telugudanam.co.in

      telugudanam.co.in

   

పసిబిడ్డ - పాలకుండ క్షణం తీరికనివ్వవు

పసిబిడ్డను పెంచుతుంటే రోజు మొత్తం లో ఒక్క క్షణం కూడ ఖాళీ దొరకదని చెప్పడానికి ఈ సామెత వాడతారు. పాపాయి మెలకువగా ఉన్నప్పుడు పాలు పట్టడం, స్నానం చేయించడం, దుస్తులు మార్చడం, బట్టలు తడుపుతున్నప్పుడు శుభ్రం చేయడం వంటి పనులతో తల్లి పసిబిడ్డ పర్యవేక్షణ లోనే ఉండాలి. ఇక నిద్రపోయేటప్పుడు కూడా పాపాయి లేచేలోపు మరికొన్ని పనులు చేసుకోవాలి. అలాగే రాత్రి మనం నిద్రపోయే సమయం లో పిల్లలు ఆడుకోవాలనుకుంటారు. అప్పుడు నిద్ర లేచి వాళ్లను చూసుకోవాల్సిందే. పాలకుండ అంటే తెలుసుకదా? పాలను బాగా మరిగేదాకా కాచి, వేడి తగ్గి గోరువెచ్చగా ఉన్నప్పుడు తోడుపెట్టి, మర్నాడు ఆ పెరుగును చిలికి, వెన్నతీసి, ఆ వెన్నను కాచి నెయ్యి చేసి... ఇన్ని పనులుంటాయన్న మాట. దాదాపుగా రోజులో ఎక్కువ సమయం ఈ పనులకే సరిపోతుంది. అందుకే ' పసిబిడ్డ - పాలకుండ క్షణం తీరికనివ్వవు ' అని రెండింటికీ పోలిక చెబుతారు.


అన్నీ భగవంతుడిపైనే ఆధారపడ్డాయన్నట్లు ప్రార్ధించు! అన్నీ నీపైనె ఆధారపడ్డాయన్నట్లు శ్రమించు!!

ఎంత సమర్ధత ఉన్నప్పటికీ అది మితిమీరిన ఆత్మవిశ్వాసం కాకూడదని చెప్పడం ఈ సూక్తి ఉద్దేశం. ఒక పని పూర్తి కావాలంటే అందుకు తగినంత శ్రమ అవసరం. అయితే కొన్నింటిని ఒక్కరే చేయవచ్చు. కొన్నింటికి ఎక్కువ మంది సమిష్టిగా కృషి చేయాలి. కొన్నింటికి దశల వారీగా బాద్యతలు పంచుకొని పూర్తి చేయాల్సి ఉంటుంది. అలాంటప్పుడు తనకున్న బాధ్యత కొంత మాత్రమే కాబట్టి ఫలితంతో తనకు సంబంధం లేదని తప్పించుకోకుండా అంతా తనమీదే ఉందన్నట్లు బాధ్యతగా శ్రమించాలి. అలాగని తానెంతో సమర్ధుడునని, అంతగా శ్రమించాను కాబట్టి ఫలితాన్ని నిర్దేశించగలిగింది నేనొక్కడినే అన్నట్లు వ్యవహరించకూడదు. ఫలితాన్ని నిర్ణయించేది సర్వాంతర్యామి అయిన భగవంతుడు మాత్రమేనన్న భావనను పెంపొందించుకోవాలి అని అర్ధం. ఇస్రో చైర్మన్‌ మాధవన్‌ నాయర్‌ రాకెట్‌ ప్రయోగించే ముందు భగవంతుని ప్రార్ధించి తన శ్రమకు సానుకూలమైన ఫలితాన్నివ్వమని కోరినట్లు అన్నమాట.


మొదలేదో, చివరేదో తెలియకపోతే ఎట్లా?

కొందరు ఏదైనా విషయాన్ని వేరొకరికి చెప్పాల్సి వచినప్పుడు మొదలుపెట్టి మధ్యలో ఆపేసి, లేదా సగం సగం చెప్పి వదిలేస్తుంటారు. ఏదీ పూర్తిగా చెప్పరు. తర్వాత మనం ఎంత ప్రయత్నించినా ఆ విషయం ఏమిటనే దాని మీద మనకు అవగాహన కలగదు. మరికొందరు ఏం జరిగిందో ముందు చెప్పకుండా, ' ఇలా అయ్యింది, అలా అయ్యింది ' అంటారు. అసలేం జరిగిందో చెప్పమంటే మధ్యలోనే వదిలేస్తుంటారు. ఎవరు ఏం చెప్పినా మొదటి నుండి చివరివరకు చెబితేగాని ఆ విషయం గురించి మనకు పూర్తిగా అర్ధం కాదు. అలా ఎవరైనా తుది, నొదలు లేకుండా చెబుతూండేలాంటి సందర్భాల లో ఈ నానుడిని వాడతారు.


అందరి సంతోషం లో నీ సంతొషాన్ని వెతుక్కో

కొందరిలో తమ సంతోషం కొసం ఎదుటివారిని ఇబ్బంది పెట్టడానికి కూడా వెనుకాడని మనస్తత్వం ఉంటుంది. అలా చేయడం ముమ్మాటికీ తప్పే. ఎదుటి వాళ్లను సంతోషపెట్టి ఆనందించడం అలవాటు చేసుకుంటే జీవితం లో బాధ అనేదే ఉండదని ఈ సూక్తి భావం. మనకు నచ్చిన దానిని సొంతం చేసుకోవడం లో ఆనందం ఉంటుంది. నిజమే అయితే ఆ వస్తువుతో అవసరం ఉన్నవాళ్లకు దానిని ఇవ్వడం వల్ల మనకు రెండింతలు ఆనందం కలుగుతుంది. తీసుకోవడం లో ఉండే సంతోషం కంటే ఇవ్వడం లో రెట్టింపు సంతోషాన్ని పొందవచ్చు. మనుషులు స్వార్ధపూరితంగా ఉండకుండా త్యాగం, దయ వంటి లక్షణాలను అలవరచుకోవాలని చెప్పడానికి ఈ మాట చెప్పారు.


అడ్డాల నాడు బిడ్డలు కాని గడ్డాల నాడు బిడ్డలా?

అడ్డాల నాడు - అంటే పసిబిడ్డగా ఉన్నప్పుడు పొత్తిళ్లలో అడ్డంగా ఎత్తుకుంటారు చూడండి! అప్పుడు. గడ్డలనాడు - అంటే పెద్దయ్యి గడ్డాలు, మీసాలు వచ్చే వయస్సు అని అర్ధం. పిల్లలు పెద్దయ్యే కొద్దీ తమకు దురమవుతున్నారన్న బెంగతో అమ్మానాన్నలు చెప్పే సామెత ఇది. మ్మిమ్మల్నే ఉదాహరణగా తీసుకోండి. మరీ చిన్నగా ఉన్నప్పుడు అన్నం తినిపించడం నుంచి ముతి తుడవడం ్వరకు ప్రతిపనినీ అమ్మే చేయాలి. చేతిని పట్టుకుని అక్షరాలు దిద్దిస్తే తప్ప రాయలేకపోయేవాళ్లు కదా! ఇప్పుడు కొన్ని పనులు మీకు మీరే సొంతంగా చేసుకుంటున్నారు, చదువుతున్నారు, రాస్తున్నారు. ఇవన్నీ అమ్మానాన్నలకు ఆనందాన్నిచ్చేవే అయినా ఇంకా పెద్దయ్యే కొద్దీ రెక్కలు వచ్చిన పక్షిలా ఎగిరిపోతారేమోనని వాళ్ల భయం. అది నిజం కూడా అనుకోండి. అలా దూరమైనప్పుడు ఈ సామెతను గుర్తు చేసుకొని ఇది లోకసహజం అని సర్ధిచెప్పుకుంటారు.


[ వెనుకకు ] [ సామెతలు ]

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: