telugudanam.co.in

      telugudanam.co.in

   

నాణేలు

భారతీయ చరిత్రలో కనిపించే కొన్ని నిశ్శబ్దాలను నాణేలు చేదించాయి కాని, నాణేలకు సంబంధించిన కొన్ని రహస్యాలు మాత్రం ఇప్పటికీ అంతుపట్టకుండా ఉన్నాయి. అవి సామ్రాజ్యాలు విడుదల చేసిన నాణేలు కావచ్చు, జనపదాలలో చెలామణీ అయిన నాణేలైన కావచ్చు, అవి ఏవైనా, తొలి యుగాలకు చెందిన మన నాణేలపై పాలకుల పేర్లేమీ కనపడవు. బంగారం నుంచి వెండికి, తరువాత సీసానికి పరిణామం చెందుతూ లోహ వినియోగంలో జరిగిన సాంకేతిక, పదార్థపరమైన మార్పులను కూడా నాణేలు సూచిస్తాయి. అయినా చరిత్రలో వాటి చిరునామా ఇప్పటికీ దొరకడం లేదు. ఎన్నో చిత్ర విచిత్రమైన ముద్రలు, ముద్రలలో ముచ్చటైన కళాదృష్టి, కాని వాటి ఆంతర్యం మాత్రం తెలియదు. అయితే దొరికిన అన్ని నాణేల పరిస్థితి ఇది కాదు. రాజుల చిత్తరువులు, వంశ నామవళులు రాసిన నాణేలు కూడా ఉన్నాయి, కాని, వీటి దగ్గరకు వెళ్ళే ముందు నాణేలు గురించి ఇంకొక పెద్ద ప్రశ్న వేసుకోవాలి. అదే - ఈ నాణేలు పుట్టింది ఎప్పుడు? అని.

భారత్ వలెనే ఎంతో పురాతన చరిత్ర కలిగిన దేశాలు గ్రీస్, చైనా, రోమ్, మొదలైనవి. గ్రీకులు, చైనీయులు క్రీస్తుపూర్వం ఏడవ శతాబ్ధంలో నాణేలు విడుదల చేసుకున్నారని స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. రోమన్లు, పర్షియన్లు క్రీస్తుపూర్వం ఆరవ శతాబ్దంలో నాణేలను చెలామణీలోకి తెచ్చారని కూడ నిర్దిష్టమైన ఆధారాలు ఉణ్ణాయి. అయితే భారతదేశ నాణేల చరిత్రకు ఇలాంటి విస్పష్టమైన ఆధారలేమీ లేవు. ఇక్కడ నాణేలు ఎప్పటి నుంచి చెలామణీ అవుతున్నాయనే సంగతి ఇప్పటికీ ఒక పెద్ద ప్రశ్నగానే మిగిలి ఉంది.

క్రీస్తుపూర్వం 1000 సంవత్సరం నుంచి భారతదేశంలో నాణేలు చెలామణిలో ఉన్నాయని కన్నింగ్‌హామ్ అభిప్రాయం. జె.క్రిబ్ అనే మరో పురావస్తు శస్త్రవేత్త అభిప్రాయం ప్రకారం ఇక్కడ క్రీస్తుపూర్వం 350 సంవత్సరం కంటే ముందే నాణేలను వినియోగించారు. మనదేశంలో క్రీస్తుపూర్వం 6-7 శతాబ్దాలలో, లేదా అంతకంటే కొంచెం ముందు నాణేలు తయారై ఉండవచ్చునని పి ఎల్ గుప్తాతో పాటు, అధిక సంఖ్యలో చరిత్రకారులు ప్రతిపాదిస్తున్నారు. ఇంత వివాదానికి కారణం తొలినాటి నాణేల మీద పాలకుల వివరాలు లేవు. నాణేలు తమ సంగతి తాము చెప్పలేనపుడు వాటి ఆచూకీ తెలుసుకోవడానికి ఉపయోగపడేవి సాహిత్య, పురావస్తు ఆధారాలే. క్రీస్తుశకం ఒకటవ శతాబ్దానికి చెందినట్టు భావించే పాణిని తన అష్టాధ్యాయి గ్రంధంలో నాణేల ప్రస్తావన తెచ్చాడు. క్రీస్తుశకం నాల్గవ శతాబ్దం వాడైన కౌటిల్యుడు అర్థశాస్త్రంలో దొంగనాణేలను గురించి, సీసం గనుల గురించి ప్రస్తావించాడు. కాబట్టి దేశంలో పంచ్‌మార్క్‌డ్ నాణేలు నాల్గవ శతాబ్దానికే చెలామణీలో ఉన్నట్టే. లేదంటే కొంచెం ముందు నుంచి ఉండవచ్చు. ఇది అందరూ అంగీకరిస్తున్న చారిత్రక సత్యం.అయితే ఎవరు విడుదల చేశారో చెప్పడానికి ఆధారాలు లేవు. మన కృష్ణాజిల్లా సింగవరంలో లభ్యమైన వెండి నాణేల పరిస్థితి కూడా ఇదే.

నాణేల మీద పుంఖానువుంఖాలుగా ముద్రలు కనిపిస్తున్నాయి. ఇవన్నీ వేర్వేరు రాజులవని చెప్పడానికి వీలులేదు. ఎందుకంటే నాణేం మీద గుర్తు మారినంత మాత్రాన పాలకుడు మారిపోయాడని చెప్పలేమని చరిత్రకారులు చెబుతున్నారు. జనపదాలలో స్థానిక పాలకుల నాణేలతో పాటు, సామ్రాజ్యాలు విడుదల చేసిన నాణేలు కూడా బయల్పడినాయి. ఆంధ్రజనపదమే ఇందుకు గొప్ప ఉదాహరణ. అమరావతిలో దొరికిన 7668 నాణేలలో కనిపించిన రకాలు దేశంలో ఇంకెక్కడా కనిపించక పోవడానికి కారణం ఏమిటి? ఈ వెండి పంచ్‌మార్క్‌డ్ నాణేలలో 235 రకాలను కనుగొన్నారు. ఇందులో 48 రకాలు మరెక్కడా బయల్పడలేదు. పి ఎల్ గుప్తాయే వీటి గురించి పరిశోధించారు. పరిష్కారమైన సమస్యల కంటె పరిష్కారం కాని ప్రశ్నలే ఇందులో ఎక్కువ. మరో లోపం - నాణేలను ఇంతకాలం భూగర్భంలో దాచిపెట్టిన కుండలు కాలాన్ని చెప్పగలవు. ాని ఆ ప్రయత్నం కూడా చాలాసార్లు విఫలమైంది. ఆ కుండలు మిగలడం లేదు. ఇందుకు బీహార్‌లో పైలా అనే చోట దొరికిన నిధి మాత్రమే మినహాయింపు. అక్కడ దొరికిన నాణేల కాలాన్ని శాస్త్రీయ పద్థతిలో నిర్థారించగలిగారు. కాని ఎక్కువ చోట్ల అది సాధ్యం కావడం లేదు. దాంతో శాస్త్రీయ పద్ధతులతో అవకాశాన్ని అలా జారవిడుచుకోవలసి వస్తున్నది. నాణేలలో కార్బన్ ఉంటుందా, కార్బన్ పరీక్ష జరిపి కాలాన్ని నిర్ధారించవచ్చా? అంటే ఈ అవకాశాలు కూడా చాలా తక్కువగానే ఉన్నాయి.

ఎందుకంటే ఒకసారి కార్బన్ పరీక్ష జరపాలంటే ఒక మిల్లీగ్రాము పదార్ధమైనా కావాలి. అంటే కొన్ని నాణేలనైనా త్యాగం చేయవలసి ఉంటుంది. కాబట్టి దీనికి ఎవరూ సాహసించడం లేదు. నాణేల కాలం తెలియవచ్చేమో కాని నాణేలు మాత్రం కరిగిపోతాయి. కాబట్టే భారతదేశంలో నాణేలు ఎప్పటి నుంచి చెలామణీ అవుతున్నాయో ఇప్పటికీ చిక్కువీడని ప్రశ్నేగానే ఉండిపోయింది.


డా.డి.రాజారెడ్డి,

ఆంధ్ర జ్యోతి సౌజన్యంతో

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: