telugudanam.co.in

      telugudanam.co.in

   

స్నేహం

స్నేహం

అమ్మ అనే పదం తర్వాత ఆత్మీయతను ధ్వనింపజేసే ఏకైక పదం స్నేహం. ఆ పద ధ్వనే అలౌకికానందాన్ని ఇస్తుంది. మండుటెండలో చలచల్లని ఐస్ క్రీం తింటున్న అనుభూతినిస్తుంది స్నేహం అనే భావన. చల్లని చలిలో వెచ్చని జ్ఞాపకాలను అందించే గతమే స్నేహం. నిర్వచనానికి అందని అతి సున్నితమైన ఫీలింగ్ స్నేహం. అందుకే మన తెలుగు కవి ఇంద్రగంటి హనుమచ్చాస్త్రి "సృష్టిలో తీయనిది స్నేహమేనోయీ" అన్నారు.చాలా కాలం క్రితం ఒక ఆంగ్ల పత్రిక "స్నేహం" అనే మాటకు ఉత్తమ నిర్వచనం చేసిన వారికి బహుమతి ఇస్తామని ప్రకటించింది. మామూలుగా కవులే కాక స్నేహ మాధుర్యాన్ని చవిచూస్తున్న అనేకమంది స్త్రీలు, పురుషులు ఎంతో ఉత్సాహంతో వేలాదిగా ఈ పోటీలో పాల్గొని తమకు సరియైనదని భావించిన నిర్వచనాలను పంపించారు. అందులో బహుమతి వచ్చిన ఒక నిర్వచనం "కాలాన్ని ఖచ్చితంగా తెలియజేసే గడియారమే స్నేహం" కాగా, మరోటి "నిన్ను పూర్తిగా తెలుసుకుని ప్రేమించినవాడే ఉత్తమ స్నేహితుడు". ఉత్తమోత్తమమైన వాటిలో ఒకటి "ప్రపంచం పూర్తిగా నశించినప్పుడు ఆప్తుడుగా ఆదుకునేవాడు స్నేహితుడు". రెండవది "నిన్ను పూర్తిగా తెలుసుకుని ప్రేమించేవాడే ఉత్తమ స్నేహితుడు".

స్నేహం మంచి స్నేహాన్ని సంపాదించుకోవడం అంత సులభం కాదు. సంపాదించుకున్న స్నేహం జీవితాన్ని చేస్తే అంతా సుఖమయం చేస్తుంది, లేకుంటే సర్వనాశనం చేస్తుంది. ఒక వ్యక్తి శీలాన్ని, గుణగణాలను అతడు పెంచుకున్న స్నేహాన్నిబట్టే నిర్ణయించగలం. ఒకరితో స్నేహం కలుపుకుని చెలిమిని పెంచుకోవాలని నిర్ణయించుకుంటే వారి స్థితిగతులను, జీవిత సరళిని, మనోవైఖరిని, వారి అలవాట్లను, అభ్యాసాలను పూర్తిగా తెలుసుకోవడం అవసరం. వారి నైజాని అర్ధం చేసుకుని వారి ఆలోచనలు, అనుభూతులు ఎలా ఉన్నవీ గమనించాలి. నిజమైన స్నేహితుల మధ్య రహస్యాలు ఉండవు. సమయానికి తగినట్లుగా తమ కష్టసుఖాలు ఒకరికొకరు పంచుకుంటారు. స్నేహంలో సుఖాలు పరస్పరం ప్రవృద్ధిని పొందుతాయి. దుఖాలు విభాజ్యాలవుతాయి. కష్ట సమయంలో కలత చెందిన మనసుకి శాంతిని కలిగించే దివ్య ఔషధం స్నేహం. అవసరమైనప్పుడు సహకరించడానికి ఆప్తమిత్రులు ఉన్నారనే భావం మన కష్టాలకు నివృత్తిని కలిగిస్తుంది. సుఖ సంతోషాలకు దోహదంచేస్తుంది. "మంచి స్నేహితుల చెలిమితో స్నేహాన్ని పెంపొందించుకోవాలంటే నీవు ఉత్తమ మిత్రునిగా రూపొందించుకోవాలి". మనం అభిలషించే స్నేహితులు, కావాలని కోరుకునే మిత్రులు, వారికోసం మనం చేసే ప్రయత్లాన మీద, ఉద్యమాల మీద ఆధారపడి ఉంటారు. అసలైన మిత్రులు మన స్వభావాన్నిబట్టి, గుణాన్నిబట్టి ఏర్పడుతున్నారుగానీ మనం ఇచ్చేదాన్నిబట్టి ఏర్పడడం లేదు. ఎక్కువ మంది స్నేహితులతో సౌభ్రతృత్వంతో సుఖమయంగా జీవించాలంటే ముఖ్యంగా గమనించదగ్గవి.....

  1. ఓర్పు, పట్టుదల: మంచి చెలిమితో స్నేహాన్ని బాగా పెంచుకోవాలంటే పట్టుదల ముఖ్యంగా ఉండాలి. పట్టుదలకు తగిన ఓర్పు కూడా అవసరం. సహనబుద్ధి లేకపోతే స్నేహం విడిపోతుంది.
  2. సౌహార్ద్రత, విశాల హృదయం: స్నేహితుల ప్రవర్తన అన్ని వేళల్లోనూ ఒకే రకంగా ఉంటుందనుకోలేం. మన చంచల బుద్ధికే ఒక్కొక్కప్పుడు వారి ప్రవర్తన తప్పుగా అనిపించవచ్చు. వారి పొరపాట్లను, లోపాలను పట్టించుకోకూడదు. మొండి వాదాలు పెంచుకోకూడదు.
  3. సత్యసంధత: ఇప్పటికైనా జయించేది సత్యమే. నిజమెప్పుడూ దాగదు అనేమాట మరచిపోకూడదు. స్నేహితుల మధ్య ఇబ్బందులు, కలతలు, చికాకులు కలగ
  4. కుండా ఉండాలంటే అబద్ధాలు చెప్పకూడదు. స్నేహితుల్లో కనిపించే మంచిని ప్రచారం చేయడానికి ప్రయత్నించాలి.
  5. సహనభావం: ఎదుటివారిని గౌరవించడం ముఖ్యం. ఇతరులను బాధ కల్గించే చలోక్తులు మంచీ కావు. ఒక్కొక్కప్పుడు ఇవి అపోహలకు దారితీస్తాయి.
  6. నిష్కాపట్యము: నిష్కాపట్యత, యోగ్యత వల్ల చెలిమి చిరకాలం వర్ధిల్లుతుంది. ఈ రెండు గుణాలు మానవుని సహజ స్వభావాలను ప్రకటిస్తాయి.
  7. ధైర్యోత్సాహాలు: పరస్పర స్నేహంతో సాధించలేని విజయముండదు. స్నేహితుల నైపుణ్యానికి, శక్తిసామర్ధ్యాలకు అసూయపడకూడదు. స్నేహితుల గుణగణాలను పొగడడం ఉత్తమ స్నేహితుని లక్షణం.
స్నేహం

నిజమైన స్నేహానికి భగవంతుడు ఇచ్చిన అపూర్వ కానుక నిష్కపటము, నిష్కలంకము అయిన ప్రేమ. ఏకొద్దిమందో ధన్యులు సహజమైన స్నేహభావాలతో జన్మిస్తారు. విశాల హృదయంతో నిజాన్ని నిలబెట్టుకుంటూ ఆత్మ సంతృప్తి కోసం మంచిని చేస్తూ స్నేహాన్ని ప్రవృద్ధి చేసుకోవాలి. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇద్దరు వ్యక్తుల మధ్య స్నేహం తెరిచిన పుస్తకంలా ఉండాలి.



Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: