telugudanam.co.in

      telugudanam.co.in

   

రోట్లో తలపెట్టాక రోకలి పోటుకు వెరచినట్లు

ప్రమాదాలకు దూరంగా ఉండాలని చెబూతూనే ఆ ప్రమాదాన్ని ఎదుర్కోనడానికి కావలసిన మనోనిబ్బరాన్ని కలిగి ఉండాలని చేప్పే సామెత ఇది. రోలు, రోకలి అంటే పిండి, పచ్చళ్ళు దంచుతారు కదా అవి. రో్ట్లో తల పెడితే రోకలితో దంచినప్పుడు తల పగిలిపోతుంది కదా! ఆ ఆలోచన, విజ్ణత ఎప్పుడు ఉండాలి? ముందు తెలివి లేకుండా రోటిలో తల పెట్టేసి అప్పుడు తల మీద రోకలి పోటు పడుతుందేమోనని భయపడితే ప్రయోజనం లేదు అని చెప్పడమన్నమాట. అంటే ప్రమాదం జరిగే అవకాశమున్నప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి చేయాలని భావం.


తాచెడ్డ కోతి వనమెల్ల చెరచినట్లు

కోతి ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తుంటుంది. ఎప్పుడేం చేస్తుందో ఊహించడం కష్టం. ఇతర జంతువులు, పక్షులు... అన్నీ ఏదో ఒక పద్ధతిలో నడుచుకుంటాయి కాని కోతికి అలాంటిదేమీ ఉండదు. చక్కగా పూలు పూసి, కాయలు కాసి ఉన్న మంచి తోటలోకి ఒక కోతి వచ్చిందనుకోండి, ఇంకేముంది! పూలను మొక్కలను పెరికి కుప్పలు పోస్తాయి, కాయలను కోసి కొరికి నచ్చితే తిని నచ్చకుంటే పారేసి... ఇలా నానా గందరగోళం చేస్తాయి. మిగతా ఏ జంతువైనా తన ఆకలి తీర్చుకుని బయటకు వచ్చేస్తుంది కాని కోతి మాత్రం వనాన్నంతటినీ నాశనం చేస్తుంది. ఇలాంటప్పుడు స్వతహాగా చెడ్డదైన కోతి వనాన్ని కూడా చెడగొట్టిందన్న మాట వాడుకలోకి వచ్చిన నానుడి అయింది. ఎక్కువ అల్లరి చేసే పిల్లలు ఒద్దికగా ఉండే పిల్లలను కూడా తమతో తీసుకెళ్ళి అందరూ అల్లరి చేస్తుంటే వాళ్ళను కోతితో పోల్చి చెప్పడానికి ఈ సామెత వాడుతారు.


మూలం : 22-Oct-08, బుధవారం, సాక్షి (ఫ్యామిలీ).


కరువులో అధికమాసం

పూర్వం వాతావరణం మీద పూర్తిగా ఆధారపడి జీవిస్తున్న రోజులలో వాడుకలోకి వచ్చిన నానుడి ఇది. ఎండలు తగ్గి వర్షాలు కురిస్తే నారు పోసి పంటలు వేసుకునేవాళ్ళు. ఒక్కొక్క ఏడాది సమయానికి కాదు కదా అసలే వర్షాలు కురిసేవి కాదు. కరువు అంటే అదే. ఇక అధికమాసం అంటే... మనకు చాంద్రమానం ప్రకారం మాసాలు లెక్కవేసేవాళ్ళు. అలా మూడేళ్ళకు ఒకసారి అధికమాసం వచ్చేది. అధికమాసంలో ప్రత్యేకమైన పూజాదికాలు, వ్రతాలు, నోములు ఆచరించరు. ఆ మాసంలో పూజాదికాల మీద ఆధారపడి జీవించేవారికి పనులు ఉండేవి కాదు. అలాంటప్పుడు వీరికి పంటలు బాగా పండి ధాన్యం ఎక్కువగా ఉన్న వాళ్ళు సహాయం చేసేవాళ్లు. అలా అధికమాసం వచ్చిన ఏడాదే కరవు కూడా వచ్చిందనుకోండి. అప్పుడు ఎవరి దగ్గరా పుష్కలంగా ధాన్యం ఉండదు, ఇక మరొకరికి సహాయంచేయడం కుదిరే పనికాదు కదా! ఇప్పటి పరిస్థితుల్లో దీనిని అన్వయించే సందర్భాలు ఎలా ఉంటాయంటే... ఎగ్జామ్స్‌ దగ్గరపడుతున్నాయి, సిలబస్‌ పూర్తి కాలేదు, ఎంత రాత్రయినా సరే అన్ని పాఠాలనూ చదువుకున్న తర్వాతే పడుకోవాలని కూచున్నప్పుడు కరెంట్‌ పోయిందనుకోండి అలాంటిదన్నమాట.


మూలం: 12-Feb-09, గురువారం, సాక్షి (ఫ్యామిలీ).


చీమలు పెట్టిన పుట్టలు పాములకు నెలవైనట్లు

చీమలు ఎంత చిన్నప్రాణులో తెలుసు కదా! అవి పగలనక, రాత్రనక శ్రమించి మట్టిని తీసుకొచ్చి పుట్ట పెట్టుకుంటాయి. ఈ మట్టిలో నిశ్చింతగా జీవించాలని వాటి ఆశ. కాని పుట్ట పూర్తయ్యే సరికి పాములు వచ్చి అందులో చేరతాయి. పుట్టను తమ నివాసంగా మార్చుకుంటాయి. శ్రమించే తత్వమున్న బలహీనమైన చిన్న ప్రాణులు కష్టపడి నిర్మించుకున్న నివాసాన్ని, ఏ మాత్రం కష్టపడకుండా కండబలం ఉన్న ప్రాణులు ఆక్రమించుకోవడానికి నిలువెత్తు నిదర్శనం ఇది. దురాక్రమణను తెలియచేసే ఉద్దేశ్యంతో చెప్పిన నీతిపద్యంలోని వాక్యం ఇది. చిన్న పిల్లలను అమాయకులను చేసి మోసం చేయడం, పుష్టిగా ఉండే పిల్లలు బలహీనమైన పిల్లలను కొట్టి వాళ్ళ దగ్గరున్న వాటిని లాక్కోవడం వంటివి చెడ్డపనులు అని దీని అర్ధం.


మూలం: 14-Mar-09, శనివారం, సాక్షి (ఫ్యామిలీ).


అమ్మబోతే అడవి, కొనబోతే కొరివి

పూర్వం అడవికెళ్లి అక్కడ దొరికే కాయలు, దుంపలు...ఇలా కావలసినవన్నీ తెచ్చుకునేవారు. ఎవరైనా ఎక్కువుగా తెచ్చి మరొకరికి అమ్మాలంటే ధర పలికేదికాదు. ఎందుకంటే అందరూ అడవికెళ్లి తెచ్చుకునేవాళ్లు. కొరివి అంటే కాలుతున్న కట్టె. దానిని తాకితే చెయ్యి కాలుతుంది కదా?


[ వెనుకకు ] [ సామెతలు ]

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: