telugudanam.co.in

      telugudanam.co.in

   

ఇడ్లీ-నేషనల్ ఫుడ్

శ్వేత వర్ణంతో మృదువుగా వుండే ఉపాహారం. అన్ని కాలాల్లో అందరూ ఇస్జ్టపడే పలహారం.శారీరక పౌష్టికత్వాన్ని పెంచే ఆరోగ్య ప్రదాయిని.ప్రాచీన కాలం నుండి వాడుకలో వున్న వంటకం. దక్షిణాది రాష్ట్రాల ప్రజల మదిని దోచి దేశదేశాలను జయించిన బ్ర్రేక్‌ఫాస్ట్. టిఫిన్ చేయడానికి హొటల్‌కి వెళ్ళగానే ముందుగా మరేమీ ఆలోచించకుండా అర్డర్ చేసేది ఇడ్లీనే. అనేక మందికి జీవనోపాధి కల్పించే వ్యాపారం. ఎన్నెన్నో వెరైటీలతో, ఆకృతులతో వుండే వేడివేడి ఇడ్లీలపై కమ్మటి నెయ్యి వేసుకొని తింటే కలిగే అనుభూతిని ఇంతని చెప్పలేం. వేడి వేడి ఇడ్లీలకు విభిన్నరుచుల పచ్చళ్ళు, పొడులు, సాంబారు, నెయ్యి కలిస్తే ఇక చెప్పడానికేముంటుంది. ఏకబిగిన అరడజను ఇడ్లీలు తినడం తప్ప. అనారోగ్య పరిస్థితుల్లోనూ ప్రయాణాల్లోనూ ఎప్పుడు, ఎక్కడ ఎలా తిన్నా సులభంగా జీర్ణమయ్యే గొప్ప ఆహారం.

పల్లెటూరి పాకల నుంచి, సైకిల్‌మీద టిఫిన్ కారియర్ పెటుకొని ఇడ్లీలమ్మే అబ్బాయి దగ్గర నుంచి, రోడ్డుప్రక్క ఫుట్‌పాత్ మీద వుండే ఇడ్లీల బండి, కాకా హొటల్ దగ్గర నుంచి ఫైవ్‌స్టార్ హొటల్ వరకు ఎక్కువుగా అమ్ముడయ్యే చక్కటి ఉపాహారం ఇడ్లీ. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్‌కు ఆస్కారం లేకుండా, ఆరోగ్యకరమైన జీవనాన్నిచ్చేది ఇడ్లీ.మసాలాలు, నూనెవంటలు, ఫాస్ట్‌ఫుడ్స్ జిహ్వకు రుచిగా వున్న వాటిలో లేని విలువలెన్నో ఇడ్లీలో నిక్షిప్తమై వున్నాయి.

ఇడ్లీ అనే పదార్థానికి ఎప్పటి నుంచి చరిత్రవుందో ఇదమిద్ధమైన ఆధారాలు లేవు. కానీ వందల సంవత్సరాల చరిత్ర గల పురాతనమైన ఆహారపదార్థాల్లో ప్రసిద్ధమైన వంటకమిది. మొట్టమొదటిసారిగా చెప్పాలంటే క్రీ.శ. 920లో దీని ప్రస్తావన వుంది. మినప్పప్పును నానబెట్టి మెత్తటి పిండి చేసి దాన్ని పులియబెట్టి వంట చేయడం 920లో ఉందని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. అలాగే క్రీ.శ. 1025లో మినుములను మజ్జిగలో నానబెట్టి, రుబ్బి దాంట్లో మిరియాలు, ధనియాలు, జీలకర్ర, ఇంగువ, ఉప్పు, కారం వేసి ఒక విధమైన వంటకాన్ని తయారుచేసేవారని చరిత్ర చెబుతోంది.

క్రీ.శ. 1130లో కన్నడ ప్రభువు, విద్యావేత్త అయిన మూడవ సోమేశ్వరుడు ( అనగా ఇప్పటి కర్నాటక రాష్టానికి ) ఒకప్పటి రాజు సంస్కృతంలో ' మనసోల్లాస ' అనే పుస్తకం రాశారు. దాంట్లో ఇడ్లీ గురించిన ప్రస్తావన ఉన్నట్లు చరిత్ర చెబుతోంది. కానీ ప్రత్యేకించి ఇడ్లీలకు బియ్యం వాడేవారు అని చెప్పడానికి 17వ శతాబ్ధం వరకూ ఏ ఆధారమూ లేదు.

సింధు నాగరికత రోజుల్లో ఇడ్లీలు ఉపయోగించినట్లు చరిత్ర చెబుతోంది. తంజావూరు శరభోజి రాజుల కాలంలో ఇడ్లీలు తిన్నారని, ఆ చరిత్ర పుస్తకాల్లో ఉందని అన్నారు. అప్పట్లో ఇడ్లీలను ప్రత్యేకంగా చేసుకునే వారని పేర్కొన్నారు.

ప్రపంచం మొత్తం మీద ఆహార పదార్థాలను ఉడికించి తినడం ఎప్పుడు మొదలుపెట్టారో అప్పటి నుంచి ఆహార పదార్థాల పరిణామక్రమంలో చాలా మార్పులు చేర్పులు జరిగాయి.ఉపాహారంలో ప్రధానమైన ఇడ్లీ చరిత్ర కూడా అలాగే ప్రారంభమయింది. ఇడ్లీ మొదటి రూపం కుడుములు. గణనాథునికి అత్యంత ప్రీతికరమైన కుడుములు (ఉండ్రాళ్ళు) ఆవిరిమీద ఉడకబెట్టేవే. ఈ వంటకం పురాణకాలం నుంచి వస్తున్న ఆహార పదార్థం. ఈ కుడుములే రూపాంతరం చెంది ఇడ్లీ అయింది.

దక్షిణాది రాష్ర్టాలైన తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ , కేరళ కాకుండా శ్రీలంకలో కూడా వ్యవహారబద్ధంగా ఇడ్లీలకు ప్రాముఖ్యత వుంది. కొన్నిదేశాల్లోని స్టార్‌హోటళ్ళ మెనూలోనూ ఇడ్లీ వుండటం దాని ప్రత్యేకతని తెలియజేస్తుంది.


ఇడ్లీ పుట్టుక

ఇడ్లీ అనే పేరు ' ఇట్టు ', ' అవి ' అనే రెండు తమిళ పదాల నుంచి వచ్చింది. ' ఇట్టు ' అంటే పల్చటి పిండిని పరచడం, ' అవి ' అంటే ఆవిరిమీద ఉడకబెట్టడం. ఈ రెండు పదాలు కలిసి క్రమేణా ఇడ్లీగా రూపాంతరం చెందాయని అంటారు.

అలాగే ఇడ్లీ ముందుగా తయారయిన ప్రాంతం తమిళనాడులోని తంజావూరు. దీనిని ముందుగా ' ఇడ్ ' అనే వాళ్లట. ఇడ్లీలను అప్పట్లో మిగిలిపోయిన అన్నాన్ని పిసికి, అర్ధి వృత్తాకారంలో ఉన్న చెట్టు బెరడులను తీసుకుని అందులో పోసి, మట్టికుండలో వాటిని పెట్టి ఉడికించేవారు. వాటిని రాత్రి మిగిలిపోయిన రసంలో అద్దుకుని తినేవారు. పడవేసే అవసరం ఉండదు. చల్లగా వున్న అన్నానికి బదులుగా వేడివేడి ఆహారాన్ని తినవచ్చు అనే ఉద్ధేశంతో ఇడ్‌లను తయారుచేసేవారు. తరువాత క్రమంగా ఇడ్లీలను బియ్యం రుబ్బి చేసేవారు. బియ్యం పిండితో చేసిన ఇడ్లీలు గట్టిగా ఉండటంతో అందులో కాస్త మినప్పప్పు ( ఉద్దిపప్పు ) కూడా వేయడం ప్రారంభించారు. ఈ విధంగా ఇడ్లీలు తమిళనాడులో ఉద్భవించాయి. ఇడ్లీలు దంపుడు బియ్యంతోనే అప్పట్లో చేసేవారు.

ఇదే వంటకాన్ని ఆంధ్రులు ' వాసిని పోలి 'గా పిలిచేవారు. కుడుములు కూడా వాసినిపోలి మీద చేసేవారు. ఒక గిన్నెలో నీళ్ళుపోసి దాని మూతికి సరిపడ బట్టను కట్టి, దానిపై ఒక పల్చటి తడి బట్ట వేసి, దానిమీద పిండిని బిళ్ళలుగా పరిచి పైన మూతపెట్టి ఉడికించేవారు.

ఇడ్లీని చాలామంది ఇడ్లీ అని, ఇడ్దిలీ అని పిలుస్తారు. ఇడ్లీలను రాయలసీమలో ఇడ్డెన్లు అని కూడా అంటారు. వీటిని ఎక్కువగా పప్పులు, ఉప్పుడు బియ్యం కలిపి తయారుచేస్తారు.రెండు కానీ, మూడు కానీ అంగుళాల వ్యాసార్థం, అర అంగుళం ఎత్తులో ఊండే రేకుల్లో ఆవిరిమీద ఉడకబెట్టి తయారుచేస్తారు. తరుచుగా దీన్ని ఉదయం తినే అల్ఫాహారంగానూ, ఎప్పుడైనా తినే ఉపాహారంగానూ చట్నీ, సాంబారుతోకానీ, కారప్పొడితోకానీ వేడి నెయ్యి వేసుకొని తింటారు. ఇడ్లీ చాలా వాడుకలో వున్న రుచికరమైన ఫాస్ట్ ఫుడ్‌గా రూపాంతరం చెందింది.


పాకెట్లలో ఇడ్లీరవ్వ

పిండి, బియ్యం నానబెట్టడం, కడగడం, రుబ్బడం, పులియబెట్టడానికి తీరిక లేనివారి పాలిట వరప్రదాయిని ఇన్‌స్టెంట్ ఇడ్లీ. సరుకులను కొని వాటిని నానబెట్టడం, పిండి తయారుచేయడం కుదరక మార్కెట్‌లో లభించే ఇన్‌స్టెంట్ ఆహార పదార్థలపై ఆధారపదే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. వీరికోసమే మార్కెట్లోకి ఇన్‌స్టెంట్ ఇడ్లీ పొడి ప్యాకెట్లు వచ్చాయి. అలాగే కర్రీ పాయింట్‌లో కూరలమ్మినట్టుగా కొన్నిచోట్ల రుబ్బిన పిండిని ప్రత్యేకించి అమ్ముతున్నారు.

దక్షిణాది రాష్ట్రాల్లో ఇడ్లీలకు ప్రత్యేక స్థానం ఉంది. ప్రస్తుతం ఇది దేశ వ్యాప్తంగా విస్తరించింది. నేటి సమాజంలో అన్ని ఆహార పదార్థాలు ఇన్‌స్టెంట్ పద్దతిలోకి వచ్చినా, ఇడ్లీలను మాత్రం మరిచిపోవడం లేదు. దానికి నిదర్శనం చెన్నైలో ఒక్క గంటలో 50 వేలకు పైగా సాంబారు ఇడ్లీలను విక్రయించే కేఫ్‌లుండటమే.


ఇడ్లీ రకాలు

వివిధ రకాల పప్పులు, పదార్థాలతో రుచికరమయిన ఇడ్లీలను తయారుచేయవచ్చు. ఈ విధంగా చేసే ఇడ్లీలు వందరకాలకు పైగా వున్నాయి. వీటిని వివిధ వస్తువలతో తయారుచేసినా, బియ్యం మాత్రం తప్పకుండా ఉండాల్సిందే. వంటగదిలో చేతికి అందుబాటులో వుండే పదార్థాలతో రోజుకు ఒక రకం ఇడ్లీ చేసుకోవచ్చు. తిన్న టిఫిన్‌నే తినకుండా మూడు, నాలుగు నెలలు కొత్త రుచులు ఉపాహారాన్ని తినవచ్చు. అంటే కొంచెం తినాలనే ఉత్సుకత, షడ్రుచులు కావాలనే తాపత్రయం, ఓపిక ఉండాలే కానీ తినగలిగినన్ని రకాల ఇడ్లీలు తయారుచేసుకోవచ్చు.


ఆరోగ్యదాయిని ఇడ్లీ

ఆవిరి మీద ఉడికే ఇడ్లీ రుచికరమైన పదార్థమే కాకుండా ఆరోగ్యదాయిని. ఎటువంటి నూనె, అధిక ఉప్పు, కారం, మసాలాలు ఉండవు. మిగిలిన ఉపాహారాలు తింటే వచ్చే సమస్యలు ఇడ్లీ తింటే రావు. జీర్ణం కాకపోవడం, కడుపులో మంట, కాళ్ళులాగడం లాంటి ఆరోగ్య సమస్యలుండవు. ఆరోగ్యానికి ఎటువంటి కీడు తలపెట్టని ఏకైక వంటకం. కొలెస్ట్రాల్, కొవ్వు, మధుమేహం, అధిక రక్తపోటు, గుండేపోటులకు అతీతమైనది ఇడ్లీ. ఏవిధమైన రుగ్మతలకు గురైనవారైనా తినగలిగే ఏకైక ఆహారం మినప్పప్పు, రవ్వతో కలిపి చేసే ఇడ్లీ. జ్వరం వచ్చినా, ఆపరేషన్లు అయినా కూడా బ్రెడ్ తినలేని వాళ్లు ఇడ్లీని మాత్రమే ఆహారంగా తీసుకోమని డాక్టర్లు చెబుతారు. ఇడ్లీని ఆవిరిమీద ఉడికించడంతో దీనిలోని ప్రొటీన్లు నశించవు. పేదవాడి నుంచి ధనవంతుల వరకు ఉపాహారంగా తినగలిగే బలవర్థకమైన ఆహారం ఇడ్లీ. ఆవిరి మీద ఉడుకుతుంది. కాబట్టి సులభంగా జీర్ణమవుతాయి.


మిగిలిన ఇడ్లీలతో వెరైటీ టిఫిన్లు

ఉదయం చేసిన ఇడ్లీలను వృధాచేయకుండా వెరైటీ టిఫిన్లు చేసుకోవచ్చు. ఇడ్లీ ఉప్మాలానే ఇడ్లీ ప్రై, పెరుగు ఇడ్లీ,రోస్టెడ్ ఇడ్లీ, స్టఫ్డ్ ఇడ్లీలను చేసుకోవచ్చు.


ఇడ్లీ ఫ్రై

ఇడ్లీలు - 5, ఎండుకారం - 1 టీ స్పూన్, గరం మసాలా - 1 టీ స్పూన్, ఉప్పు - తగినంత, నూనె - వేయించడానికి సరిపడినంత, ఉల్లిపాయ - 1

ఇడ్లీలను చిన్నచిన్న ముక్కలుగా చేయాలి. బాణలిలో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు వేయించాలి. దాంట్లో ఇడ్లీ ముక్కలు వేసి దోరగా వేయించి, దాంట్లో కారం, గరం మసాలా, ఉప్పు వేసి బాగా కలపాలి.


పెరుగు ఇడ్లీ

మిగిలిపోయిన ఇడ్లీలు లేదా తాజాగా చేసిన ఇడ్లీలు - 8, పెరుగు - 1 కప్పు, ఆవాలు - 1 టీ స్పూన్, కొత్తిమీర, నూనె - 2 టీ స్పూన్లు

బాణలిలో నూనె వేసి దాంట్లో ఆవాలు వేయించి, ఇడ్లీలను చిన్నచిన్న ముక్కలు చేసి వేయించాలి.తర్వాత పెరుగు వేసి బాగా కలపాలి. పైన కొత్తిమీర సన్నగా కట్‌చేసి వేస్తే తినడానికి రుచిగా వుంటుంది.


రోస్టెడ్ ఇడ్లీ

ఇడ్లీలు - 5, ఎండుకారం - 1 టీ స్పూన్లు,నిమ్మ ఉప్పు - తగినంత, కారం - సరిపడినంత

ఇడ్లీలను ముక్కలుగా చేసుకోవాలి.బాణలిలోనూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి ఇడ్లీ ముక్కలను దోరగా వేయించాలి. దానిపై నిమ్మ ఉప్పు, కారం వేసి వేయిస్తే రోస్టెడ్ ఇడ్లీ రెడీ.


స్టఫ్డ్ ఇడ్లీ

ఇడ్లీలు - 5, బంగాళాదుంప, ఉల్లిపాయ, జీడిపప్పు, కొత్తిమీర, కారం, ఉప్పు, నూనె, పచ్చిమిరపకాయలు, టమోటాలు - 2, గరం మసాలా

బంగాళా దుంపలు ఉడికించి పై పొట్టు తీసి మెత్తగా చేయాలి. జీడిపప్పు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, కొంచెం పసుపు వేసి నూనెలో వేయించాలి. టమోటాలు వేసి కొంచెంసేపు ఉడికించాలి.

బంగాళాదుంపల ముద్దను వేసి బాగా కలపాలి. రుచిగా ఉండటానికి కొంచెం పంచదార, గరం మసాలాను వేసి బాగా కలపాలి. కొత్తిమీరను సన్నగా స్ట్‌చేసి పైన వేయాలి. పెనంపై కొంచెం నూనె వేసి ఇడ్లీని సగానికి కట్‌చేసి అటు, ఇటు కాల్చి, ఒక ముక్కపై బంగాళాదుంపల మసాలాను పెట్టి పైన ఇంకో ఇడ్లీ ముక్కను పెట్టాలి. స్టఫ్డ్ ఇడ్లీ రెడీ. దీన్ని కొత్తిమీర పచ్చడితోతింటే రుచిగా వుంటుంది.


ఇడ్లీ కూర

ఇడ్లీలు -3, ఉల్లిపాయ ముక్కలు - ఒక కప్పు, టమోటా ముక్కలు - ఒక కప్పు, పచ్చి బఠాణీలు, ఆవపొడి - ఒక టీ స్పూన్, ఎండుకారం - 1 టీ స్పూన్, నూనె - సరిపడినంత

ఇడ్లీలను చాకుతో చిన్నచిన్న ముక్కలుగా చేయాలి. బాణలిలో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, టమోటా ముక్కలు, పచ్చి బఠాణీలు ఉప్పు వేసి వేయించాలి. ఎండుకారం వేసి బాగా కలపాలి. తర్వాత ఇడ్లీ ముక్కలను వేసి వేయించాలి. ఇది ఊరికే తినడానికి బాగుంటుంది. చపాతీలు, పూరీలతోనూ తినవచ్చు.


జీవనోపాధిగా ఇడ్లీ

రుచికరమైన, ఆరోగ్యకరమైన ఇడ్లీ ఎందరికో ఉపాధిని కూడా అందిస్తోంది. వివిధ నగరాల్లో, పట్టణాల్లో ఇడ్లీలు అమ్ముకుంటూ జీవించేవారు వందల సంఖ్యలో వున్నారు. గతంలో ఇంట్లో ఇడ్లీలు తయారుచేసుకొని కాలినడకన వీధుల్లో తిరుగుతూ అమ్ముకునేవారు.రాజమండ్రి, విశాఖ, విజయవాడ, హైదరాబాద్ వంటి నగరాల్లోనే గాక మామూలు టౌన్లలో, మండల కేంద్రాల్లో ఇడ్లీలు తయారుచేసుకొని సైకిళ్ళ మీద తిరిగి అమ్ముకునేవారు ఇప్పటికీ కనిపిస్తున్నారు.

టిఫిన్ సెంటర్లవారికి ఇడ్లీల తయారీ మీద మంచి లాభాలున్నాయి. ఉదయం పూట టిఫిన్ సెంటర్లు బిజీగా వుంటాయి. బాబాయ్ హొటళ్ళలోనూ ఇడ్లీలకు గిరాకీ వుంది. ఆ తర్వాత కొన్ని సెంటర్లలో బండ్లమీద అమ్మేవారి వ్యాపారం బాగానే సాగుతోంది. ఇక పెద్దహొటళ్ళ సంగతి చెప్పక్కర్లేదు. క్వాలిటీ ఎలా వున్నా ఇడ్లీల మీద వారికి మంచి లాభాలున్నాయి. ఇలా జీవనోపాధిగా కూడా ఇడ్లీ తనదైన పాత్రని పోషిస్తోంది.

ఈనాడు సౌజన్యంతో

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: