telugudanam.co.in

      telugudanam.co.in

   

అవసరానికి మించి ఒక్కమాట కూడా అదనంగా మాట్లాడకండి

మాట వెండి మౌనం బంగారమ' అనే నానుడిని పోలిన సూక్తి ఇది. అవసరమైనప్పుడు మాట్లాడకపోవడం ఎంత నష్టాన్ని కలిగిస్తుందో, అనవసరంగా మాట్లాడడం కూడా అంతే నష్టాన్ని కలిగిస్తుంది. అందుకే అవసరాన్ని మించి మాట్లాడకూడదంటారు. మీరు కొత్త స్కూల్లో చేరాలని వెళ్లారనుకోండి. అక్కడ ప్రిన్సిపల్‌ కానిం అరెవరైనా 'గడిచిన అకడమిక్‌ ఇయర్‌లో ఎంత పర్సెంట్‌ వచ్చింది?' అని అడిగితే అంత వరకు బదులిస్తే గుడ్‌ స్టూడెంట్‌ అనుకుంటారు. మీ క్లాస్‌మెట్స్‌లో మీకంటే తక్కువ మార్కులు వచ్చిన వాళ్ల పేర్లన్నీ వల్లించారనుకోండి! ఏమవుతుంది? మిమ్మల్ని ఎక్కువగా చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్లు భావించే ప్రమాదం ఉంటుంది. అందుకే తగు మేరకు మాట్లాడాలి.


ఉత్సాహం క్రియాశీలతను వెయ్యి రెట్లు పెంచుతుంది

ఉత్సాహంగా ఉంటే మనసు ఆనందంగా ఉంటుంది, మెదడు చురుగ్గా పనిచేస్తుంది. దాంతో పని సామర్ధ్యం పెరుగుతుంది. అదే నిరుత్సాహంగా ఉంటే చేస్తున్న పని మీద మనసు పూర్తిగా లగ్నం కాదు. అలాంటప్పుడు మెదడు చురుగ్గా, సమయానుకూలంగా స్పందించదు. దాంతో పనిలో నైపుణ్యం లోపిస్తుంది. మీరు ఆటలకు వెళ్లే ముందు అమ్మ... హోం వర్క్‌ పూర్తి చేసి పాఠాలను కంఠతాపట్టి వల్లించి వెళ్లాలని చెప్పిందనుకోండి! ఎంత త్వరగా నేర్చుకుంటే అంత ఎక్కువసేపు ఆడుకోవచ్చన్న ఉత్సాహంతో త్వరగా పూర్తి చేస్తారు. అలా కాకుండా ఆటలకు వెళ్లడానికి వీల్లేదు, కూర్చుని చదువుతూ ఉండాల్సిందే అంటే మీలో నిరుత్సాహం వచ్చేస్తుంది. ఇక... ఎంతసేపు చదివినా పూర్తి కాదు, హోం వర్క్‌లో అక్షరాలను రాస్తున్నా కూడా దానిని మెదడు గ్రహించదు. ఎందుకంటే మనసు, మెదడు చురుగ్గా ఉండవు కాబట్టి. ఉత్సాహంతో పని చేస్తే పనిసామర్ధ్యం, నైపుణ్యం పెరుగుతుందంటే ఇదే.


అందరి పట్ల విధేయత కనబరచండి కాని మీ నమ్మకాలకు భిన్నంగా ప్రవర్తించకండి

ప్రతి ఒక్కరికీ పెద్దయ్యే కొద్దీ వ్యక్తిత్వం అభివృద్ధి చెంది కొన్ని నమ్మకాలు, అభిప్రాయాలు స్ధిరపడతాయి. అయితే పరిస్ధితులన్నీ వాటికి అనుగుణంగా ఉండవు. ఒక్కక్కసారి మన అభిప్రాయాలకు పూర్తి వ్యతిరేకమైన అభిప్రాయాలు కలిగిన వారు ఎదురవుతారు. వారితో కలిసి కాని వారి ఆధీనంలో కాని పని చేయాల్సి ఉంటుంది. అలాంటప్పుడు మీ అభిప్రాయాలకు భిన్నంగా ఉన్నాయి కాబట్టి వారి నమ్మకాలను వ్యతిరేకించకూడదు. వారిని, వారి భావాలను కూడా గౌరవించాల్సిందే. అలాగని మీ భావాలను మార్చుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. మీ నమ్మకాలకు అనుగుణంగా నడుచుకుంటూనే ఎదుటివారి నమ్మకాలనూ గౌరవించడన్లోనే నిజమైన వ్యక్తిత్వ వికాసం ఉంటుంది.


లోగుట్టు పెరుమాళ్లకెరుక

తమిళంలో దేవుడిని పెరుమాళ్లు అంటారు. లోగుట్టు అంటే లోపలి రహస్యం. ఎరుక అంటే తెలియడం. ఏదైనా సంఘటన జరిగినప్పుడు బయటకు కనిపిస్తున్న ఆధారాలను బట్టి చూస్తే పొంతన కుదరదు. 'మరేదో జరిగింది' అనిపిస్తుంది. అలాంటప్పుడు వాడే సామెత ఇది. 'ఏం జరిగిందో దేవుడికే తెలియాలి' అన్నట్లన్న మాట. మీరు ఫ్రెండ్స్‌తో ఒక రూమ్‌లో ఆడుకుంటుంటారు. మధ్యలో అమ్మ పిలిస్తే వెళ్లి పాలు తాగి వచ్చేటప్పటికి మీ బొమ్మను వాళ్లు విరగ్గొట్టారనుకోండి. ఎవరు చేశారు? అని అడిగితే అందరూ నేను కాదు అంటే, ఎవరు విరగ్గొట్టారో తెలియదు కదా! ఉన్న వాళ్లు తాము కాదంటున్నారు. బయటకు వచ్చి తిరిగి రూంలోకెళ్లేసరికి జరిగిపోయింది. లోపల ఏం జరిగిందో ఆ దేవుడికే తెలియాలి, అని మనకు తెలియని విషయం పట్ల నిస్సహాయతను వ్యక్తం చేయక తప్పని సంధర్భం అన్నమాట. అలాంటి సంధర్భంలో వాడుకలోకి వచ్చిన సామెత ఇది.


[ వెనుకకు ] [ సామెతలు ]

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: