telugudanam.co.in

      telugudanam.co.in

   

వివేకానందుడు - చికాగో చిరస్మరణీయత

వివేకానందుడు

1893 సెప్టెంబర్ 11వ తేది - పశ్చిమ దేశాలతో ముఖ్యంగా అమెరికాతో ఇండియా యొక్క సాంస్కృతిక బంధంలో ఒక కొత్త ఘట్టానికి ప్రారంభ చిహ్నంగా నిలుస్తుంది. ఆరోజు చికాగో (అమెరికా)లోని పార్లమెంట్ ఆఫ్ రెలిజియన్స్‌లో జరిగిన సమావేశానికి ప్రపంచమంతటి నుండీ ఖ్యాతినొందిన ప్రతినిధులు హాజరయ్యారు. వారిలో 30 సంవత్సరాల వయసుగల భారతీయుడు శ్రీరామకృష్ణుని శిష్యుడు అయిన స్వామి వివేకానంద ఉన్నారు. పసుపు రంగు దుస్తులు ధరించిన వివేకానంద తన పేరుతోసహా అన్ని భౌతిక సంపదలను పరిత్యజించారు. కేవలం సన్యాసి చిహ్నాలు, భగవద్గీత మరియు థామస్ ఏ. కెంపిస్ రచించిన "ది ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్" అనే రెండు గ్ర్రంధాలు తప్ప స్వంతమనేదేదీ లేకుండా సర్వం విసర్జించారు. ఇండియాలో ఆయన తన దేశీయులు అనుభవిస్తున్న దుర్భర దారిద్ర్యాన్ని, వేదనను పూర్తిగా అవగతం చేసుకుని వారి జీవితాలలో స్వచ్చందంగా, సంపూర్తిగా తాను కూడా భాగం పంచుకున్నారు.

భారతదేశపు ఆధ్యాత్మిక వారసత్వమనే గొప్ప సంపదను పాశ్చాత్య ప్రపంచానికి వెల్లడించి భారత సామాన్య ప్రజానీకపు భౌతిక జీవిత అభివృద్ధికి అమెరికా ప్రజల సహాయాన్ని కోరేందుకు ఆయన చికాగో అరుదెంచారు. ప్రారంభ సమావేశం రోజున ఆయన హిందూ మత ప్రతినిధిగా వేదికను అలంకరించారు. అప్పుడు అమెరికా, వారి మనస్సులలో హిందూ మతం అంటే ఒక మూఢ నమ్మకాల అంధకారమనే అభిప్రాయం ఉండేది. గొప్ప ఆడంబరంతో, వైభవంతో కూడిన దృశ్యం నేపథ్యంలో విదేశీ శ్రోతల ముందు నిల్చి తన స్వంత భాష కాని భాషలో మాట్లాడవలసి రావడం, తన నేపథ్యమేమిటో తెలియని శ్రోతల ముందు ప్రసంగించవలసి రావటం స్వామి వివేకానందుని వంతయింది. ఆరోజు సమావేశం ముగియబోతున్న సమయంలో ఆయన లేచి నిలబడ్డారు. "అమెరికాకు చెందిన సోదర సోదరీమణులారా!" అనే ఉద్వేగపూరిత సంబోధన శ్రోతలలో మహత్తరమైన ప్రతిస్పందన కలిగించింది. అప్పుడు వేలాది స్త్రీ పురుషులు ఐచ్చికంగా లేచి నిలబడి కొన్ని నిముషాలపాటు గట్టిగా హర్షధ్వానాలు చేసారు. ఆ కొద్ది నిముషాలలోనే వివేకానందుడు తనను తాను స్థాపించుకున్నారు.

ఆయన చేసిన ఒకే ఒక చిన్న ఉపన్యాసం పూర్తిగా మరుగులో ఉన్న ఆయనను ప్రపంచం జయధ్వనులతో స్వాగతమిచ్చేటట్లు పైకెత్తివేసింది. అమెరికాయే కాక ఇతర యూరోపియన్ పత్రికల ద్వారా ఆయన ఉపన్యాసం బహుళంగా వ్యాప్తి చెందటం జరిగింది. "చికాగో ప్రసంగం" ఇంగ్లీషులో కేవలం 500 పదాలు గలది మాత్రమే. అనేక దేశాల శరణార్ధులకు, బాధితులకు ఆశ్రయమిచ్చి కాపాడిన దేశానికి చెందిన వాడినని ఆయన చెప్పారు. మూఢభక్తికి మరణ గంట మ్రోగిందని ఆయన ఆశాభావం వెలిబుచ్చి, కత్తితోకాని, కలంతోకాని చేసే అత్యాచారాలన్నీ సమాప్తి చెందుతాయని చెప్పారు. 3000 ఏళ్ల నాటి వేదమంత్రాలను అనువదించి చదివారు. గీత నుండి కొన్ని పదాలను ఉదహరించారు. నాలుగు రోజుల తరువాత మరోసారి ఆయన పార్లమెంట్ ఆఫ్ రెలిజియన్స్‌ను ఉద్దేశించి ప్రసంగించారు. క్లుప్తంగా "మనం ఎందుకు ఏకీభవించలేకపోతున్నాము?" అనే అంశంపై ప్రసంగించారు. సామెతల్లోని కప్ప మాదిరిగా వివిధ మతాలకు చెందిన మనుషులు తమ చిన్న బావి మాత్రమే ఈ విశాల ప్రపంచమని నమ్ముతున్నారు. సెప్టెంబర్ 19న ఆయన ఒక సుదీర్ఘ వ్యాసం హిందూ మతం మీద చదివారు. ఇది ఒక బుద్ధి సూక్ష్మత గల వివరణ. 17 రోజులపాటు జరిగిన ఈ సమావేశాలలో ఆయన 12 సార్లు ఉపన్యసించారు. ఒక సందర్భంలో మాట్లాడుతూ ఆయన నేడు అత్యావశ్యకమైనది రొట్టె అని చెప్పి ఆకలితో అల్లాడుతున్న ప్రజలకు మతాన్ని బోధించడం వారిని అవమానపర్చటమేనన్నారు. ఆనాటి యావత్ మఠాధిపతులపైన ఆయన సాధించిన అద్భుత విజయానికి కారణం ఆయన సూచించిన ప్రశాంతమైన విశ్వజనీనతత్వం.

అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ఆయన ఉపన్యాస పర్యటన చేసినప్పుడు ఆయన కీర్తి ప్రతిష్టలు గడించారు. 12 నెలల కాలంలో ఆయన అమెరికాలోని దాదాపు ప్రతి ప్రధాన నగరాన్నీ దర్శించారు. ఆయన సందేశ సారాన్ని గ్రహించేందుకు స్త్రీ పురుషులతో కూడిన ఒక సంఘం ఆయనను పరివేష్టించింది. ఒక వారంలో ఆయన చేసిన బహిరంగ ఉపన్యాసాలు తరచుగా పన్నెండుకాని, ఇంకా ఎక్కువకాని ఉండేవి. స్వామీజీ వెలిబుచ్చిన ప్రతి తలంపు ఒక మోహం కాగా ప్రతి మాట ఒక మత విశ్వాం అయింది. ఆయన ప్రతి ఉపన్యాసం ఆశువుగా సాగే వాగ్ధోరణిగల ప్రవాహం. సెయింట్ లారెన్స్ నదిలోని పెద్ద దీవి అయిన థౌజండ్ ఐలండ్ పార్క్‌లో జలం, అటవీ ప్రదేశంలో ఆయన అందమైన పరిసరాల్లో భారత్ ఆశ్రమాన్ని స్థాపించారు. ఈ ఆశ్రమం విలియం జేంస్ వంటి వేదాంతితో సహా అనేకమంది ప్రసిద్ధ అమెరికన్లను ఆకర్షించింది. కాలం గడుస్తున్నకొద్దీ ఆయన శిష్య బృందం త్వరితగతిని వృద్ధి చెందసాగారు. ఆయన పలుకుబడి భక్తుల పరిధిని దాటి వ్యాప్తి చెందింది. స్వామి వివేకానందుని వల్ల భారతీయ ఆధ్యాత్మిక ఆలోచనా విధానం అమెరికాలోని ఒక ప్రాణం గల శక్తిగా ప్రవేశించింది.

భారతదేశానికి చెందిన ఒక గొప్ప జాతీయ రూపం స్వామి వివేకానంద. ఆయన ఉపన్యాసాలు ఆఖరయ్యేవరకూ ప్రజలు మంత్రముగ్ధులై ఊపిరి తిప్పుకోకుండా కూర్చుండిపోయేవారు. ఆయన ఉపన్యాసం పూర్తికాగానే శ్రోతలు నూతన ధైర్యంతో, నూతన ఆశాభావంతో, కొత్త శక్తితో, కొత్త విశ్వాసంతో కదలివెళ్ళేవారు.

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: