www.telugudanam.co.in         చీరాల

తెలుగు పాఠాలు

చిన్నపిల్లల కోసం

మాగురించి

పత్రికలలో తెలుగుదనం

               మా అనుబంధ వెబ్‌సైట్..

సంస్కృతి, సంప్రదాయాలు

వనితల కోసం

సైట్‌మ్యాప్

తెలుగుదనం బ్లాగు

సాహిత్యం

అందరికోసం

సలహాలు

మా గీతా.కో.ఇన్

మన సంగీత

"శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం పణి:" అని ఆర్యోక్తి. అనగా గాన రసాన్ని శిశువులు పశువులతో పాటు పాములు కూడా విని ఆనందిస్తాయని అర్థం.

మన పురాణ కాలంలో శ్రీ కృష్ణుడు అద్భుతంగా వేణునాదం ఆలపించేవాడని దానికి గోవులు, గోపికలు, మునులు సైతం తాదాత్మ్యం పొదేవారిని చెబుతారు.అంతే కాదు నారద తుంబురులు, హనుమంతుడు గొప్ప నాదోపాసకులుగా కీర్తి పొందారు. రాజస్థాన్ ఎడారి మరు భూమిలో మిరాబాయి కృష్ణ భక్తి గాగాన ప్రవాహాన్ని ప్రవహింప చేశారు.ఆమె గానాన్ని అక్బర్ చక్రవర్తి సైతం మారువేషంలో వచ్చి వినేవాడని చెబుతూ ఉంటారు. నాదబ్రహ్మను ఉపాసించి ఇహపరాలను సాధించిన మహానీయులు ఎంతో మంది ఉన్నారు. సంగీతం వల్ల వ్యాధులు త్వరగా నయమవుతాయని, పశువులు పాలు ఎక్కువుగా ఇవ్వగల్గుతాయని, పంటలు ఎక్కువుగా పండుతాయని ఆధునిక పరిశోధకుల భావన.

మిగతా లలిత కళలవలే మన సంగీతాన్ని కూడా మార్గి, దేశి అని రెండు రకాలుగా వర్గీకరిస్తారు.మన దేశ సంప్రదాయ(మార్గి) సంగీతంలో హిందుస్థానీ,కర్ణాటక సంగీతాలని రెండు ప్రధానస్రవంతులున్నాయి.ప్రాచీన సంగీత శాస్త్రాలే వీటి పుట్టుకకు ఆధారం. ఈ రెంటి తోడు జానపదులను అలరించే సంగీత సాహిత్యాలు ఎప్పుడూ ఉన్నవే.

ప్రాచీన సంగీత శాస్త్రాలుగా భావించే భరతుని నాట్య శాస్త్రం, సంగీత మార్గదమ్, రాగ సారంగిణీ వంటి గ్రంథాలలో 'ధ్రువద్ ' అనే ఒక సంగీత కళా రీతిని చెప్పారు. దీనిని దేవుని అర్చనా కార్యక్రమాలలోనూ, యజ్ఞాల నిర్వహణలోనూ వినియోగించుకునేవారు. ఈ ధ్రువద్‌లో కూడా అనేక రీతులున్నట్లు తత్కోవిధులు పేర్కొంటారు. హరిదాసు, త్యాగరాజు వంటి కళాతపస్వులు 'నిధి చాలా సుఖమా? రాముని సన్నిధి సుఖమా?'అంటూ సంగీతాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకుపోయారు. రాగ సృష్టి సంగీత ప్రపంచానికి భారతదేశం అందించిన గోప్ప కానుకగా భావిస్తారు. రాగాలకు సంబంధించిన మూల భావాలు సామవేదంలో ఉన్నట్లు సంగీతకోవిదులు చెబుతారు. మన సంప్రదాయ సంగీతములోని రెండు స్రవంతులకు కూడా రాగమే అధారం. రాగమేళకర్త ప్రణాళికననుసరించి రాగాలను 12 రాశులు లేదా సముహాలుగా వర్గీకరిస్తారు. ఒక్కొక్క సమూహాంలో ఆరు రాగాలు వరకు ఉంటాయి. వానిని జనక రాగాలు అంటారు. అనేక జన్యరాగాలకు ఆధారం జనకరాగాలే.ఈ రాగాలకు రూప కల్పన చేసిన వారు వేంకటమహి. హిందుస్థానీ సంగీతంలో కూడ ఈ 72 రాగాలలో ఓ పదింటిని విస్తృతంగా వాడతారని పరిశీలకుల భావన. 72 రాగాలకు ధీర శంకరాభారణం, కీరవాణి, నట భైరవి, గౌరీ మనోహరి వంటి ప్రత్యకనామాలున్నాయి. హిందుస్తానీ, కర్ణాటక సంగీతాలు ఒకే సంప్రదాయం నుండి పుట్టినప్పటికీ వానిని ఆలపించడంలోను, సాధన చేయడంలోను ఎంతో వైరుధ్యం ఉంది. భాషాపరమైన ప్రాంతీయమైన, సాంకేతికమైన, సామాజిక రాజకీయ కారణాలు ఈ వైరుధ్యానికి హేతువులని అంటారు.

'స ' శడ్జమము, 'రి ' రిషభం, 'గ ' గాంధారం, 'మ ' మద్యమము, 'ప ' పంచమం, 'ద 'దైవదం, 'ని ' నిషధం, అని సప్తస్వరాల పేర్లు ఈ సప్త స్వరాలను అనేక రీతులు తప్పని మేళవించడం వల్ల రాగాలు ఏర్పడతాయి. అయితే ఒక రాగంలో సప్త స్వరాలు తప్పని సరిగా ఉందాలన్న నియమం లేదు.

సాధారణంగా ఒక రాగంలో కనీసం ఐదు స్వరాలు ఉండాలన్న ఒక నియమం ఉంది. కానీ బాలమురళీకృష్ణ గారు నాలుగు స్వరాలనే వినియోగించుకోని రాగాలను కూర్చారు.ఈ రాగాల కూర్పుతోనే భారతీయ సంగీతం, సంగీత ప్రపంచంలో తనదైన ప్రత్యకతను నిలుపుకోగల్గుతున్నదని అంటారు. స్వరాలకు ఆధారం శ్రుతుల. ,శ్రుతి అంటే ధ్వని విశేషం.ంగీతానికి పనికి వచ్చే శ్రుతులు 22. వీనికి సిద్ధ, ప్రభావతి, కాంత, సుప్రభ, శిఖ, దీప్తిమతి, ఉగ్ర, హలది, నివ్రి, ధీర, క్షాంతి, విభూతి, మాలని, చపల వంటి పేర్లున్నాయి. పాశ్ఛాత్య సంగీతంలో 12 శ్రుతులతో సంగీత ఉచ్చస్థితి (అష్టమ స్వరం)కి చేరుకోగా భారతీయ సంగీతంలో 22 శ్రుతులతో తారాస్థాయి చేరుకుంటుంది.

సంగీతంలో వినిపించే మరోధ్వని విశేషం తాళం. దీనినే లయ అని కూడా అంటారు. శ్రుతి లయలు సంగీత మాధుర్యానికి ఆధారాలు. అట్టి తాళంలో కూడా రకాలున్నాయి.  ఆది తాళం 8 మాత్రలతో కూడింది. చుతాళ లేక ఏక తాళం 12 మాత్రలతో కూడింది. జపతాళ 10 మాత్రలతో, రూపక్ తాళ 7 మాత్రలతోను, తీన్ తాళ 16 మాత్రలతో కూడినది. సంగీత ప్రపంచంలో వీణ, వేణువు, మృదంగం, హార్మోనియం, వయొలిన్ వంటి అనేక వాయిద్యాలకు సముచితమైన స్థానముంది. వాయిలెన్ పాశ్చాత్య జంత్రమే అయినప్పటికి భారతీయ సంగీత కచేరీలలో విస్తృతంగా వాడుతున్నారు.

సంగీతంపై భాషా పరమైన ప్రాంతీయపరమైన ప్రభావాలు అపారం. హిందుస్తానీ సంగీతంపై హిందీ సంస్కృత భాషా ప్రభావాలతో పాటు, పర్షయన్ భాషా ప్రభావం, ముస్లిం దండయాత్రలు, ముస్లిం పాలకుల చిత్త వృత్తులు, వారి రాజదర్బారు  ప్రభావం ఎక్కువ. కర్ణాటక సంగీతం పైన ద్రావిడ భాషలు, సంస్కృత భాషా ప్రభావాలతో పాటు భక్తి వేదాంతాల ప్రభావం ఎక్కువ.

ఖిల్జీ పాలనా కాలంలానే అమీర్ ఖుస్రో,  డి.గోపాలనాయక్ వంటి వారు ఆయన ఆశ్రయాన్ని పొంది  హిందుస్థానీ రాగాల కూర్పులో అనేక ప్రయోగాలు చేశారు. ఆ తర్వాత 'స్వామి హరిదాస్ ' హిందుస్తానీకి ఎంతో సేవ చేశారు. ఆయన శిష్యుడు తాన్‌సేన్ అక్బర్ చక్రవర్తి ఆస్థాన గాయకుడే గాక మియాన్‌కి లహర్, దర్బారీ, మియాకితోడి, వంటి రాగాలకు రూపకల్పన చేసి ధ్రుపద్ సంగీతరీతిని ఉన్నతోన్నత స్థానానికి తీసుకు వెళ్ళాడు. హిందుస్థానీ సంగీతం సమయ సిద్ధాంతంకై కూడ ఆధారపడింది అనేవారు కూడ లేకపోలేదు. ఉషోదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి సమయాల ఆలపించే రాగాలు అందులో ఉన్నాయి.

అమీర్ ఖుస్రో కవి పండితుడే గాక హిందుస్థానీ సంగీతంలో ఖయాల్ బాణిని ప్రవేశపెట్టినవాడు. అది ఊహాత్మక భావాలతో శ్రోతలను మరో ప్రపంచంలో విహరింప చేస్తుంది. పర్షియన్ భాషా ప్రభావంతో ఖుస్రో హిందుస్థానీలో ఖావాలీ అనే మరో రీతిని కూడా ప్రవేశపెట్టినవానిగా కీర్తి ప్రతిష్టలార్జించాడు. తదనంతరం కాలంలో బాలకృష్ణ బువా, రహమత్ ఖాన్, నట్టన్ ఖాన్, ఫయాజ్‌ఖాన్, భాస్కరబువా, కరింఖాన్ వంటి వారు 'ఖయాల్ ' గాన రీతిలో ఘ్రానా విద్వాంసులుగా, లబ్దప్రతిష్టులయ్యారు. 19వ శతాబ్దంలో హిందుస్థానీ సంప్రదాయంలోకి, 'ఘజల్ ' పద్దతిని మిర్జా గాలిబ్, ఆ తర్వాత విశ్వకవి రవీంద్రుడు హిందుస్థానీ, కర్ణాటక, పాశ్చాత్య సంగీత రీతులను మేళవించి తనదైన రీతిలో 'లిరిక్ ' గీతాలను అలపించాడు.హిందుస్థానీ సంగీతంలో స్వర మాధుర్యానికి ప్రాధాన్యముండగా కర్ణాటక సంగీతంలో వాయిద్యానికి సముచితమైన ప్రధాన్యమున్నదనే వారు కూడా ఉన్నారు.

జంత్ర సహాయంతో (తాంబూరా) కృతులు ఆలపించే సంప్రదాయాన్ని (కర్ణాటక సంగీతంలో) ప్రచారంలోకి తెచ్చిన వారు తాళ్ళపాక అన్నమాచార్యులు క్రీ.శ.1408- 1503 మధ్యకాలంలో జీవించిన అన్నమయ్య తిరుమల శ్రీ వెంకతేశ్వర స్వామి భక్తుడై తన పదహారవయేట ఆరంభించిన పద రచనలు (కీర్తనలు) 3200 సంకీర్తనలుగా రూపుద్దిద్దుకున్నాయి. కర్ణాటక సంగీతంలో పల్లవి, అను పల్లవి, చరణం అన్న పద్దతిని ప్రవేశ పెట్టిన మహానీయుడాయన. అప్పటి వరకు దక్షిణ దేవాలయాలలో ఉన్న 'తేవారం ' దివ్య ప్రబంధ పఠనం అనే స్తుతి రీతులకు ఇది భిన్నమైనదే గాక రాగయుక్తంగా, శాస్ర్తోక్తంగా, భక్తితో జన బాహుళ్యం పాడుకోగల రీతిలో ఆయన పదరచనలు కొనసాగాయి. లాలి పాటలు, చందమామపాటలు, మేలుకొలుపు పాటలు, దంపుళ్ళ పాటలు వంటివి ఆయన పదాలలో ప్రత్యేకతను నంతరించకున్నప్పటికీ వీటన్నింటిలోను వాత్సల్య భక్తితో పాటు భగవంతుని లీలలే వర్ణితములై సంగీత సాహిత్య పారమార్థిక భావనలు త్రివేణి సంగమంలా కలిసిపోయి అన్నమయ్య కీర్తనలు బహుళ ప్రచారం పొందాయి.

అన్నమయ్య తర్వాత కర్ణాటక సంగీతంలో సంకీర్తనా సంప్రదాయాన్ని విస్తృతంగా ప్రచారంలోకి తెచ్చినవాడు పురందరదాసు.

18,19 శతాబ్దాలు కర్ణాటక సంగీతానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చిన కాలంగా భావిస్తారు. అందుకు ప్రధానమైన కారణం దాక్షిణాత్య సంగీతానికి త్రిమూర్తులుగా భావించే శ్యామశాస్త్రి,  ముత్తుస్వామి దీక్షితార్, త్యాగరాజస్వామి ఈ కాలానికి చెందిన వారు కావడమే. ఈ ముగ్గురు కూడ తమ ఇష్ట దైవాలమీద సుమధురమైన భక్తి రసప్రధానమైన కృతులను ఆలపించడమే కాక తమ సర్వస్వం భగవదర్పితం చేసిన భక్తాగ్రేసరులు. శ్యామశాస్త్రుల కంచికామక్షీ, అమ్మవారి పైన త్యాగరాజు శ్రీరామ చంద్రునిపైన, ముత్తు స్వామి దీక్షితులు ఆయా క్షేత్ర దైవాల పాటు అంబ పైన కృతుల నెన్నింటినో వినిపించి కర్ణాటక సంగీతం పై చెరగని ముద్రవేశారు. వీరిలో శ్యామశాస్త్రి, త్యాగరాజుల జీవితాలు దాదాపు ఒకే రకంగా ఉండడమే కాదు వారి కీర్తనలు కూడా భక్తిరస ప్రవాహములు కాగా, ముత్తు స్వామి కృతులు లోత్తెన భావాలతో కూడినవే గాక మంత్ర రహాస్యాలతో కూడినవిగా పరిశీలకులు భావిస్తారు.

పై ముగ్గురి తర్వాత కర్ణాటక సంగీతానికి అపారమైన సేవ చేసిన వారు సుబ్బరామ దీక్షితులు. వీరు తమ జీవిత కాలంలో (1859- 1906) 'సంగీత సంప్రదాయ ప్రదర్శనమ్ ' అన్న గ్రంధాన్ని వెలుగులోకి తేవడమే కాక ఉత్తరాదివారి వలె కర్ణాటక సంగీతంలో కూడా గురు శిష్య సంప్రదాయాన్ని నెలకొల్పారు.

అమరమైన సంగీత కళామ తల్లికి సేవ చేసిన ఎందరో మహానుభావులకు వందనాలు తెలుపుకొంటూ, బ్రహ్మానంద సంధాయకరమైన సంగీతాన్ని సుసంపన్నం చేస్తూ, నేడు అందులో వస్తున్న విపరీతధోరణులను రూపుమాపటానికి తత్కోవిదులు పూనుకుంటారని కోరుకుందాం.

సంగీత మపి సాహిత్యం సరస్వత్వాకుచద్వయం-

ఏకమాపాత మధురం అన్యదాలోచనా మృతం.


వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 01-10-2008 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్  | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in