telugudanam.co.in

మా అనుబంధ వెబ్‌సైట్...

telugudukanam.co.in

కొబ్బరి

కొబ్బరి

కొబ్బరి చెట్లు కోస్తా ప్రాంతాలలోనూ, ఇసుక ప్రాంతాలలోను ఎక్కువగా పెరుగుతాయి. సారవంతం కాని నేలలో కూడా ఇవి పెరుగుతాయి. ఈ చెట్టు సుమారు 100 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. ఇవి సుమారు 100 సంవత్సరాలపాటు జీవించి వుంటాయి. 7 సంవత్సరాల వయసు రాగానే ఈ చెట్టు నెలనెలా చిగురిస్తూ, పూతపూస్తూ ఉంటుంది. భారతదేశపు సాంస్కృతిక జీవనంలో కొబ్బరి చెట్టుకు ఒక ముఖ్యమైన స్థానం ఉంది. దీనిని కల్పవృక్షం - స్వర్గానికి చెందిన చెట్టు అంటారు. ఇది మనకు కావలసిన ఆహారాన్నీ, పానీయాన్నీ, తలదాచుకునే చోటునీ, జీవితానికి కావలసిన ఇతర నిత్యావసర వస్తువులనూ ప్రసాదిస్తుంది. ఉష్ణ ప్రాంతంలో నివసించేవారికి ఇదొక శుభకరమైన చెట్టు. పూజలలో, పెళ్ళిళ్ళలో, ఇతర ఉత్సవాల సమయంలో దీనిని వాడడం జరుగుతుంది. కొబ్బరికాయలో నీరు, కండ ఉంటాయి. నీరు, కండ, గట్టితనంగల నారతో కప్పబడి ఉంటుంది. కొబ్బరి బోండాలోని నీళ్ళు చాలా పౌష్టిక గుణాలను కలిగి ఉంటాయి. దీనికి ఔషధగుణాలు కూడా ఉన్నాయి. బలహీనంగా ఉన్న వ్యక్తికి గ్లూకోజ్ దొరకనప్పుడు డ్రిప్స్‌గా కొబ్బరి నీళ్ళను ధారాళంగా వాడతారు. ఈ నీళ్ళు శరీరంలోని వేడిని తగ్గించి కావలసిన చల్లదనాన్ని ఇస్తాయి. ఇది దప్పికను కూడా తీరుస్తుంది. ఇందులో గ్లూకోజ్‌తోపాటు పొటాషియం, సోడియంలాంటి ఖనిజాలు ఉంటాయి. ఆ కారణంగా దీన్ని నెల శిశువు కూడా ఇవ్వవచ్చు. ఇది సులభంగా జీర్ణం అవుతుంది.

ఇందులో ఎలెక్ట్రోలిటిక్ ఉన్నందువల్ల తక్కువ మూత్ర విసర్జన జరుగుతున్నప్పుడు, జలోదరానికీ, మూత్ర విసర్జన ధారాలంగా జరిగేందుకూ, డయేరియా కారణంగా శరీరంలోని నీరు తగ్గిపోయినప్పుడూ, దిగ్భ్రాంతి కలిగినప్పుడూ, లేత కొబ్బరికాయ నీళ్ళను వాడవచ్చు. అతిసారం, చీము రక్తం భేదులు, శూల వల్ల కలిగే పేగుల మంటను చల్లార్చడానికి దీనిని వాడవచ్చును. హైపర్ అసిడిటి ఉన్నప్పుడు కూడా దీన్ని వాడవచ్చును. కొబ్బరి నీరు వాంతులను, తల తిరగడాన్ని ఆపుచేస్తుంది. కలరా వ్యాధికి ఇది మంచి విరుగుడు. కారణం అతిసారం భేదుల వల్ల, వాంతుల వల్ల శరీరంలో తగ్గిపోయిన పొటాషియంను శరీరానికి సరఫరా చేయగలగడమే. మూత్ర విసర్జనను ఎక్కువ చేయగలగడం వల్ల శరీరంలో ఉన్న విష పదార్ధాలను బయటకు గెంటడం వల్ల అంటురోగాల వల్ల కలిగే జ్వరాలకు ఇది వాడబడుతుంది. లేత కొబ్బరికాయ కొంత ముదిరినప్పుడు అందులో ఉన్న నీరు జెల్లీలాగా తయారవుతుంది. దీనిని "స్పూన్ కోకోనట్" అంటారు. రుచికరంగా ఉంటూ ఇది సులభంగా జీర్ణమవుతుంది. ఇందులో నూనె, పిండిపదార్ధాలు, మాంసకృత్తుల వల పేగులలో కుళ్ళిపోవడం అన్నది జరగదు. ఆ కారణంగా ఇది మెరుగైన మాంసకృత్తులతో కూడిన ఆహారంగా భావించబడుతోంది. అంతేకాదు ఇది శరీరంలో ఎలాంటి విషంతో కూడిన వస్తువును చేరనివ్వదు. ఇందులో ఉన్న మెత్తటి కండను గాయాలకు రాయవచ్చును. ఈ కండకు గాయాలను మాపే ఔషధ గుణం ఉంది.

కొబ్బరి బాగా పండిన కొబ్బరిలో నూనె ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది భేదిమందుగా, క్రిమినాశనిగా కూడా వాడబడుతుంది. నూనె కడుపులో ఉన్న యాసిడ్ల విసర్జనను అణిచిపెడుతుంది. కాబట్టి అసిడిటికి ఇది మంచి మందు. పొడిదగ్గు, ఎదనొప్పి నుండి ఇది మనిషికి ఉపశమనాన్ని కలిగిస్తుంది. కొబ్బరిని తురిమి కూరలకూ, చట్నీలకూ, తీపిపదార్ధాల తయారీకీ వాడతారు. బెల్లంతో కలిపి కొబ్బరిని తింటే మోకాళ్ళ నొప్పులు రావు. కొలెస్టెరాల్ ఎక్కువై బాధపడుతున్న వారు కొబ్బరి తినకూడదు. ఆరోగ్యానికి ఇంతగా దోహదపడే కొబ్బరంటే అందరికీ ఇష్టమే.

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం