telugudanam.co.in

      telugudanam.co.in

   

పెన్నహోబిలం లక్ష్మి నరసింహస్వామి

ఆంధ్రరాష్ట్రములో గరుడాద్రి పర్వత ప్రాంతంలోని దట్టమైన అరణ్యప్రదేశం పవన నది ఒడ్డున చెంచుల కులంలో పుట్టింది ఒక అందాలరాశి. ఆమె సాక్షాత్తు లక్ష్మీదేవి అంశం అయినందున ఆమెను చెంచులక్ష్మి అని పిలిచేవారు.

అదే అడవిలో మరోవైపున హిరణ్యాక్షుని సంహరించడానికి నారాయణుడు నరసింహావతారం ఎత్తాడు. హిరణ్యకశివుడిని ద్వారంపై కూర్చుని తన ఒడిలో పెట్టుకుని తన పదునైన చేతిగోళ్లతో సణరించాడు నారాయణుడు. అయినా నరసింహస్వామి క్రోధావేశాలు తగ్గలేదు. ఆ అరణ్యంలో రౌద్రావతారంలో సంచరించేవాడు.

ఆ సమయం మహాలక్ష్మి అంశమైన చెంచులక్ష్మి ఆ చోటుకి వచ్చింది. ఆమెను చూసిన నరసింహస్వామి మైమరచిపోయాడు. తగ్గని క్రోధావేశాలు అదే క్షణంలో మాయమయ్యాయి. అడవిలో తిరిగే అటవికులు జాతిలో పుట్టినందున చెంచులక్ష్మి స్వామివారికి మాంసము, మధువులను సమర్పించి భుజించమని చెప్పింది. తనౌ వివాహం చేసుకుంటే అవన్నీ తప్పక భుజిస్తానని అన్నాడు శ్రీనరసింహస్వామి.

అటవికి జాతివారు మరో జాతి వారిని ఎలా వివాహం చేసుకోగలరని ప్రశ్నించడం మొదలు పెట్టారు చెంచులు. గరుడాద్రి పర్వత శ్రేణిలో ఒక చిన్న గుహ గుండా బయటపడి ఒక కొండ ఎక్కి అక్కడే లక్ష్మీదేవిని పరిణయమాడాడు నరసింహస్వామి.

ఆ కొండపైన ఇద్దరు కొలువైయ్యారు. ఉద్దాలక మహర్షి ఓసారి ఈ ప్రదేశానికి వచ్చినప్పుడు ఇక్కడ స్వామివారి కటాక్షమున్నట్టు తెలుసుకుని కఠిన తపస్సు చేశాడు. అయితే ఆయన శ్రీలక్ష్మి నరసింహస్వామిగా అక్కడున్నట్టు ప్రపంచానికి చాటిచెప్పలేదు. అయితే ఈ విషయం మరో సంఘటన ద్వారా తెలిసింది.

ఆ కొండ క్రింది భాగాన గొల్లపల్లి అనే గ్రామము ఉంది. గొల్లలు ఎంతో ప్రశాంతంగా జీవించేవారు. ఈ గ్రామంలో గల ఒక గోవు ప్రతిదినము స్వామి వద్ద క్షీరము ఇస్తూ వుండినది. గోవు యజమాని తన గోవు పొదుగులో పాలు లేకుండట గమనించి కలత చెందాడు. శ్రీ నరసింహస్వామి ఆయనకు కలలో కనిపించింది నీ గోవు పాలను సేవించుచున్నానని తెలియజేశాడు.

సంతోషపడిన గొల్లవాడు బిలప్రాంతము శోధించగా బిలముపై భాగమున శ్రీ స్వామివారి పాదముద్రిక గల శిలాఫలకము మరియు గిరి క్రింది భాగమున నైరుతి దిశన శ్రీ లక్ష్మిదేవి శిల కనిపించినదట.

గొల్లపిల్ల వాసులు శ్రీవరికి శ్రీ అమ్మవార్లకు చిన్న ఆలయములు నిర్మించి పూజలు చేస్తుండేవారు. విజయనగరం సామ్రాజ్యాధీశుడైన సదాశివరాయులు వారు విజయనగరము నుండి పెనుగొండ దుర్గమునకు పయనించుచూ ఈ క్షేత్రము వద్ద మజిలీ గావించాడట.

శ్రీ సదాశివరాయల వారికి శ్రీలక్ష్మి నరసింహస్వామి కలలో కనిపించి తన జైత్రయాత్ర దిగ్విజయమగునని ఆశీర్వదించాడట. సదాశివరాయల వారు దిగ్విజయుడై తన జైత్రయాత్ర తిరుగు ప్రయాణములో స్వామివారిని దర్శించి లక్ష్మి నరసింహస్వామి వారికి శ్రీలక్ష్మిదేవి అమ్మవారికి ఆలయాలు నిర్మించారు. పెన్నానది ఒడ్డున ఒక కొండపై స్వామివారి పాదముద్రిక క్రింది భాగమున బిలం ఉండుట వల్ల ఈ క్షేత్రం పెన్నహోబిల క్షేత్రమని పిలువబడుచున్నది.

ఆంధ్రప్రదేశ్‌లోని అనతపురం ఉరవకొండ రహదారి పక్కన పెన్నా నదికి 3 కి.మీ దూరమున ఒక గిరిపై శ్రీ పెన్నహోబిల లక్ష్మినరసింహస్వామి ఆలయం వెలిసింది. ఒక చిన్న కొండపై ఆలయం గోపుర ద్వారం దాటి విశాలమైన బయటి ప్రాకారం.

ఎడమవైపు వున్న ఒక చిన్న సన్నిధిలో చెన్నకేశవస్వామి వెలిశాడు. బలిపీఠం తర్వాత ధ్వజస్తంభం గరుడభగవాన్‌ సన్నిధి న్వున్నాయి. ఆ తర్వాత 45 అడుగులున్న రెండు స్తంభాలు వాటిపై ఆంజనేయస్వామి నమస్కరిస్తున్నట్టున్న విగ్రహం.

రెండింటిలో ఒకటి దీపస్తంభం. ఇంకోకటి సదాశివరాయల వారి విజయానికి ప్రతీకగా విజయస్తంభం. చిన్న మండపందాటి వెళ్తే గర్భగుడిలో లక్ష్మి నరసింహస్వామి కూర్చున్నట్టున్న విగ్రహం. అందమైన విగ్రహం కరుణచూపే కళ్లు పెద్దమీసం, పై కుడిచేతిలో చక్రం ఎడమచేత శంకం కింది కుడి చెయ్యి అభయహస్తం, ఎడమచేత అమ్మవారిని పట్టుకున్నట్టున్న విగ్రహం.

అలనాడు నరసింహస్వామి లక్ష్మిదేవిని గాంధర్వ వివాహం చేసుకున్న పవిత్రమైన చోటే ఈ గర్భగుడి. ఇక్కడ స్వామివారి కుడి పాదముద్రిక కనిపిస్తుంది. దానిప్రక్కనే ఆయన అహోబిలం నుండి వచ్చిన ద్వారం కనిపిస్తుంది.

స్వామి ముందు నిలబడి మనస్పూర్తిగా ధ్యానిస్తే మనసు సేదతీరుతుంది. ఎంతో ప్రశాంతత లభిస్తుంది. స్వామివారి ఈ గుహలో వివాహం చేసుకున్నందున ఈ స్వామిని భక్తితో మొకుకున్న వారికి పెళ్లి జరుగుతుంది. అభీష్టం నెరవేరుతుంది.

వివాహం జరగాలని ప్రార్ధించడానికి ఆకు పూజ జరిపిస్తే నలబై రోజులలో ఆ కోరిక నెరవేరుతుందని స్ధానిక భక్తజన నమ్మకం. ప్రతి సంవత్సరం వైశాఖమాసంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. స్వామి కల్యాణోత్సవము ప్రతిరోజూ జరుగుతూనే వుంటుంది.

పెళ్లి వేడుకలు సందర్భంగా అన్నదానమూ జరుగుతుంది. పెళ్లి బృందం ఉండడానికి ఆలయ కమిటి గదులను అద్దెకిస్తుంది. గిరికి క్రిందిభాగాన పుష్కరిణి వుంది. పుష్కరిణి ఆనుకుని ఎన్నో దుకాణాలు ఉన్నాయి. పక్కనున్న ఊళ్ల నుండి వచ్చేవారు ఇక్కడ వంట చేసుకుని వనబోజనాలు చేసి సంతోషంగా గడుపుతారు.

అశాశ్వతమైన ఈ జీవితంలో ప్రతిక్షణమూ ఎంతో అమూల్యమైనదని తెలుసుకుని ప్రతి మనిషి సంతోషంగా ప్రాశాంతంగా జీవిస్తే ఎంతో మంచిది. ఆ ప్రశాంతత ఈ దేవాలయంలో తప్పక లభిస్తుంది. పెన్నహోబిలానికి రండి స్వామిని దర్శించి తరించండి.

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: