telugudanam.co.in

      telugudanam.co.in

   

వెంటరావద్దంటే ఎత్తుకోమని ఏడ్చాడట

పెద్దవాళ్లు ఎక్కడికైనా వెళ్తున్నట్లు తెలిస్తే చాలు పిల్లలు ' నేనూ నీతో వస్తా ' అంటూ వెంటపడతారు. పిల్లల్ని వెంట తీసుకువెళ్లడం సాధ్యం కానప్పుడు వద్దని వారిస్తుంటారు పెద్దవాళ్లు. అలాగే " నాకు పని ఉంది, చాలా దూరం వెళ్లాలి, నువ్వు అంత దూరం నడవలేవు " అని నచ్చచెప్పినప్పుడు ఆ పిల్లాడు నేను నడవలేనంత దూరం వెళ్తుంటే ఎత్తుకొని తీసుకువెళ్లమన్నాట్ట. పక్కన నడిపించుకుని వెళ్లడానికే సాధ్యం కానప్పుడు ఎత్తుకొని వెళ్లడం కుదురుతుందా? మీకు జలుబు చేసినప్పుడు " చాక్లెట్‌ వద్దుకాని ఐస్‌క్రీమ్‌ తింటాను " అంటే ఎలా ఉంటుంది? ఇదీ అలాగన్నమాట.


అంతా మన మంచికే

ఎప్పుడు ఏది జరిగినా అది మన మంచికే అనుకోవడం లో హాయి ఉంటుంది. మనిషిలో సానుకూల దృక్పదం అలవాటు అవుతుంది. ఒకసారి ఓ రాజుతో మంత్రి ' ఏది జరిగినా మన మంచికే ' అన్నాడు. అలా అన్నందుకు రాజుకు కోపం వచ్చి మంత్రిగారి వేలు తీయించేశాడు. ' ఇప్పుడు కూడా అంతా మన మంచికేనా?' అని రాజు అడిగిన ప్రశ్నకి మంత్రి ' అవున ' ని అన్నాడు. కోపంతో రాజు మంత్రిని అడవిలో వదిలేసి వెళ్లిపోయాడు. అడవిమనుషుల నరబలి కోసమని వెతుకుతూ మంత్రి కనపడగానే ఆయనని బలి ఇవ్వడానికి తీసుకువెళ్లారు. తీరా చూస్తే ఆయన చేతికి నాలుగు వేళ్లే ఉన్నాయి. అందుకని బలికి పనికిరాడని విడిచిపెట్టేశారు. కాబట్టి అంతా మన మంచికే అని మంత్రి అను కున్న మాట ఎంత కరెక్టో అర్ధం అయ్యిందా పిల్లలూ. అందుకే ఎప్పుడయినా ఏది జరిగినా అది ' అంతా మన మంచికే ' అనుకోవడం అలవాటు చేసుకోండి.


పుర్రెకో బుద్ధి జిహ్వకో రుచి

పుర్రె అనే మాటను మెదడు అనే అర్ధం లో వాడారు. జిహ్వ అంటే నాలుక. ఏ ఇద్దరి ఆలోచన ఒక తీరుగా ఉండదు. అంటే ఏ రెండు మెదళ్లూ ఒకరకంగా అలోచించవు, ఒక విషయానికి ఒకేరకంగా స్పందించవన్నమాట. అలాగే ఏఇద్దరికి ఒక రుచి నచ్చదు, ఇంట్లో నలుగురు ఉంటే ఒక్కొక్కరు ఒక్కో రుచిని ఇష్టపడతారు. ఒకరు తీపి, ఒకరు పులుపు, మరొకరు కారం... అలాగే అమ్మకు గులాబీరంగు ఇష్టమైతే, నాన్నకు నీలం రంగు ఇష్టం, పాపాయికేమో ఎరుపంటే తగని మురిపెం. ఇలా రుచుల్లోనూ, అభిరుచుల్లోనూ ఒకరిని పోలి మరొకరు ఉండరు. ప్రతి ఒక్కరికీ తమకంటూ ఒక టేస్ట్‌ ఉంటుంది అని చెప్పడానికి వాడుకలోకి వచ్చిన నానుడి ఇది. ఏ రెండు నాలుకలు ఒక రుచిని ఇష్టపడవన్న సంగతి అనుక్షణం నిరూపణ అవుతూనే ఉంటుంది కాని రెండు మెదళ్లు ఒక విధంగా ఆలోచించవన్న విషయం సందర్భానుసారంగా నిరూపణ అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఈ మాటను వాడతారు.


కొంత తెలుసుకోవడం తేలికే...అంతా తెలుసుకోవడమే కష్టం

కొంతమంది అనర్గళంగా మాట్లాడుతుంటారు. వీళ్లకు తెలియని సంగతి లేదేమోనన్నట్లు. కాని పూర్తి వివరాలను చెప్పలేరు. ఇలాంటి సందర్భాలను ఉద్దేశించి చెప్పిన మాట ఇది. ఎన్నో విషయాలను పైపైన తెలుసుకుని నాకు అన్నీ తెలుసు అనుకోవడం కంటే, ఒకటి - రెండు సంగతులైనా సరే సమగ్రంగా తెలుసుకోవాలి. ఇందుకు చిన్న కధ ఉంది. అడవిలో ఒక బాతు - గుర్రం మధ్య వివాదం వచ్చి " నేను నీటిలో ఈదుతాను, భూమ్మీద నడుస్తాను, పరిగెత్తుతాను. నీటిలోని చేపలను, నేలమీద గింజలను తినగలను. కాబట్టి నాకు సమస్య రాదు. నీకు పరిగెత్తడం తప్ప మరేమి రాదు" అని బాతు గుర్రాన్ని వెక్కిరించిందట. ఒక రోజు ఇవి ఉన్న చోటికి నీటి కోసం ఏనుగుల మంద రావడంతో వాటినుండి తప్పించుకోవడానికి గుర్రం పరుగెత్తి ప్రాణాలు కాపాడుకుంది. బాతు కొలనులోనే ఉంటే ఏనుగులు తొండంతో ఎత్తి పడేస్తాయి. వేగంగా పరిగెత్తలేదు. ప్రాణాలు దక్కించుకోవడానికి పరుగెత్తబోయి ఏనుగుల కాళ్ల కింద పడి నలిగిపోయిందట. అందుకే నేర్చుకునే పని ఒక్కటైనా సరే పూర్తిగా నేర్చుకోవాలి. దానిలో నైపుణ్యం సంపాదించాలి అంటారు.


[ వెనుకకు ] [ సామెతలు ]

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: