telugudanam.co.in

      telugudanam.co.in

   

వంటలు (కొన్ని)

పాలతాలికలు

కావలసిన వస్తువులు:

‌పాలు - ఒక లీటరు.
నీళ్లు - ఒక లీటరు.
‌సగ్గు బియ్యం - ‌వందగ్రాములు.
బియ్యపిండి - వందగ్రాములు.
మైదాపిండి - రెండు టీ స్పూన్లు
పంచదార - 200గ్రా.
‌బెల్లం - పావుకేజి.
‌జీడిపప్పు - కొద్దిగా.
‌కిస్‌మిస్‌ - కొద్దిగా.
‌ఏలకులపొడి - ఒక టీ స్పూను.
నెయ్యి - కొద్దిగా.

తయారు చేసే విధానం:

పాలలో నీటిని కలిపి మరిగించాలి. పొంగురాగానే అందులో సగ్గుబియ్యం వేసి ఉడికించాలి. ఈలోపు బియ్యంపిండిలో మైదాపిండి, ఒక స్పూను పంచదార వేసి సగ్గుబియ్యం ఉడుకుతున్న తేటతో (సగ్గుబియ్యం రాకుండా పాలు మాత్రమే) చక్కిలాల పిండిలా కలుపుకోవాలి. ఈ పిండిని చక్కిలాలను ఒత్తినట్లు మరుగుతున్న పాలలోకి ఒత్తాలి. ఇవే తాలికలు. ఇవి పాలలోనే ఉడుకుతాయి. ఒక తీగ మరొక తీగ మీద పడకుండా విడివిడిగా వచ్చేటట్లు చూడాలి. ఒకదానిమీదకొకటిగా పడితే ఉడికేటప్పుడు కలిసి ముద్దవుతాయి.

తాలికలు ఉడికేలోపుగా బెల్లం, పంచదార కలిపి పాకం పట్టి చల్లారనివ్వాలి. తాలికలు ఉడికిన తరువాత దించేసి చల్లారిన పాకాన్ని, ఏలకుల పొడిని వేసి కలపాలి. ఇప్పుడు పైన రెండు స్పూన్ల నెయ్యి వేసి ముందుగా నేతిలో వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పు, కిస్‌మిస్‌లతో అలంకరించాలి.


మూలం: 13-01-09, మంగళవారం, సాక్షి, ఫ్యామిలీ.


[ వెనుకకు ]

గోధుమ అప్పాలు

కావలసిన వస్తువులు:

‌గోధుమపిండి - 100గ్రా.
‌బెల్లం - 50గ్రా.
‌చెరకురసం - ‌50మి.లీ.
మైదా - రెండు టీ స్పూన్లు.
నూనె - తగినంత.

తయారు చేసే విధానం:

బెల్లాన్ని పొడి చేసి అందులో చెరకురసం వేయాలి. ఈ మిశ్రమంలో గోధుమపిండి, మైదా పిండిని వేసి కలిపితే చలిమిడిపిండిలాగా వస్తుంది. ఈ పిండి పదినిమిషాల సేపు నాననివ్వాలి. పిండి నాని మెత్తబడకముందే చేస్తే అప్పాలు పొంగవు. తీపి ఎక్కువ తినే వారు పాళ్లను కొంచెంగా మార్చుకుని చేసుకోవచ్చు.

బాణలిలో నూనె పోసి కాగిన తరువాత పిండిని కొద్దిగా చేతిలోకి తీసుకుని పలుచగా ఒత్తి నూనెలో వేయాలి. రెండువైపులా వేగనిచ్చి తీసుకోవాలి. ఇది ఆంజనేయస్వామికి ఇష్టమైన పిండి వంట.


మూలం: 13-01-09, మంగళవారం, సాక్షి, ఫ్యామిలీ.


[ వెనుకకు ]

పూర్ణాలు

కావలసిన వస్తువులు:

‌మినప్పప్పు - ఒక కప్పు.
బియ్యం - రెండు కప్పులు.
‌పచ్చిశనగపప్పు - ‌ఒక కప్పు.
‌బెల్లం - ఒక కప్పు.
పంచదార - ఒక కప్పు.
ఏలకుల పొడి - ఒక టీ స్పూను.
నెయ్యి - రెండు టీ స్పూన్లు.
నూనె - సరిపడినంత.

తయారు చేసే విధానం:

బియ్యాన్ని, మినప్పప్పును విడివిడిగా నానబెట్టాలి. మూడు గంటల తర్వాత రెండింటినీ కలిపి అందులో చిటికెడు ఉప్పు వేసి గ్రైండ్‌ చేయాలి. రుబ్బేటప్పుడు నీళ్లు ఎక్కువ కాకుండా జాగ్రత్త పడాలి. దోసెల పిండిలాగా మెత్తగా రావాలి. కాని అంత పలుచగా ఉండకూడదు. గారెల పిండికంటే కొంచెం లూజుగా ఉండేటట్లు చూడాలి. రుబ్బిన తరువాత ఈ మిశ్రమం ఒక రాత్రంతా నానాలి. పూర్ణాలు చేయడానికి ముందురోజు నుంచే ప్రిపరేషన్‌ మొదలవ్వాల్సి ఉంటుంది.

శనగపప్పును కడిగి పది నిమిషాల సేపు నానిన తర్వాత ప్రెషర్‌ కుక్కర్‌లో రెండు విజిల్స్‌ వచ్చే వరకు ఉడికించాలి. ఉడికిన పప్పులో ఉన్న నీటిని వడపోయాలి. శనగపప్పులో బెల్లం పొడి, పంచదార వేసి చిన్న మంట మీద ఉడికించాలి. బెల్లం, పంచదార ముందు కరిగి నీరవుతాయి. అవి తిరిగి దగ్గరయ్యే వరకు అడుగుకు పట్టకుండా గరిటతో తిప్పుతూ ఉడికించాలి. కొద్ది సేపటికి శనగపప్పు, బెల్లం, పంచదార అన్నీ కలిసిపోయి ముద్దయిన తరువాత దించేయాలి. దించిన తరువాత ఏలకులపొడి, నెయ్యి వేసి బాగా కలిపి ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న లడ్డూలుగా చేయాలి.

నూనె మరిగిన తరువాత ఒక్కొక్క లడ్డూను ముందు రోజు రుబ్బి సిద్ధంగా ఉంచిన మినప్పిండి మిశ్రమంలో ముంచి నూనెలో వేయాలి. పూర్ణాల తయారీలో నైపుణ్యం ఇక్కడే ఉంటుంది. లడ్డూ నలగకుండా మినప్పిండిలో ముంచి తీసి నూనెలో వేయాలి. ఇలా వేసేటప్పుడు మినప్పిండి మిశ్రమం అన్ని వైపులా సమంగా పట్టాలంటే మూడువేళ్లతో వేయాలి. ఇలా చేస్తే పూర్ణం చక్కటి రౌండ్‌లో చూడడానికి అందంగా ఉంటుంది. నూనెలో అన్ని వైపులా సమంగా వేగేటట్లు తిప్పుతూ దోరగా వేగిన తరువాత తీసుకోవాలి.


మూలం: 13-01-09, మంగళవారం, సాక్షి, ఫ్యామిలీ.


[ వెనుకకు ]

అరటికాయ చట్నీ

కావలసిన వస్తువులు:

‌అరటికాయ - ఒకటి.
పచ్చిమిర్చి - ఆరు.
చింతపండు - ‌చిన్న గోళీ అంత.
పెరుగు - ఒక టీ స్పూను.
వెల్లుల్లి - నాలుగు రేకులు.
జీలకర్ర - చిటికెడు.
నూనె - పోపు కోసం కొద్దిగా.
పోపు దినుసులు - కొద్దిగా.

తయారు చేసే విధానం:

ముందుగా చింతపండును నానబెట్టాలి. అరటికాయను చెక్కు తీసి సన్నగా తరగాలి. బాణలిలో ఒక స్పూను నూనె వేసి అరటికాయ ముక్కలు, పచ్చిమిర్చి వేయించి పక్కన పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత అందులో వెల్లుల్లి, జీలకర్ర, చింతపండు, ఉప్పు వేసి గ్రైండ్‌ చేయాలి. చివరిగా బాణలిలో ఒక స్పూను నూనె వేసి అందులో ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, పెరుగు, కొత్తిమీర వేసి చట్నీకి తాలింపు పెట్టాలి. ఇది గారెలతో పాటు అన్నంలోకి, ఇతర ఉపాహారాలకు కూడా రుచిగా ఉంటుంది.


మూలం: 13-01-09, మంగళవారం, సాక్షి, ఫ్యామిలీ.


[ వెనుకకు ]

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: