నడుగ వచ్చెద రంచు క్షీరసాగరమందుఁ జేరినావు,
నీ చుట్టు సేవకుల్ నిలువకుండుటకునై భయద సర్పముమీఁదఁ బండినావు,
భక్త బృందము వెంటఁబడి రచించెద రంచు నెగసిపోయెడి పక్షినెక్కినావు,
మౌనులు నీ ద్వారమాసింపకుంటకు మంచియోధుల కాపలుంచినావు,
లావు గలవాడఁవైతి; వేలాగు నేను
నిన్నుఁ జూతును? నా తండ్రి నీరజాక్ష!
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర! 90
నీ కథల్ చెవులలో సోకుఁట మొదలుఁగా బులకాంకురము మేనఁ బుట్టువాఁడు
నయమైన నీ దివ్యనామకీర్తనలోన మగ్నుఁడై దేహంబు మఱచువాఁడు,
ఫాలంబుతో నీదుపాదయుగ్మమునకుఁ బ్రేమతో దండమర్పించువాఁడు,
హా పుండరీకాక్ష; హా రామ! హరి! యంచు వేడ్కతోఁ గేకలు వేయువాఁడు,
చిత్తకమలంబునను నిన్నుఁ జేర్చువాఁడు,
నీదు లోకంబునందుండు నీరజాక్ష!
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!
నిగమగోచర! నేను నీకు మెప్పగునట్లు లెస్సగాఁ బూజింపలేను సుమ్మి,
నాకు దోచిన భూషణములు పెట్టెదనన్నఁ గౌస్తుభమణి నీకుఁగలదు ముందె,
భక్ష్యభోజ్యముల నర్పణముఁ జేసెదనన్న నీవు పెట్టితి సుధ నిర్జరులకు,
గలిమికొద్దిగఁ గానుకల నొసంగెదనన్న భార్గవీదేవి నీ భార్యయయ్యె,
నన్ని గలవాఁడ నఖిలలోకాధిపతివి,
నీకు భూషాదులనుబెట్ట నెంతవాఁడ?
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!
నవరసరోజదళాక్ష నన్ను బోషించెడి దాతవు నీవంచు ధైర్యపడితి,
నామనంబున నిన్ను నమ్మినందుకుఁ దండ్రి! మేలు నా కొనరింపు నీలదేహ?
భళి భళి? నీయంత ప్రభువునెక్కడఁజూడఁ పుడమిలో నీ పేరు పొగడవచ్చు,
ముందుఁ జేసిన పాపమును నశింపగఁజేసి, నిర్వహింపుము నన్ను నేర్పుతోడఁ
బరమ సంతోషమాయె నా ప్రాణములకు
నీ ఋణముఁ దీర్చుకొననేర నీరజాక్ష!
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!
ఫణుల పుట్టలమీదఁ బవ్వళించినయట్లు పులుల గుంపునఁ జేరఁబోయినట్లు,
మకరి వర్గంబున్న మడుఁగు జొచ్చినయట్లు, గంగదాపున నిండ్లుఁ గట్టినట్లు,
చెదలభూమినిఁ జూప చేర బఱచినట్లు, లోలుతిత్తినిఁ బాలు బోసినట్లు,
వెఱ్ఱివానికి బహు విత్త మిచ్చినయట్లు, కమ్మగుడిసె మందుఁ గాల్పినట్టు,
స్వామి! నీ భక్తవరులు దుర్జనులతోడఁ
జెలిమిఁజేసిన యటులైన జుటువచ్చు;
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!
ధనుజ సంహార! చక్రధర! నీకు దండంబు లిందిరాధిప! నీకు వందనంబు,
పతిపావన! నీకు బహు నమస్కారముల్, నీరజాత దళాక్ష నీకు శరణు,
వాసవార్చిత! మేఘవర్ణ! నీకు శుభంబు, మందర ధర! నీకు మంగళంబు,
కంబురంధర! శార్జకర! నీకు భద్రంబు, దీనరక్షక కీకు దిగ్విజయము,
సకల వైభవములు నీకు సార్వభౌమ!
నిత్య కళ్యాణములు నగు నీకు నెపుడు;
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!
మత్స్యావతారమై మడుగులోపలఁజొచ్చి సోమకాసురుఁ ద్రుంచి చోద్యముగను;
దెచ్చి వేదములెల్ల మెచ్చ దేవతలెల్ల బ్రహ్మకిచ్చితి నీవు భళి యనంగ;
నా వేదముల నంది యాచారనిష్ఠల ననుభవించుచు నుందు రవనిసురులు;
సకల పాపంబులు సమసిపోవు నటంచు మనుజులందఱు నీదు మహిమఁ దెలియ
కుందు, రరవిందనయనఁ నీ యునికిఁ దెలియు
వారలకు వేగ మోక్షంబు వచ్చు ననఘు!
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!
కూర్మావతారివై కుధరంబు క్రిందను గోర్కెతో నుండవా కొమరు మిగుల
వారహమూర్తివై వనభూములం జొచ్చి శిక్షింపవా హిరణ్యాక్షునపుడు
నరసింహమూర్తివై వసుధలో బలిచక్ర కశివునిఁ ద్రుంచవా కాంతిమీఱ?
వామనరూపివై వసుధలో బలిచక్ర వర్తి నణంపవా వైరముంచి?
యిట్టి పనులెల్లఁ జేయఁగా నెవ్వరికినిఁ
దగును నరసింహ నీకిది తగునుగాక;
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!
లక్ష్మీశ! నీ దివ్య లక్షణగుణముల వినఁజాల కెప్పుడు వెఱ్ఱినైతి;
నా వెఱ్ఱి గుణమును నయముగా ఖండించి నన్ను రక్షింపుమో నళిననేత్ర!
నిన్ను నే నమ్మితి నితర దైవముల నే నమ్మలే దెప్పుడు నాగశయన!
కాపాడినను నీవె కష్టపెట్టిన నీవె; నీ పాదకమలముల్ నిరతి నేను
నమ్మియున్నాను; నీపాద నళినభక్తి
వేగ దయచేసి రక్షింపు వేదవేద్య!
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!
అమరేంద్రవినుత! నిన్ననుసరించినవారు ముక్తి బొందిరి వేగ ముదముతోడ
నీ పాద పద్మముల్ నెఱ నమ్మియున్నాను నాకు మోక్షంబిమ్ము నళిననేత్ర!
కాఁచి రక్షించు నన్ గడతేర్చు వేగమే నీ సేవకునిఁజేయు నిశ్చయముగ
గాపాడినను నీకుఁ గైవంకర్యపరుఁడనై చెలఁగి నీ పనులను జేయువాఁడు;
ననుచుఁ బలుమారు వేడెద నబ్జనాభ
నాకు బ్రత్యక్షమగు నిన్నె నమ్మినాను
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!
శేషప్పయనుకవి చెప్పిన పద్యముల్ చెవుల కానందమై చెఁలగుచుండు;
నేమనుజుండైన నెలమి నీ శతకంబు భక్తితో విన్న సత్పలము గలుగుఁ;
జెలఁగి యీ పద్యముల్ - చేర్చి వ్రాసినవారు కమలాక్షు కరుణను - గంతురెపుడు
నింపుగా బుస్తకం - జెపుడు బూజించిన దురిత జాలంబులు - దొలగిపోవుము
నిద్దిపుణ్యకరంబని - యెపుడు జనులు
కష్టనునక పఠించినం గలుగు ముక్తి
భూషణ వికాస శ్రీధర్మ - పురనివాస
దుష్టసంహార నరసింహ - దురితదూర! 100
వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్ | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in