telugudanam.co.in

      telugudanam.co.in

   

సామెతల భావాలు (కొన్ని)

దొంగలు పడ్డ ఆర్నెల్లకు కుక్కలు మొరిగినట్లు

చాలా ప్రచారంలో ఉన్న సామెతలలో ఇదొకటి. దొంగతనాలే కాదు, ఏదైనా పనుల విషయంలో సకాలంలో చర్య తీసుకోకపోతే ఆ సందర్భంలో ఈ సామెత వాడుతారు. దొంగను పట్టాలంటే, దొంగతనం జరిగిన తీరు, వెంటనే గమనిస్తే కొన్ని సాక్ష్యాధారాలు, ఆనవాళ్లు దొరుకుతాయి. కానీ దొంగతనం జరిగాక, తీరిగ్గా మర్నాడో, మూడోనాడో ఆ ప్రాంతాన్ని పోలీసులు వెళ్లి చూశారనుకోండి. ఏముంటుంది? కాబట్టి ఏ విషయంలోనయినా సకాలంలో చర్యల వల్ల ఫలితం ఉంటుంది. దొంగల భారి నుంచి తమనుతాము రక్షించుకోవడానికే ఇంటికి కాపాలాగా ఉంటాయని చాలామంది కుక్కల్ని పెంచుకుంటారు. వాటి ధర్మం దొంగ ఇంట్లోకి చొరబడగానే అరవటం, కరవటం. కానీ ఆ పని మానేసి, దొంగ దోచుకొని వెళ్లాక, నింపాదిగా అరిస్తే, దానివల్ల ఏం ప్రయోజనం? అదిగో, అటువంటి సందర్భాల గురించి చెప్పేదే ఈ సామెత. అంతేకాదు, ఏ చెడు ప్రయత్నాన్నైనా వెంటనే స్పందించి అడ్డుకోవడం అవసరమనే నీతి ఈ సామెతలో కనిపిస్తుంది.


మూలం - వార్త(చెలి) 6, ఏప్రిల్ 2006.


ధైర్యం లేని రాజు యోచన లేని మంత్రి

ప్రతి పదవికి ఓ అర్హత, ఓ యోగ్యత ఉండాలని చెబుతుందీ సామెత. నేడు, వీటిని గమనించకుండా ప్రజలు, పాలకులను కేవలం డబ్బును చూచి, కులాన్ని చూచి, ప్రచారార్భాటాలను చూచి ఎన్నుకుంటున్నారు. దాని ఫలితాన్ని కూడా వెంటనే అనుభవిస్తున్నారు. పాలకుల పాలనా సరళి ప్రజల బతుకుల్లో మార్పు తెస్తుందనే నీతి ఈ సామెతలో ఉంది.

పాలనావ్యవహారాల్లో, పాలకుడు పిరికివాడైతే తన పదవికి ఎప్పుడు ముప్పు ఉందో, అని భయపడితే అతను కఠిన నిర్ణయాలు తీసుకోలేడు. అతడు ప్రతి నిముషం తన పదవి గురించే ఆలోచిస్తాడు. అందుకు అవసరమైతే, దుర్మార్గుల్ని కూడా చేరదీసి తన పదవి కాపాడుకుంటాడు.

ఇక పాలనాయంత్రాంగంలో ప్రధాన సూత్రధారి మంత్రి. మంచి సలహాలతో రాజుకు పాలనలో సహకరిస్తాడు. పాలనారధం ప్రగతి పధంలో సాగటానికి, మంత్రి యోచన(ఉపాయం) చక్కగా పనిచేస్తుంది. భావి ప్రణాళికల్లో, మంత్రి యోచనలేనివాడైతే, కేవలం అధికారుల చెప్పుడు మాటలకు విలువ ఇచ్చి, సొంత ఆలోచన లేకుండా, రాజును సైతం పక్కదారులు పట్టించి, పాలనా వ్యవస్ధను చిన్నాభిన్నం చేస్తాడు. దానివల్ల ప్రజలు బాధలకు గురి కావలసివస్తుందనే చక్కని హితవు ఈ సామెతలో ఉంది.


మూలం - వార్త(చెలి) 20, ఏఫిల్ 2006.


దిగితేగాని లోతు తెలియదు

కొన్ని విషయాలు ఇతరులు చెప్పే దానికన్నా స్వయంగా తెలుసు కోవటమే మేలు. దానివల్ల పనిలో సాధక బాధకాలు తెలుస్తాయి. బావిని చూడగలం. కానీ, అందులో నీరు ఏమేరకుందో తెలుసుకోలేనట్లే, ప్రతి కొత్త అన్వేషణలో కూడ, స్వయంగా ముందడుగు వేయటమే మంచిది. అంతేగాని, ముందే ఆ పనిలో కష్టముందనో లేదా అసాధ్యమనో బెదిరిపోకూడదు. అందులోకి దిగితేనే కదా అనుభవం వచ్చేది. అప్పుడు అందులోని ఇబ్బందులు కూడా స్వయంగా తెలుస్తాయి. ఇవి నలుగురికీ ఉపయోగపడతాయి కూడా. అందువల్ల జాగ్రత్తగా ఆలోచించి నలుగురినీ విచారించి పనిలోకి దిగితేనే అందులోని విషయం తెలుస్తుందనేది ఈ సామెత అర్ధం. కాబట్టి సామెతలను ఉన్నదున్నట్లుగా అర్ధంచేసుకోకూడదు. పోలికలు చెప్పటమే కాదు, అంతరార్ధంలో ఉండటం సామెతల సహజ లక్షణమని గమనించండి.


మూలం - వార్త(చెలి) 8, జూన్ 2006.


నందంటే నంది, పందంటే పంది

స్వేచ్చగా పెరగటంతో పాటు క్రమశిక్షణ కూడా అవసరం. అందువల్ల ఆలోచనా రీతుల్లో స్పష్టత ఉంటుంది. అలాకాక క్రమశిక్షణ లేని స్వేచ్చవల్ల బానిసత్వం అబ్బుతుంది. అటువంటి హితవు ఈ సామెతలో ఉంది. కొందరు తమదంటూ సొంత వ్యక్తిత్వం లేకుండా ఎదుగుతారు. దీనివల్ల ఆత్మాభిమానం కొరవడుతుంది. అటువంటప్పుడు ఎదుటువాళ్లు చెప్పిన ప్రతిదానికి తల ఊపుతారు. వారేది చెప్తే దాన్ని ఆమోదిస్తారనే వ్యంగ్యం ఇందులో ఉంది. మరోవైపు మూర్ఖపు పట్టుదల గురించి కూడా ఈ సామెత వాడతారు. తాము నందంటే నందని, పందంటే పందని ఎదుటి వారు ఆమోదించాలనే నిరంకుశ విధానం కూడా లోకంలో ఉంటుందని ఈ సామెతలో మరో అర్ధం. చూశారా, సామెతలు రెండంచులు పదునుగా గల కత్తివంటివని గమనించారు కదూ. మొత్తం మీద సామెతలు ఎదుటి గుండెల్ని సూటిగా తాకేలా వాడవచ్చు. మెత్తని చురకలుగా ఉపయోగించవచ్చు.


మూలం - వార్త(చెలి) 18, మే 2006.


నాగలి మంచిది కాకపోతే ఎడ్లేమి చేస్తాయి?

నాగలి ఉంది సరే. వ్యవసాయం కొన్ని నెలలపాటు జరిగే కృషి కాబట్టి గ్రామాల్లో వ్యవసాయానికి, పశువుల సహకారం తప్పనిసరి. నాగలికైనా, గొర్రెకైనా, బండికైనా ఎద్దుల అవసరం ముఖ్యం.

వాటి పనితనం పైనే వ్యవసాయ అభివృద్ధి ఆధారపడి ఉంది. అయితే కేవలం అవి మాత్రమే ఏంచేస్తాయి? ఇక్కడ పనిముట్ల ప్రాధాన్యత, అంతర్లీనంగా యజమాని (దున్నేవాడు) ప్రావీణ్యత కూడా ముఖ్యమే. వాటిని ఏవిధంగా ఉపయోగించుకోవాలో తెలిసి ఉండాలి. మరోరకంగా కృషీవలుడు, వ్యవసాయ శాస్త్ర విషయాల్లో మెలకువగా ఉండటం అవసరమని సూచన. అప్పుడే చక్కని పనిముట్లతో, ఎద్దుల పనితనంతో ముందుకు వెళ్లి, వ్యవసాయంలో ప్రగతి సాధిస్తాడరని అర్ధం.


మూలం - వార్త(చెలి) 3, ఆగస్టు 2006.

[ వెనుకకు ] [ సామెతలు ]

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: