telugudanam.co.in

మా అనుబంధ వెబ్‌సైట్...

telugudukanam.co.in

వంటలు (కొన్ని)

క్యాబేజీ ఊరగాయ

కావలసిన వస్తువులు:

క్యాబేజీ తురుము - పెద్ద కప్పు.
నూనె - 4 టేబుల్‌ స్పూన్లు.
కారం - 1 టీ స్పూను.
ఉప్పు - 1 టీ స్పూను.
ఆవపిండి - 1/4 టీ స్పూను.
మెంతిపిండి - 1/4 టీస్పూను
ఇంగువ - చిటికెడు.
పసుపు - చిటికెడు.

తయారు చేసే విధానం:

ఓ పొడి పాత్ర తీసుకుని అందులో క్యాబేజీ తురుము వేయాలి. అందులోనే ఉప్పు, కారంతో పాటు పొడులన్నీ వేసి బాగా కలిపి, నూనె పోసి జాడీలో పెట్టాలి. 24 గంటల తరవాత మూత తీసి మరోసారి కలిపితే క్యాబేజీ పచ్చడి రెడీ. ఇది సుమారు నెల రోజూలపాటు నిల్వ ఉంటుంది.(ఇదే పద్ధతిలో పచ్చి బొప్పాయి, దోసకాయలతో కూడా నోరూరించే ఊరగాయల్ని చేసుకోవచ్చు. ఇవి సుమారు వారం రోజులవరకూ నిల్వ ఉంటాయి.)


మూలం : ఈనాడు ఆదివారం, డిసెంబరు 18, 2005.


[ వెనుకకు ]

బెల్లం చిలకడ దుంపలు

కావలసిన వస్తువులు:

చిలకడ దుంపలు - 500 గ్రా.
బెల్లం - 500 గ్రా.
యాలకులు - 5 గ్రా.
నెయ్యి - 50 గ్రా.

తయారు చేసే విధానం:

ఎర్ర చిలకడ దుంపలు తీసుకొని శుభ్రంగా కడగండి. వీటిని గుండ్రంగా కోసి - దళసరి మందం ఉన్న గిన్నెలో వేయండి. బెల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని, దుంపలు ఉన్న గిన్నెలో వేయండి. ఇందులో ఓ కప్పు నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టి ఉడికించండి. ముక్కలు ఉడికి మెత్తబడి, పాకం దగ్గరపడుతున్నప్పుడు యాలకుల పొడి, నెయ్యి కలపండి. మరో అయిదు నిమిషాలు సన్నటి మంట మీద ఉంచి దించండి. చల్లారిన తరవాత ఆరగించండి.


మూలం : ఈనాడు ఆదివారం, ఆగస్టు 3, 2003.


[ వెనుకకు ]

కరివేపాకు రైస్

కావలసిన వస్తువులు:

సన్నబియ్యం - అర కిలో.
నీళ్లు - ముప్పావు లీటరు.
నూనె - 1 కప్పు.
ఉప్పు - తగినంత.
వేయించిన కరివేపాకు - 2 కప్పులు (మరీ మెత్తగా కాకుండా పొడి చేయాలి).
పుట్నాల పొడి (వేయించిన శనగపప్పు పొడి) - 1 కప్పు
చింతపండు పులుసు - అర కప్పు.
వేయించి కొట్టిన ధనియాల పొడి - 2 టీ స్పూన్లు.
వేరుశనగపప్పు - 50 గ్రా.
పచ్చిమిర్చి - 6 (సన్నగా చీల్చాలి).
ఎండుమిర్చి - 6.
మినపప్పు - 1 టీ స్పూను.
ఆవాలు - 1 టీ స్పూను.
జీలకర్ర - 1 టీ స్పూను.
పసుపు - 1/4 టీ స్పూను.
ఇంగువ - 1/4 టీ స్పూను.

తయారు చేసే విధానం:

బియ్యం కడిగి, నీళ్లన్నీ వార్చేయాలి. వెడల్పాటి పెద్ద గిన్నెలో నీళ్లు పోసి మరిగించాలి. తరవాత బియ్యం వేసి మూడు వంతులు ఉడికాక మంట తగ్గించాలి. పసుపు, ఉప్పు, కొద్దిగా నూనె, చింతపండు పులుసు, కరివేపాకు పొడి, పుట్నాల పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి బాగా కలపాలి.

తరవాత మంట బాగా తగ్గించి రొట్టెల పెనం పెట్టి దానిమీద ఈ గిన్నెను ఉంచి మూతపెట్టి 15 నిమిషాలు ఆవిరిపోకుండా ఉంచాలి. పదిహేను నిమిషాల తరవాత బాణలిలో నూనె వేసి కాగాక, ఎండుమిర్చి, మినపప్పు, వేరుశనగపప్పు, ఆవాలు, ఇంగువ... అన్నీ వేసి వేగాక పచ్చి మిర్చి చీలికలు కూడా వేసి సువాసన వచ్చేవరకూ వేయించాలి. ఈ పోపును కరివేపాకు రైస్‌లో కలిపి మరో పది నిమిషాలు మూతపెట్టి ఉంచి మగ్గనిస్తే సరి.


మూలం : ఈనాడు ఆదివారం, సెప్టెంబరు 25, 2005.


[ వెనుకకు ]

కాకరకాయ పచ్చడి

కావలసిన వస్తువులు:

కాకరకాయలు - 1 కిలో.
చింతపండు - 1/4 కిలో.
ఉప్పు - 1 డబ్బా.
కారం - 1 గిద్ద.
నూనె - 350 గ్రా.

తయారు చేసే విధానం:

ముందుగా కాకరకాయలు శుభ్రంగా కడిగి తుడిచి చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఒక గిన్నె తీసుకొని చింతపండు, నీళ్ళు పోసి బాగా మెత్తగా ఉడకనివ్వాలి. ఆరిన తరువాత మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. బాండీలో నూనె పోసి కాకరకాయ ముక్కలు వేసి గల గల లాడే వరకు వేయించాలి. అవి వేగిన తరువాత ఒక పళ్ళెంలో ఈ ముక్కలు, చింతపండు రసం, కారం అన్నీ కలిపాలి. తరువాత ఆ మిగిలిన నూనెలో తాలింపు పెట్టి ఆరిన తరువాత అందులో పోసి కలపాలి.


[ వెనుకకు ]

చిలగడదుంపల పచ్చడి

కావలసిన వస్తువులు:

చిలగడదుంపలు - 1 కిలో.
ఉప్పు - 1 డబ్బా.
కారం - 1 గిద్ద.
చింతపండు - 1/4 కిలో.

తయారు చేసే విధానం:

చిలగడదుంపలు శుభ్రంగా కడిగి తుడిచి, దుంపలు చిన్న చిన్న ముక్కలుగా చేసి, ముక్కలు, ఉప్పు, చింతపండు అన్నీ కలిపి గ్రైండర్‌లో వేసి మెత్తగా రుబ్బుకొన్న తరువాత కారం కలిపి తీసి తాలింపు పెట్టటమే.


[ వెనుకకు ]

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం