telugudanam.co.in

మా అనుబంధ వెబ్‌సైట్...

telugudukanam.co.in

నోబెల్ బహుమతి నేపథ్య కథ

నోబెల్

స్వీడెన్‌కు చెందిన నోబెల్ బహుమతి గురించి ప్రపంచమంతటికీ తెలుసు. 1833లో స్టాక్‌హోంలో జన్మించి, 1896 డిసెంబెర్ 10న శాన్‌రెమోలో మరణించిన ఆల్ఫ్రెడ్ నోబెల్ వీలునామాను అనుసరించి "ది నోబెల్ ఫౌండేషన్" స్థాపించబడింది. 1895లో నవంబర్ 27న వ్రాసిన వీలునామా ద్వారా ఆల్ఫ్రెడ్ నోబెల్ తన యావదాస్తిని 30 మిలియన్ క్రోనార్‌లకు మించినది (19.40 క్రోనార్లకు ఒక స్టెర్లింగ్ సమానం) ఒక నిధికి చట్టపూర్వకంగా వ్రాసి ఇచ్చారు. ఈ నిధిపై వచ్చే వడ్డీని అంతకుముందు సంవత్సరాలలో మానవాళికి అత్యంత ఉపయోగకరమైన సేవలందించిన వారికి ప్రతి సంవత్సరం చెల్లించాలని ఆ శాసనంలో వ్రాశారు. ఈ వడ్డీని ఐదు సమాన భాగాలుగా విభజించి ఈ క్రింది విధంగా కేటాయించారు. ఫిజిక్స్‌లో అత్యంత ముఖ్యమైన పరిశోధనకాని, ఆవిష్కరణకాని చేసినవారికి ఒక భాగం, రసాయనిక శాస్త్రంలో పరిశోధన లేక అభివృద్ధి సాధించిన వారికి ఒక భాగం, శరీర ధర్మ శాస్త్రం లేక వైద్య శాస్త్రంలో అత్యంత ప్రాముఖ్యం గల పరిశోధన చేసిన వారికి ఒక భాగం, సారస్వత రంగంలో ఆదర్శవాద ధోరణిలో విశిష్టమైన, విలక్షణమైన రచన చేసిన వ్యక్తికి ఒక భాగం, శాంతి సంఘాలు స్థాపించి, శాంతి కోసం ఉద్యమించి, స్థానిక సైన్యాలను తగ్గించటమో, రద్దు చేయడమో చేయాలని ప్రచారం చేసి, వివిధ దేశాల మధ్య సౌభ్రాతృత్వానికి అత్యంత దోహదం చేసే ఒక భాగం ఇవ్వాలని నిర్ణయించారు.

బెర్తా వాన్ సుట్నర్ అనే మహిళ ప్రభావం వల్ల నోబెల్ శాంతి బహుమానం నెలకొల్పబడింది. ఈ గొప్ప వనిత గురించిన వివరాలు కూడా ఆసక్తి కలిగిస్తాయి. 1876లో ఫ్రాంకో-పర్షియన్ యుద్ధం ముగిసిన తరువాత నోబెల్ తనకొక స్త్రీ సహచరి కావాలని వియన్నా పత్రికలో ప్రకటించాడు. ఆయనకు వచ్చిన జవాబుల్లో ఒకటి - ఒక యువతి బెర్తా కిన్స్‌కే నుండి వచ్చింది. అనంతరం ఈమె బెర్తా వాన్ సుట్నర్‌గా ప్రఖ్యాతి చెందింది. వివాహ ఒప్పందం అనేది జరగకపోయినా వీరిద్దరి మధ్య యుద్ధ సమయంలో లక్ష్య సాధకుడు మరియు ప్రపంచ శాంతికోసం ఉద్యమించిన బెర్తా - వీరిద్దరి మధ్య ఏర్పడిన స్నేహ సంబంధం నోబెల్ జీవించి ఉన్నంత కాలం సాగిపోయింది. పట్టమహిషి సుట్నర్ ప్రభావం వల్ల మారణాయుధాల మాజీ తయారీదారుడు తన వ్యక్తిగత అభిరుచులకు విరుద్ధంగా ప్రపంచ శాంతి సిద్ధాంతం కోసం పోరాడే యోధుడై, తన యావదాస్తిని 33,000,000 క్రౌన్లకు పైగా మానవాళి సంక్షేమ కార్యకలాపాలకు వినియోగింపజేశాడు. 1986 డిసెంబర్ 10న నోబెల్ మరణించాడు. అతని అపార సంపదపై వచ్చే వడ్డీని ఫిజిక్స్, కెమిస్ట్రీ, వైద్యం, సారస్వతం, విశ్వశాంతి రంగాలలో అత్యున్నత పరిశోధన, సేవలు చేసినవారికి అందించమని వ్రాసిన వీలునామా చదివి ప్రపంచం ఆశ్చర్యపరవశమైంది. 1905లో బెర్తా వాన్ సుట్నర్‌కు నోబెల్ శాంతి బహుమతి ప్రకటించారు. ఈ గౌరవానికే కాక మరింత గొప్ప గౌరవానికి కూడా ఆమె పాత్రురాలయ్యింది. ఆమె తన జీవితాన్నంతా ప్రపంచ శాంతి కోసం ధారపోయటమేకాక ఆల్ఫ్రెడ్ నోబెల్‌ను కూడా ఒప్పించగలిగింది. తత్ఫలితంగా ఏర్పడిందే ఘనత వహించిన "నోబెల్ బహుమతుల సంస్థ".

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం