telugudanam.co.in

      telugudanam.co.in

   

ర్యాలి జగన్మోహిని, చెన్నకేశవస్వామి, కమండలేశ్వరస్వామి

అమృతం పొందడానికి దేవతలు, దానవుల క్షీరసాగర మధనం చేశారు. అమృతం తమ చేతికి చిక్కకుండా పోతుందేమోనని భయం దేవతల మనసుల్లో మొదలైంది.

దాంతో దేవతలు విష్ణుమూర్తిని కలుసుకొని అమృతం రాక్షసులు చేతికి చికకుండా ఉండేలా ఏదైనా చేయమని వేడుకున్నారు. అమృతం అసురుల చేతికి చిక్కకుండా తప్పక సాయపడతానన్నాడు మహావిష్ణువు.

అమృతం కలశం బైటపడింది. అసురులు ఆ కలశాన్ని అపహరించడానికి ప్రయత్నించారు. అయితే అదే సమయం జగన్నాధుడు జగన్మోహిని అవతారమెత్తాడు. అమృత కలశాన్ని చేత తీసుకున్నాడు. తర్వాత అమృతాన్ని పంచడానికి దేవతలను అసురులను వేర్వేరు వరుసల్లో నిలబడమన్నాడు ఆ సమయంలో జగన్నాధుడు దేవతలకు తన నిజ రూపంలో దర్శనం ఇవ్వగా, అసురులకు వశీకరించే నేత్రాలతో జగన్మోహినిలా అగుపించాడు.

అమృతాన్ని దేవతలకు పంచిన తర్వాత జగన్మోహిని రూపంలో వున్న విష్ణుమూర్తి అక్కడినుండి జారుకున్నాడు. హాలహల విషాన్ని తన కంఠము నందు వుంచుకుని అలసిపోయిన ఈశ్వరుడు ఆ క్షణం స్పృహలోకి వచ్చాడు. అక్కడినుండి జగన్మోహిని వెళ్ళడం వెనుక నుండి చూశాడు. మోహిని అందానికి ముగ్ధుడై ఆమె వెనుకే వెళ్లాడు. ఆమె కాళ్లకున్న గజ్జలు సవ్వడి వస్తున్నవైపు వెళ్లిన ఈశ్వరునికి ఆమె జడపై నుండి కిందపడిన ఒక సుందరమైన పుష్పం నుండి వస్తున్న సుగంధాన్ని శ్వాసించాడు. ఆ క్షణమే అయ్యప్పస్వామి అవతరించాడు.

ఇదిలా ఉండగా నడిచి వెళ్తున్న జగన్మోహిని ఆగి వెనక్కి తిరిగి చూసింది. అంతదాకా అందమైన యువతిలా వున్న జగన్నాధుడు చిరుదరహాసంతో తన అసలు రూపధారణతో దర్శనం ఇచ్చాడు. అంతదాకా పుష్పం నుండి వెలువడిన సువాసనతో, మైమరచి పోయిన ఈశ్వరుడు ఇంతదాకా తనను సమ్మోహనపరచిన యువతి విష్ణువేనని తెలుసుకున్నాడు. సిగ్గుపడ్డాడు. నిలబడ్డచోటే బిగుసుకుపోయాడు.

వెనుకవైపు నుంచి మోహినిగానూ, ముందువైపు నుంచి విష్ణువుగానూ దర్శనం ఇచ్చిన ఆ స్వామి అక్కడే శిలారూపం దాల్చాడు. కాలక్రమేణా ఆ విగ్రహం భూగర్భంలో కలిసిపోయింది. అలా భూమి అట్టడుగు లోపల వున్న ఆ విష్ణుమూర్తి విషయం ప్రపంచానికి తెలియపరిచేలా మరో సంఘటన, ఆ తర్వాత జరిగింది.

రత్నాపురంను పాలించిన విక్రమదేవుడు అనే రాజు ఒకరోజు వేటకై అడవికి వెళ్లాడు. అలసిపోయిన రాజు ఒక చెట్టుకింద విశ్రమించాడు. చల్లటి గాలికి మైమరచిపోయి నిద్రపోయాడు. ఒక కల కన్నాడు.

ఆ కలలో విష్ణుమూర్తి కనిపించి ఆ ప్రదేశంలో తాను భూగర్భంలో వున్నానని చెక్కతో తయారుచేసిన రధాన్ని తీసుకురమ్మని విష్ణువు విక్రమదెవవునికి ఆజ్ఞ ఇచ్చాడు.

కల చెదిరి నిద్రలేచాడు విక్రమదేవుడు. చెక్కతో ఒక రధం తయారుచేసి రాజు దాన్ని ఈడ్చుకుంటూ రాగా ఒకచోటికి వచ్చినప్పుడు రధానికున్న చక్రంలోని కడశిల రాలి కిందపడింది. రాజు రధాన్ని లాగుతున్న విషయం తెలిసి, అక్కడికొచ్చిన ప్రజలు రాలి రియాలై అని గోష మొదలుపెట్టారు. అదేచోట తవ్వగా అక్కడ విష్ణుమూర్తి విగ్రహం బయటపడింది.

విక్రమదేవుడు ఆ శిలా విగ్రహాన్ని చూసి మిక్కిలి సంతసించాడు. విగ్రహాన్ని అదేచోట ప్రతిష్ట చేయించాడు.

రధచక్రానికి వున్న కడశిల రాలి కింద పడడం వల్ల ఈచోటు కాలక్రమేణర్యాలిగా మారిపోయింది.

మోహిని తల నుండి రాలిన పుష్పం వల్ల కూడా ఈ క్షేత్రానికి ర్యాలి అన్న పేరు వచ్చినదని అంటారు.

తూర్పు గోదావరి జిల్లా, రావులపాళ్యం నుండి 6 కి.మీ. దూరాన వుంది ర్యాలి. జగన్మోహిని చెన్నకేశవస్వామి ఆలయం 5 రాజగోపురాలని దాటి లోపలికి ప్రవేశిస్తే ముందు ధ్వజస్తంభాన్ని చూడగలం.

ధ్వజస్తంభానికానుకుని గరుడ సన్నిధి. గరుడ భగవాన్‌ గర్భగుడిలో జగన్మోహిని చెన్నకేశవ స్వామిని మొక్కుతున్నట్టున్న విగ్రహం.

గరుడ సన్నిధి తర్వాత గర్భగుడి ముందు ఒక మండపం. అక్కడ ఒక సన్నిధిలో సత్యనారాయణస్వామి విగ్రహం వుంది.

ఈ మండపంలో స్వామికి కుడివైపున శ్రీదేవి ఎడమవైపున భూదేవి వేరువేరు సన్నిధులలో ప్రతిష్ట చేశారు.

గర్భగుడిలో తూర్పువైపుకున్న మూలవిగ్రహం. భారతదేశంలో ఈ ఆలయంలో మాత్రమే మూలవిగ్రహం ముందువైపు నుండి మరియు వెనుక వైపు నుండి కూడా దర్శనం లభిస్తుంది. ఒక రాతిపై జగన్మోహిని, చెన్నకేశవస్వామిల సాలిగ్రామవ్ ఇగ్రహం ఎత్తు 5 అడుగులు, వెడల్పు మూడున్నర అడుగులు.

ముందువైపు ఎంతో అద్భుతంగా చెక్కిన చెనంకేశవస్వామి, కిరీటం, శంఖు, చక్రాలతో దర్శనం ఇస్తారు. స్వామి కింది కుడి చేతిలో రేఖలు కూడా కనిపిస్తాయి. ఎడమ చేతివేళ్లకున్న గోళ్లు కూడా కనిపించేంత అద్భుతంగా ఉన్నది ఆ విగ్రహం.

స్వామిచుట్టూ దశావతారాలు, శ్రీదేవి, భూదేవి, నారదుడు, తుంబుర, రంభ, ఊర్వశి, గోవర్ధనధారి కృష్ణుడు, ఆదికేశవుడు, గంగాదేవి, గరుడ భగవాన్‌ల వారి అద్భుతమైన ప్రతిమలు.

స్వామివారి పాదాల మధ్య గంగాదేవి చిన్న విగ్రహం. అక్కడ ఎప్పుడు తడిగా వుంటుంది. పాదాల మధ్యన గంగాదేవి ఉద్భవించడం ఈ క్షేత్రం గొప్పతనం.

వెనుకవైపున జగన్మోహిని దేవి పువ్వులతో అలంకరించిన జడభాగం. సన్నటి చేతులు, పొడవైన చేతివేళ్లు. చేతికి అందంగా పొందికగా వున్న వంకీలు, పాదాల నుండి భుజాల దాకా రాతిలో చెక్కిన చీర, వున్నా తొడపై కనిపించే మచ్చ. పద్మినిజాతి స్త్రీలకున్న అన్ని లక్షణాలతో వున్న విగ్రహం.

ఒక్కోక్క పూజా సమయంలోను చెన్నకేశవస్వామికి, జగన్మోహినికి ఆరాధనలు, నైవేద్యాలు విడిగా జరుగుతాయి.

జగన్మోహిని ఆలయం తూర్పువైపుకుండగా దానికి ఎదురుగా ఉమాకమండలేశ్వరస్వామి ఆలయం పడమటి దిక్కున కనిపిస్తుంది.

ఈ ఆలయంలో వున్న ఈశ్వరుడే విష్ణువును జగన్మోహినిలా చూసి ఆకర్షించబడి ఆతర్వాత తప్పు తెలుసుకుని సిగ్గుపడ్డాడట.

శివుడు నిజం తెలుసుకుని సిగ్గుతో బిగుసుపోయినప్పుడు బ్రహ్మ తన కమండలంలోని నీటిలో శివలింగాన్ని సృష్టించాడట. అందుకే ఈ స్వామికి కమండలేశ్వరస్వామి అన్న పేరు ్వచ్చినట్టు స్ధలపురాణం చెబుతోంది.

ఉమా కమండలేశ్వరస్వామి తన గురించి ప్రపంచానికి తెలియబర్చిన విధం విచిత్రంగా ఉంటుంది. చోళరాజు ఒకసారి అక్కడ ఒక కొలను నిర్మించే పనులు చేబట్టాడు. త్రవ్వకం పనులు జరుగుతున్నప్పుడు హాఠాత్తుగా గునపానికి ఏదో తగిలిన చప్పుడు వినిపించినదట. ఆ్చోట జాగ్రత్తగా త్రవ్వగా భూమిలోపల మట్టి మూసుకుపోయిన శివలింగం బయటపడిందట.

రాజు ఆక్షణమే లింగాన్ని అక్కడ ప్రతిష్ట చేసి ఆలయం నిర్మించాడట.

గర్భగుడిలో పడమటి వైపు చూస్తున్నట్టున్న కమండలేశ్వరస్వామి దర్శన్మిస్తాడు. స్వామికి ఎన్ని బిందేల్తో జలాభిషేకం జరిపినా ఆ నీరు ఎక్కడికి పోయి చేరుతుందో ఏమైపోతుందో తెలీదు. అయితే జగన్మోహిని ఆలయంలో చెన్నఖేశవస్వామి పాదాల మధ్య నిరంతరం కనిపించే తడి కమండలేశ్వర స్వామికి జరిగే అభిషేక తీర్ధం చెన్నకేశవస్వామి పాదాల మధ్యను కనిపిస్తుందన్నది భక్తుల నమ్మకం.

కమండలేశ్వరస్వామికి ఎడమవైపు పార్వతి, సన్నిధి ముందు మండపంలో స్వామికి ఎడమవైపు అర్ధనారీశ్వరుడు, కుడివైపు గణపతి కాలబైరవుడు ఎదురెదురుగా వున్న ఈ ఆలయాలలోని శిల్పకళ అద్భుతంగా వుంటుంది.

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: