telugudanam.co.in

      telugudanam.co.in

   

మీకు తెలుసా

[ వెనుకకు ] [ ముందుకు ]


తారాజువ్వ ఆకాశంలోకి ఎలా వెళ్తుంది?

దీపావళి రాకెట్‌లో (తారాజువ్వ) అసలు భాగం తోక దగ్గర వత్తిలో వుండే ఓ చిన్న అట్ట గొట్టం లాంటి నిర్మాణమేనని మీకు తెలుసు కదా. ఈ అట్టగొట్టాన్ని ఒక చివర పూర్తిగా మూసేసి, దాని నిండా మందుగుండును కూరుతారు. రెండో చివరను మూసేసే ముందుగా మందుగుండులోకి దారంతోచేసిన ఓ సన్నని వత్తిని జొనిపి, ఆ వత్తి రెండో కొస అట్టగొట్టం వెలుపలి భాగంలో ఉండేలా చూస్తారు. ఇలా మందుగుండు కూరి తయారు చేసిన ఈ అట్టగొట్టాన్ని చివరగా ఓ పొడవాటి పుల్ల కొసన బిగిస్తారు. ఇలా బిగించేటప్పుడు పుల్ల మిగిలే వైపునే మందుగుండు గొట్టం తోక భాగం (వత్తివున్న భాగం) వుండేలా చూస్తారు. దీంతో తారాజువ్వ తయారైపోతుంది.

తారాజువ్వలో వత్తి భాగాన్ని మనం వెలిగించగానే అది మండుకుంటూవెళ్ళి, లోపల ఉన్న మందుగుండుకు అంటుకుంటుంది. దాంతో మందుగుండు వేగంగా మండడం మొదలుపెట్టి పెద్ద మొత్తంలో వాయువుల్ని విడుదల చేస్తుంది. అట్టగొట్టంలో ఆ వాయువులకు చోటు చాలనందున అవి వేగంగా వత్తి వున్న భాగం నుంచి బయటకు తోసుకొస్తాయి. దాంతో ప్రతి ' చర్య ' కు సమానంగానూ, వ్యతిరేక దిశలోనూ పనిచేసే ఒక ' ప్రతిచర్య ' చోటుచేసుకుంటుందన్న న్యూటన్‌ చలన సూత్రం ప్రకారం, వత్తికి వ్యతిరేక దిశలో తారాజువ్వ వేగంగా దూసుకుపోతుంది. ఇదంతా సరే. ఇందులో పుల్ల చేసే పనేమిటి అన్నదే కదా మన ప్రశ్న. ఒక బెలూన్‌ నిండా గాలిని వూది, దానిని ఉన్నట్టుండి వదిలేస్తే అది గాలిలో అడ్డదిడ్డంగా ఎలా తిరుగుతుందో మీరెప్పుడైనా గమనించారా! ఒకవేళ దీపావళి రాకెట్‌కి పుల్ల లేకపోయినట్లయితే అచ్చం అది కూడా అలాగే తిరుగుతుంది. అంటే ఒక కచ్చితమైన దిశ అంటూ లేకుండా ఎటుపడితే అటు వెళ్ళి పోతుందన్న మాట. అది అలా వెళ్ళకుండా ఒక నిర్ధిష్టమైన దిశలో తిన్నగా వెళ్ళేందుకే తారాజువ్వలో పుల్లని ఏర్పాటు చేస్తారు. తారాజువ్వను, మాట్టిలోగాని, లేదా ఇంకేదైనా వస్తువులోగాని నిలబెట్టేందుకు కూడా ఈ పుల్ల ఉపయోగపడుతుందన్న సంగతి మీకు తెలిసిందే కదా. అన్నట్లు ఓ మామూలు బెలూన్‌ని కూడా ఏ చీపురు పుల్ల లాంటి దానికో బిగించి, దాన్లోకి గాలి వూది వదిలిపెట్టినప్పుడు అది కూడా రాకెట్‌లాగే తిన్నగా వెళుతుంది!


మూలం : 22-Oct-08, బుధవారం, సాక్షి (ఫ్యామిలీ).


సూర్యుడు పాలపుంత చుట్టూ పరిభ్రమిస్తున్నాడా?

భూమి సూర్యుని చుట్టూ ఒక చుట్టు చుట్టి రావడానికి 365 1/4 రోజుల సమయం పడుతుంది. కొన్ని గ్రహాలు ఇంతకన్నా చాలా తక్కువ కాలంలోనే తమ పరిభ్రమణాన్ని పూర్తి చేస్తే, యురేనస్‌, నెఫ్ట్యూన్‌ వంటి సుదూరంగా ఉన్న గ్రహాలు సూర్యుని చుట్టూ ఒకో పరిభ్రమణాన్ని పూర్తి చేయడానికి కొన్ని వందల సంవత్సరాలసమయం తీసుకుంటాయి. కాని సూర్యుడి విషయం అలాకాదు.

సూర్యుడు పాలపుంత ( మిల్కీ వే ) అనే, 20 వేల కోట్లకు పైగా నక్షత్రాలతో కూడిన ఒక బ్రహ్మాండమైన నక్షత్రమండలం వెలుపలి భాగంలో ఉన్న ఒక నక్షత్రం. ఈ నక్షత్ర మండలపు మధ్యలోని భాగాన్ని 'గ్యాలాక్టిక్‌ సెంటర్‌' అని అంటారు. మన సూర్యుడితో సహా పాలపుంతలోని నక్షత్రాలన్నీ ఈ మండలం చుట్టూ తిరుగుతుంటాయి. మన సూర్యుడు సెకనుకు 220 కిలోమీటర్ల ప్రచండవేగంతో ఈ మండలం చుట్టూ తిరుగుతున్నాడు. అయితే గ్యాలాక్టిక్‌ సెంటర్‌కి సూర్యునికి మధ్య సుమారు 25,000 నుంచి 28,000 కాంతి సంవత్సరాల దూరం ఉండటం వల్ల (సెకనుకు 3,00,000 కి. మీ. వేగంతో కాంతి ఒక సంవత్సరంలో ప్రయాణించే దూరాన్ని ఒక కాంతి సంవత్సరం అంటారు. ఇది కాలానికి సంబంధించిన కొలమానం అని గుర్తుంచుకోవాలి) సూర్యుడు తానున్న పాలపుంత చుట్టూ ఒక పరిభ్రమణాన్ని పూర్తి చేసేందుకు 22.5 నుంచి 25 కోట్ల సంవత్సరాల సమయాన్ని తీసుకుంటాడు. ఆశ్చర్యంగా ఉంది కదూ. ఏదేమైనా భూమి సూర్యుడి చుట్టూ ఓసారి తిరగడానికి పట్టే కాలాన్ని సంవత్సరం అంటే, మన సూర్యుడు ( మొత్తం సౌరమండలం ) పాలపుంత చుట్టూ ఓసారి తిరగడానికి పట్టే కాలాన్ని 'గ్యాలాక్టిక్‌ సంవత్సరం' అని అంటారు.


మూలం : 16-Feb-09, సోమవారం, సాక్షి (ఫ్యామిలీ).


లేని నక్షత్రాలు కూడా కనిపిస్తున్నాయా?

ఒక వస్తువు నుంచి బయలు దేరిన కాంతిగాని, లేదా ఒక వస్తువుపైన పడి పరావర్తనం చెందిన కాంతి గాని మన కంటిని చేరినపుడు మాత్రమే మనం ఆ వస్తువును చూడగల్గుతాం. మన చుట్టూ వుండే చిన్నచిన్న వస్తువులతో పాటు సుదూరంగా వున్న చంద్రుడు, సూర్యుడు, గ్రహాలు, తోకచుక్కలు, నక్షత్రాలు, నక్షత్ర మండలాలు వంటి వాటికి కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది.

కాంతి సెకనుకి 3,00,000 కి. మీల వేగంతో ప్రయాణిస్తుంది. మనకు అతి దగ్గరి నక్షత్రమైన సూర్యుడు సుమారు 14 కోట్ల కి .మీల దూరంలో ఉన్నాడు. అంత దూరం నుంచి సూర్యకిరణాలు మన భూమిని చేరడానికి కనీసం '8' నిమిషాలు సమయం పడుతుంది (ఆయా ఋతువులనుబట్టి ఇది మరికొన్ని సెకన్లు ఎక్కువగా వుంటుంది). అంటే ఈ క్షణం మనం చూసే సూర్యబింబం '8' నిమిషాల కిందటిది. అలాగే సౌర మండలానికి అతి దగ్గరి నక్షత్రమైన ఆల్ఫా సెంటారి నుంచి కాంతి కిరణాలు భూమిని చేరడానికి 4.3 సంవత్సరాలు పడుతుంది. అంటే ఈ రోజు మనం చూస్తున్నఆల్ఫాసెంటారి దూరం నిజానికి 4.3 సంవత్సరాల కిందటిదన్న మాట. ఒకవేళ ఆ నక్షత్రం ఇప్పుడు ఉన్నట్టుండి, అంతరించిపోయినట్లయితే ఆ సంగతి మనకు మరో 4.3 సంవత్సరాల తరువాత గాని తెలియదన్న మాట.

ఈనాడు మన కంటికి కనిపిస్తున్న కోట్లాది నక్షత్రాలలో కొన్ని... కొన్ని వేల కాంతి సంవత్సరాల దూరంలో ఉంటే, మరి కొన్ని, కొన్ని లక్షల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నాయి. అంటే ఆయా నక్షత్రాల నుంచి కొన్ని వేల సంవత్సరాల క్రితం, కొన్ని లక్షల సంవత్సరాల క్రితం బయలుదేరిన కాంతి కిరణాలు ఈ రోజు మన కంటిని తాకుతున్నాయన్నమాట. వాటిలో ఎన్నో నక్షత్రాలు ఎప్పుడో అంతరించిపోయి వుండవచ్చు. అయినా అప్పుడే బయలుదేరిన వాటి కాంతి కిరణాలు ఇప్పుడు మన కంటిని చేరడం వలన అవి ఇంకా ఉన్నట్లుగానే కన్పిస్తున్నాయి. ఒక లక్ష కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న నక్షత్రం ఈ రోజు అంతరించిపోయినా, మరో లక్ష సంవత్సరాల దాకా అది ఉన్నట్లుగానే మనకు కన్పిస్తుంది. కాబట్టి నేడు మనకు కన్పిస్తున్న నక్షత్రాల్లో ఇప్పుడున్నవే గాక ఎప్పుడో అంతరించిపోయినవీ లెక్కలేనన్ని ఉన్నాయి.


మూలం : 14-Mar-09, శనివారం, సాక్షి (ఫ్యామిలీ).


దుమ్ము వల్ల మేలు జరుగుతుందా?

సాధారణంగా దుమ్ము, ధూళి కణాల వల్ల మన ఆరోగ్యానికి కీడే జరుగుతుంది గాని మేలు జరుగదు. కాని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి, ఒక ఖండం నుంచి మరోక ఖండానికి వివిధ రకాల పవనాల ద్వారా తీసుకుని పోబడే టన్నుల కొద్దీ దుమ్ము, ధూళి కణాల వల్ల ఆయా ప్రాంతాల్లోని మహారణ్యాలకు అపారమైన మేలు జరుగుతుందని ఇటీవల జరిపిన పరిశోధనల్లో కనుగొన్నారు. ఆ దుమ్ముతో పాటు వచ్చే టన్నుల కొద్దీ ఖనిజలవణాలే ఇందుకు కారణమని కూడా తేల్చారు.

ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి గాలి ద్వారా వచ్చే కొన్ని లక్షల టన్నుల ధూళి అనేక దేశాలపై ప్రతి ఏటా వెదజల్లబడుతోంది. దీని మూలంగా కొన్ని అనర్ధాలు చోటు చేసుకున్నప్పటికీ మొత్తంగా చూస్తే ఆయా దేశాల్లోని అడవులకు, తోవలకు చాలా ప్రయోజనం చేకూరుతుది. ఉదాహరణకు సహారా ఎడారి మధ్యలో ఉన్న 'చాద్‌' అనే దేశం చుట్టూ ఉన్న పర్వత ప్రాంతాల నుంచి ప్రతి ఏడూ కొన్ని లక్షల టన్నుల దుమ్ము, ధూళి, సన్నని ఇసుక రేణువులు పవనాల ద్వారా అట్లాంటిక్‌ మహా సముద్రం మీదుగా ప్రయాణించి, దక్షిణ అమెరికాలోని అమెజాన్‌ అటవీ ప్రాంతంలో పడుతోంది. దీని ఫలితంగా ఏటా సుమారు 5 కోట్ల టన్నుల ఖనిజ లవణాలు ఆ అడవులకు లభిస్తున్నాయి. వాటి సాయంతో అక్కడి చెట్లు ఎంతో పుష్టిగా ఉండగలుగుతున్నాయి.

ఇలా గాలి ద్వారా ఒక చోటి నుంచి మరో చోటికి పెద్ద ఎత్తున ఖనిజ లవణాలు రవాణా కావడం, అవి ఆయా ప్రదేశాలలోని అడవులకు ఉపయోగపడటం అనేది ఈ భూగోళంపై బహుశా కొన్ని లక్షల సంవత్సరాల నుంచీ జరుగుతుండవచ్చునని శాస్త్రజ్ఞులు అంచనా వేస్తున్నారు.


మూలం : 23-10-08, గురువారం, సాక్షి, ఫ్యామిలి.

[ వెనుకకు ] [ ముందుకు ]

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: