telugudanam.co.in

      telugudanam.co.in

   

వలస పక్షులు

నేస్తాలూ! మనం అప్పుడప్పుడు అమ్మానాన్నతో కలిసి బజారుకెళ్తుంటాం కదా. అక్కడ రకరకాల బొమ్మలు వున్న షాపు ఏదైనా కనిపిచిందనుకోండి. మనం ఆ బొమ్మల్నే చూస్తూ నిలబడిపోయారనుకోండి. తర్వాత చూస్తే పక్కన మీ వాళ్లు ఎవరూ లేరు. అప్పుడు మీరేం చేస్తారు? అక్కడినుండి ఇంటికెలా వెళ్లాలో తెలిస్తే సరే. తెలియకపోతే చాలా భయమేస్తుంది. ఏడుపు కూడా వస్తుంది కదూ. అవతల మీవాళ్ల పరిస్ధితీ అంతే. తప్పిపోయిన మీకోసం వాళ్లంతా వెతుకుతుంటారు. బజారుకెళ్లి ఒక్కళ్లమే తిరిగి రావడానికి మనం చాలా ప్రయాసపడతాం. మన వాళ్లనూ కంగారుపెడతాం. కానీ కేజీ బరువు కూడా లేని పక్షులకు ఇలాంటి బాధల్లేవు. అవి ఎవరి సాయం లేకుండానే దేశదేశాలు దాటి వెళ్తాయి. వెళ్లడమే కాదు. క్షేమంగా వెనక్కి తిరిగి వస్తాయి. మునుపు కట్టుకున్న గూటిలోనే కాపురం పెడతాయి. ఈ పక్షులు ఖండాంతరాల్లో పెట్టిన గుడ్ల నుండి బయటికొచ్చిన పిల్లలు అంతకు ముందెప్పుడూ చూడని తమ స్వస్ధలాలకు క్షేమంగా చేరతాయి. విచిత్రంగా వుంది కదూ. కానీ ఇది నిజం. వాతావరణ పరిస్ధితులు పక్షుల్ని వలస బాట పట్టించాయి. ఆ వలస పక్షులకు కొన్ని ప్రత్యేకతలను ఆపాదించింది. వాటిని అర్ధం చేసుకోవడానికి మానవుడు ప్రయత్నించాడు. కొన్నిటికి కారణాలు కనుక్కోగలిగినా జవాబు దొరకని ప్రశ్నలు మిగిలే ఉన్నాయి. ఇంతకీ పక్షుల వలసల్లోని వింతల్ని, విశేషాల్ని తెల్సుకుందామా!

పక్షులు ఋతువులను బట్టి తమ నివాస ప్రదేశాలను మార్చుతుంటాయి! భూమధ్య రేఖ దగ్గర్లో వేడి ఎక్కువగా ఉంటుంది. ధృవాల దగ్గరకు వెళ్లే కొద్దీ చలి పెరుగుతుంది. పక్షులు ఎక్కువ వేడిని భరించలేవు. అలాగే ఎక్కువ చలిని భరించలేవు. అందువల్ల శీతల ప్రాంత పక్షులు వేడి ప్రాంతాలకూ, వేడి ప్రాంతాల్లోని పక్షులు చలి ప్రదేశాలకూ ఎగిరిపోతుంటాయి. అలాగే ఒకే ప్రాంతాల్లో కూడా అన్ని రకాల పక్షులు ఒకేసారి కనిపించవు. చెట్లు చిగురించే కాలంలో కోయిలలు వస్తాయి. కానీ తరువాత అవి కనిపించవు. ఇక కాకీ, గద్ద, పావురాళ్లు మాత్రం నిత్యం కనిపిస్తూనే ఉంటాయి! మన దృష్టిలో ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి వెళ్లడమంటే ఊరు వెళ్లి, రావడమే. కానీ పక్షులకు మాత్రం ఆ ప్రయాణం ఖండాలను దాటే ప్రయాణమే! పక్షుల ప్రయాణానికి సంబంధించి శాస్త్రవేత్తలు ఎన్నో ప్రయోగాలు నిర్వహించారు. వాటివల్ల చాలా విషయాలు తెలిశాయి.

కొన్ని పక్షులు రెండు రోజులపాటు నిర్విరామంగా ఎగిరి 2,500 మైళ్లు ప్రయాణించాయి. అలా రెండు రోజులపాటు ఆగకుండా ఎగరడానికి అవి తీసుకున్న ఆహారం కేవలం రెండు ఔన్సులు మాత్రమే! అవి గంటకు 50మైళ్ల వేగంతో ఇంగ్లాండు నుండి దక్షిణ అమెరికా చేరాయి. ఈ వలస పక్షులు బయల్దేరే సమయమొస్తే ఎవరో పిలిచినట్టు ఎక్కడెక్కడున్నా అన్నీ ఒకేసారి బయల్దేరతాయి! ఆకాశంలో చాలా ఎత్తులో ఎగురుతూ వెళ్తాయి. కొత్త ప్రదేశం చేరిన తర్వాత మళ్లీ గూళ్లు కట్టుకుంటాయి. అనుకూల కాలం రాగానే మళ్లీ ఎవరో చెప్పినట్టు అన్నీ ఒకేసారిగా బయల్దేరి తమ పాత ప్రాంతాలకు వచ్చేస్తాయి. వచ్చి, మళ్లీ తమ పాత గూళ్లకే వెళ్లిపోతాయి! అసలు ఈ పక్షులకు విదేశాల దారి ఎవరు చూపిస్తారు? ఋతువులు మార్పు గురించి వాటికెలా తెలుసు? అన్నీ కలిసి వెళ్లడం, రావడం అది దారి తప్పకుండా ఇదెలా సాధ్యం?

అంత బుల్లి బుల్లి పక్షులు ఇవన్నీ ఎలా చేయగలుగుతున్నాయి? అనే ప్రశ్నలకు ఇంతవరకు జవాబు దొరకలేదు. మరో అద్భుతం ఏంటంటే చలి ప్రాంతం నుండి ఎగిరి వెళ్లిన పక్షులు వేడి ప్రదేశాల్లో గుడ్లు పెడ్తాయి. వాటిని పొదిగి, పిల్లల్ని చేస్తాయి. ఈ పిల్లలు ఒక్కోసారి పెద్దవాటికంటే ముందే ప్రయాణం మొదలుపెడతాయి. ఎవరో దారి చూపిస్తున్నట్లుగా అవి తిన్నగా తమ మాతృదేశానికి బయల్దేరతాయి. ఎద్ద పక్షులు వచ్చేలోగానే ఈ పిల్ల పక్షులు గూడు చేరతాయి!

విచిత్రంగా వుంది కదూ. ఇలాంటి చిత్రవిచిత్రాలు జీవకాలంలో బోలెడన్ని ఉన్నాయి.


మూలం : ప్రజాశక్తి అనే వెబ్ సైట్ లోనిది.

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: