telugudanam.co.in

      telugudanam.co.in

   

పడ్డవాడెప్పుడు చెడ్డవాడుకాదు

జీవితం లో మనకు ఓర్పు ఎంత అవసరమో చెప్పేందుకు వాడే నానుడి ఇది. క్లాసులో ఒకరు అల్లరి చేస్తే టీచర్‌ పొరపాటున మరొకరిని మందలిస్తారు. అప్పుడు వెంటనే కోపం తెచ్చుకోకుండా ఓర్పుతో భరించి, టీచర్‌ కోపం తగ్గాక అసలు విషయం మెల్లగా చెప్పాలి. అప్పుడు టీచర్‌ అనవసరంగా తిట్టాననే విషయం గ్రహిస్తారు. తనవల్ల అనవసరంగా మాటలు పడ్డాడనే ఉద్దేశంతో సానుభూతి, ఆ విద్యార్ధిపై మంచి అభిప్రాయం కలుగుతుంది. అలా కాకుండా తనది కాని తప్పుకు తనను తిడుతున్నారని ఆవేశపడి మనం కూడా వెంటనే కోపం తెచ్చుకుంటే! ఆ తర్వాత అసలు విషయం తెలిసినా కూడా టీచర్‌లో మంచి అభిప్రాయం కలగదు.


పచ్చకామెర్ల రోగికి లోకమంతా పచ్చగా కనిపించినట్లు

పచ్చకామెర్ల వ్యాధి వచ్చిన వాళ్లకు కళ్లు పచ్చగా మారతాయి. అప్పుడు దేనిని చూసినా కొద్దిగా పసుపురంగు కలిసినట్లే కనిపిస్తుందంటారు. లోకమంతా పచ్చగా కనిపించడమంటే అర్ధం అదే. నిజంగా లోకం పసుపుగా మారిందనికాదు. వక్రబుద్ధి కలిగిన వాళ్లు ప్రతి ఒక్కరినీ అదే కోణం లో చూస్తారట. వాళ్లు ఏ విధంగా ఎదుటివాళ్లను అనుమానిస్తారో? బాగా తెలుసుకాబట్టి ఎదుటివాళ్లు ఏది మాట్లాడినా అందులో తప్పులనే వెదుకుతారు. అలాంటి బుద్ధి ఉన్నవాళ్లను ఈ సామెతతో పోలుస్తారు. పిల్లలంతా ఒకచోట చేరి అందరి బొమ్మలను చేర్చి ఆడుకుంటున్నారు. వాళ్లలో ఎవరికైనా ఒక పిల్లవాడికి మరొకరి బొమ్మలను తస్కరించే అలవాటుందనుకోండి! వాళ్లు మాత్రం తన బొమ్మను ఎవరైనా తస్కరిస్తారేమోనని జట్టులో ఉన్న అందరినీ అనుమానిస్తూనే ఉంటారు, అలాంటి సందర్భమన్నమాట.


అభ్యాసం ప్రారంభిస్తే అజ్ఞానం తెలుస్తుంది

అభ్యసించడం అంటే ఒక విషయాన్ని సమగ్రంగా తెలుసుకోవడం. అలా దేనినైనా తెలుసుకోవడం మొదలు పెట్టిన తర్వాత మాత్రమే అప్పటి వరకు మనకు ఏది తెలియదోనన్న సంగతైనా తెలుస్తుంది. అభ్యసించే ప్రయత్నమే చేయకుంటే మనకు ఏవిషయం తెలియదో కూడా తెలియని అజ్ఞానం లోనే ఉంటాం. 'నాకు అన్నీ తెలుసు ' అనుకునే ముందు, ' ఇక నేను తెలుసుకోవలసింది ఏదీ లేదు ' అనుకునే ముందు చుట్టూ కలయ చూసి కళ్లకు కనిపించిన వాటిని ఆలోచించాలి. ఆ వస్తువులను దేనితో తయారుచేశారు? ఎలా చేశారు? అని ప్రశ్నించుకుని జవాబులు రాబట్టుకుంటే మనలో ఉన్న విజ్ఞానం ఎంతో తెలుస్తుంది. అలాగే మనం తెలుసుకోవలసినవి కళ్ల ముందే ఎన్ని ఉన్నాయో కూడా తెలుస్తుంది.


[ వెనుకకు ] [ సామెతలు ]

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: